Wednesday, 3 September 2025

031


మానవ చరిత్రలో శారీరక మానసిక స్థితులు ఒకేలా ఉన్న మనుషులు ఇద్దరు పుట్టలేదు. అంతేకాదు ఒకే సమయంలో పుట్టిన వారందరూ ఒకేలాగా జీవించలేదు. దీనికి ఒకే కారణం వారి ప్రాణశక్తి లో ఉన్న తేడాలు. వ్యక్తి రూపాన్ని వ్యక్తి శీలాన్ని నిర్ణయించేది ఈ ప్రాణశక్తి. మనుషుల్లో ఉన్న వైరుధ్యాలన్నీ ఈ ప్రాణశక్తి లో ఉన్న వైరుధ్యాలే. ఈ రహస్యం తెలిసిన సనాతనులు అనాది నుంచి ప్రాణశక్తిని పెంచే సాధన విధానాలను సూక్ష్మీకరించారు. వాటిలో ప్రాణాయామం ప్రధానంగా ఉన్న హఠయోగం. మంత్ర శబ్దం ప్రధానంగా ఉన్న సహజ యోగం చెప్పుకోదగిన ప్రాచుర్యాన్ని పొందాయి. ఏది ఏమైనా ప్రాణశక్తిని తగిన మోతాదులో పెంచుకోగలిగితే తప్ప మనిషి గుణవంతుడు, ప్రతిభావంతుడు, సౌశీల్యవంతుడు, ఉత్తముడు అవలేడు. అందుకే అందరూ ప్రాణ శక్తిని పెంచుకునే సాధనలు ఏమిటో తెలుసుకుని వాటిని చేసుకోవాలి. 

030


మనిషికి ముఖ్యంగా ఉన్న సమస్యలు మూడే. ఒకటి అనుకున్నది అవటం లేదు. రెండు ప్రయత్నించినా ఫలితం అందటం లేదు. మూడు కష్టపడినా కలిసి రావటం లేదు. ఈ సమస్యలున్న మనుషులు జాతకాలని గుళ్ళో పూజలని నమ్ముతున్నారు. నిజానికి జీవిత సంబంధమైన సమస్యలకు జీవిత సంబంధమైన పరిష్కారాలే ఉత్తమం. ఉదాహరణకి ఆకలి సమస్యలు ఉంటే బిచ్చగాడికి అన్నం పెట్టచ్చు, ఆర్థిక సమస్యలు ఉంటే లేని వాడికి ఒక రూపాయి ఇవ్వచ్చు, మనసు బాగా లేకపోతే వృద్ధులకు సేవ చేయచ్చు,  కనీసం కష్టాల్లో ఉన్న వారిని రక్షించమని దేవుని ప్రార్థించచ్చు. అంతే తప్ప సెల్ఫోన్ చూసుకుంటూ కష్టాలు తీరాలంటే తీరవు. రాగద్వేషాలకు అరిషడ్వర్గాలకు దూరమయ్యే ప్రయత్నం చేస్తూ ఉండటం బాహ్య తపస్సు అని అనుభవజ్ఞులు చెప్పారు. నమ్మండి. బాహ్య తపస్సు వల్ల బాహ్య జీవితం సుఖప్రదం అవుతుంది. ఇది నిజం. 

Monday, 1 September 2025

029


వెయ్యిళ్ళ కొత్త సహస్రాబ్ది వందేళ్ళ కొత్త శతాబ్ది మొదలై 25. సంవత్సరాలు గడిచింది. ఇప్పటివరకు చోటు చేసుకున్న మార్పుల్లో అత్యంత ప్రధానమైనది ఏంటి అంటే 15 ఏళ్ల వయసుకే మనిషికి జీవితం అంటే ఏంటో స్పష్టంగా తెలిసిపోయింది. జీవితంలో ముఖ్యమైనది డబ్బు అని ఇంకా స్పష్టంగా తెలిసిపోయింది. అయితే వెయ్యేళ్ళుగా పోగు చేసుకుంటూ వస్తున్న విలువలు మాత్రం ఆదరణ కోల్పోయాయి. ఆత్మ తేజస్సుతో సాగించే జీవన విధానం మరుగున పడిపోయి తార్కిక మేధస్సుతో సాగించే జీవన విధానానికి ప్రాచుర్యం పెరిగింది. అనుభవం చెప్పే మాటలు కంటే ఇంటర్నెట్లో వినపడే మాటలే అందరికీ నచ్చుతున్నాయి. కలిసున్న తరాలు ఇప్పుడు ఒంటరితనాలు అయాయి. పరిస్థితి మారాలంటే ప్రతి ఒక్కరూ సమర్పణ బుద్ధితో సత్కర్మలు చేయటం ఒక ఉద్యమంగా ప్రారంభించాలి.