Monday, 18 August 2025

015

ప్రపంచంలో అందుబాటులో ఉన్న సుఖాలను అనుభవించడమే జీవితం అని అనుకుంటూ ఉంటాడు మనిషి. అందుకే తన జీవితం మొత్తాన్ని ఆస్తులు సంపాదన కోసం అంకితం చేస్తాడు. అయితే ఏ మనిషికి అర్థం కాని విషయం ఏమిటంటే ప్రపంచం ఇలాంటి ఆటిట్యూడ్ ని అక్షరముక్క కూడా ఒప్పుకోదు. ప్రపంచంలో అన్ని సుఖాలు దొరుకుతున్న మనిషికి ఆవగింజంత ఆనందం కూడా దొరకదు అన్న సత్యమే దీనికి సాక్ష్యం. దురదృష్టం ఏమిటి అంటే ప్రపంచానికి మనిషి ఆలోచనలు అభిప్రాయాలతో సంబంధం లేదన్న సత్యం ఎవరికీ తెలియదు. తన కష్టాలు తీరాలి అంటే ప్రపంచంలో ఇంకా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటాడు మనిషి. అలాంటి మనిషికి ఆనందం పొందే అవకాశం ఎప్పటికీ రాదు. ప్రతి మనిషికి అన్నిటికంటే ముఖ్యం అంతరంగంలో ఆనందమే కానీ ప్రపంచంలో ఉన్న సుఖాలు కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న మనిషి ఒక్కడే ప్రపంచాన్ని ఉపయోగించుకుంటూ నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. 

Sunday, 17 August 2025

014

మనిషి చైతన్యవంతమైతేనే సుఖపడగలడు. దానికి అడ్డు పడేవి దేహం మనసు ద్రవ్యం అనే జడ పదార్థాలు. దేహం ఎప్పుడూ సుఖంగా ఉండాలని, మనసు ఎప్పుడూ వినోదంగా ఉండాలని, ద్రవ్యం నిల్వలు రోజూ పెరగాలని తపించటమే మనిషి జీవన సుఖాన్ని దూరం చేసే జడత్వం. ఈ జడత్వమే మనిషికి కష్టనష్టాలను సృష్టిస్తుంది. జడ పదార్థాలైన దేహము మనసు డబ్బు గురించిన ఆలోచనలు అభిప్రాయాలే మనిషి జీవితాన్ని నడిపిస్తున్నాయి, ఏడిపిస్తున్నాయి కూడా. అందుకే ఈ జడత్వాన్ని వదిలించి ఆనందాన్ని కలిగించే క్రియలు ఏమిటో తెలుసుకుని ఆచరించాలి. మన సంతోషం కోసం మనం చేసుకునేవి నియమం పూజ మంత్రం ఎలా ఉన్నాయో అలాగే మన చైతన్యం కోసం ఇతరులకు చేయాల్సినవి సేవ సద్భావన దానం అనేవి ఉన్నాయి. ఇలా తన మేలు కోసం ఇతరుల మేలు కోసం ధార్మికమైన పనులు చేసే వ్యక్తినే కర్మయోగి అంటారు.

Saturday, 16 August 2025

013

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ సృష్టికి ఉన్న ప్రధాన లక్షణం ఏంటి అంటే మార్పు చెందటం. మానవ జీవితం కూడా సృష్టి లక్షణానికి అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పులు జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చడం కోసం వస్తాయి. అందుకే సృష్టి లక్షణంగా జీవితంలో వచ్చే మార్పులకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్లు సంతోషంగా ఉంటారు. ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సూత్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎవరి జీవితంలోనూ ఘర్షణ ఉండదు. అందుకే మార్పులకు అనుగుణంగా మనిషి మారటం కోసం జీవన నియమాలు వచ్చాయి. ఈ నియమాలను పాటిస్తే జీవితం దృఢంగా బలోపేతంగా తయారవుతుంది. ఆ జీవితం సుఖసంతోషాలకు కష్టనష్టాలకు అతీతంగా ఆనందంగా ఉంటుంది. 

012

ప్రతి మనిషి నేను అనే భావనతో జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ జీవితం అవేవీ పట్టించుకోదు. తన మానాన తన కదులుతూ ఉంటుంది. అంటే మనిషి వెంట జీవితం నడవదు, జీవితం వెంటే మనిషి నడుస్తూ ఉంటాడు అన్నమాట. అలా జీవితం వెంట మనిషి నడుస్తూ ఉండటమే కర్మ జీవనం. దీనినే నిర్ధారితమైన జీవితం అంటారు. దానిలో ఉండే కష్టనష్టాలు మారవు. అయితే వాటి తీవ్రతని చిక్కదనాన్ని తగ్గించుకోవచ్చు. అందుకోసమే జీవన నియమాలు దేవుని పూజలు మంత్ర జపాలు ఉన్నాయి. ఇదంతా భక్తి అనుకున్నా అది భగవంతుని కోసం కాదు మన జీవనంలో కష్ట నష్టాలు తగ్గటం కోసం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. దీనినే ధర్మ జీవనం అంటారు. ఇలా నియమాన్ని దైవాన్ని మంత్రాన్ని నమ్ముకుని ధర్మ జీవనాన్ని నిష్టగా పాటించే సభ్యులు ఉన్న కుటుంబాలే సుఖసంతోషాలకు చేరువ అవుతాయి. 

Friday, 15 August 2025

010

ప్రపంచం ఎవ్వరికీ రుణపడి ఉండదు. ఈ ప్రపంచంలో ఒకడు గొప్పవాడు అయ్యాడు అంటే అది అతని కర్మ. ఈ ప్రపంచంలో ఒకడు సామాన్యుడుగా ఉండిపోయాడు అంటే అది అతని కర్మ. మనిషి జీవితాన్ని నిర్ణయించేది కర్మ తప్ప వాళ్ల వాళ్ల అభిప్రాయాలు ఆలోచనలు ప్రయత్నాలు తెలివితేటలు కాదు. ఒకరి కష్టనష్టాలకు ఇంకోళ్లు కారణం అసలే కాదు. ఎవ్వరి జీవితమైనా కాలం కర్మ కలిసి వచ్చినంత మేరకే వికాసం చెందుతుంది. తను చేసుకున్న పనులకు ఎదురైన ఫలితాలను తాను సరిదిద్దుకోవాలి తప్ప ఇతరులను నిందించరాదు. జీవితం అనేది వ్యక్తిగతం. ఇతరుల ప్రమేయం కానీ ప్రభావం కానీ ఉంటుంది అనేది కేవలం భ్రమ. ఈ వాస్తవాన్ని తెలుసుకుని ఎవరికి వారు తమ సుఖ సంతోషాలకు కారణమయ్యే కర్మలు ఏమిటో తెలుసుకొని చేసుకుంటూ ఉండాలి. మర్చిపోవద్దు. ఇంకో ఉపాయం లేనేలేదు. 

Wednesday, 13 August 2025

009


ఈ ప్రపంచం కాల లక్షణానికి లోబడి ఉంటుంది. మనిషి కర్మ ప్రభావానికి లోబడి ఉంటాడు. అందుకే వ్యక్తుల అభిప్రాయాలకు ప్రపంచ పోకడలకు సంబంధం ఉండదు. కాల సూత్రానికి కర్మ ప్రభావానికి అనుగుణంగా పుట్టిన మనిషి తన కర్మ ని శుద్ధి చేసుకోవడానికి ఈ ప్రపంచం ఒక వేదిక. అంతకుమించి ప్రపంచంతో మనిషికి ఎలాంటి సంబంధం లేదు. మనిషికి కేవలం తన కర్మతోనే సంబంధం. ఆ కర్మ ఆధారంగా ఈ ప్రపంచంలో కాలం ఇచ్చే అవకాశాల మేరకు మనిషి జీవిస్తాడు. ఆ అవకాశాలు ఇక లేనప్పుడు మనిషి మరణిస్తాడు. జీవుడు ఎప్పటికీ ఒంటరి. కర్మ తప్ప ఇంకే తోడు అతనికి ఉండదు. అందుకే మనిషి ప్రపంచంలో ఎంత ఎగబడినా అతని కర్మ పరిధికి మించి పొందలేడు. అలా కాలం కర్మ ప్రపంచం అనే త్రిభుజం మధ్యలో మనిషి తిరుగుతూ ఉండాల్సిందే. అంతకుమించి ఏమన్నా కావాలంటే మనిషి ఆధ్యాత్మ విద్యని నేర్చుకోవాల్సిందే. 

Tuesday, 12 August 2025

008

నీ జీవితం యొక్క ప్రతి క్షణంలో ప్రతి అణువులో నీ మనసు నీ శరీరం యొక్క ప్రమేయం ఉంది. అసలు జీవితం అంటేనే నీ శరీరము మనసు చేసే కార్యకలాపాలు. వీటి మూలంగానే మనిషికి కోరికలు ఆశలు పుడుతూ ఉంటాయి ఇవి ఇలా ఉంటే తన ప్రమేయం లేకుండా వచ్చేటువంటి ఆలోచనలు అభిప్రాయాలు ఆ కోరికలను ఆశలను పెంచి పోషిస్తూ ఉంటాయి కేవలం ఈ ఒక్క చర్య వల్ల మాత్రమే మనిషి జీవితం గందరగోళం అవుతుంది. అంటే శరీరము మనసుని క్రమశిక్షణలో పెట్టుకోకపోతే జీవితమే క్రమశిక్షణను కోల్పోయి గందరగోళానికి గురి అవుతుందన్నమాట. అందుకే శరీరాన్ని మనసుని క్రమశిక్షణలో పెట్టుకుంటే ఆలోచనలు అభిప్రాయాలు బాగా తగ్గిపోయి కోరికలు ఆశలు అదుపులో ఉంటాయి. అలా నియమంతో సాగించే జీవనం వల్ల మాత్రమే మనిషి నిత్యానంద స్థితిని అనుభవిస్తూ తృప్తికరమైన జీవితం సాగిస్తాడు. 

007

జీవితం అంటే తనకు ఎదురైన సంఘటనలలో ప్రవర్తిస్తూ తనకు తారసపడిన మనుషులతో వ్యవహరిస్తూ రోజులు గడిపేయడం కాదు. తనను గురించి తాను తెలుసుకుంటూ తను ఆనందంగా ఉండటం మొదటి పని. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఆ ప్రపంచానికి ఆనందంగా తానుండటం రెండో పని. ఈ పనులు చేయకుండా తన సుఖం కోసం వెంపర్లాడుతూ ఉండటం వల్లే మనిషి కష్టపడుతున్నాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల వస్తువుల వల్ల విషయాల వల్ల కలుగుతున్న సుఖంతోటి ఏ మనిషి మనశ్శాంతిని పొందలేడు. తనలోనే ఉన్న సమర్థత వల్ల మాత్రమే తనకి ఆనందం మనశ్శాంతి కలుగుతాయి. ఆ సమర్థత ఏమిటి దానిని ఎలా పెంచుకోవాలి అనేదే మనిషి తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం. అందుకోసం తన జీవితాన్ని తానే క్రమశిక్షణలో పెట్టుకోవాలి తప్ప ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనే ప్రయత్నాలు మానుకోవాలి. 

006

నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు అని ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు. నిజం చెప్పాలంటే ఎదుటి మనిషిని అర్థం చేసుకుని జీవించాలనే నియమం ఎక్కడ లేదు. మరి ఎందుకని చాలామంది నన్ను అర్థం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఇది ఒక రకమైన మానసిక బలహీనత. మనోధైర్యం ఉన్నవాళ్లు ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటారే తప్ప నన్ను అర్థం చేసుకోండి అని ఎదుటి మనిషిని అడగరు. ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఏ వ్యక్తి అయినా తన కర్మానుసారం తనకున్న పరిణితి మేరకు వ్యవహరిస్తాడు తప్ప ఎదుటి వారి భావోద్వేగాలకు అనుగుణంగా ప్రతిస్పందించడం అసాధ్యం. అందుకనే అవసరాలకి అనుగుణంగా కదిలే మనుషుల మధ్య మనం అర్థం చేసుకుని బతకాలే తప్ప మనల్ని అర్థం చేసుకోవాలనడం వెర్రితనం. అందుకనే ఎదుటివారు మనోధైర్యంతో బతకాలని ఎవరికివారు కోరుకోవాలి తప్ప మన మానసిక బలహీనతతో ఎదుటివారిని అర్థం చేసుకోవాలి అంటూ ఇబ్బంది పెట్టకూడదు.. 

Sunday, 10 August 2025

005

మనిషి పుట్టింది తనని తాను ఉద్ధరించుకోవడానికి. మరెందుకు కాదు. ఈ విషయాన్ని ప్రతి రోజు గుర్తు చేసుకోవాలి. తన మనసుకు అనిపించినట్టుగా వ్యక్తుల మీద వస్తువుల మీద విషయాలు మీద ప్రతిస్పందిస్తే జీవితం నరకప్రాయం అవుతుంది. తనని తాను ఉద్ధరించుకోవడం అంటే తనకు కలిగే అభిప్రాయాలను తనకు కలిగే ఆలోచనలను అదుపు చేసుకోవటం. వ్యక్తుల వల్ల వస్తువుల వల్ల విషయాల వల్ల తన జీవితంలో ఏర్పడే సంఘటనలకు సంబంధాలకు తాను గాని ఇంకెవరు గాని కర్తలు కాదు అన్న విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.  తన శరీరం వల్ల తన మనసు వల్ల తనకేదో గొప్పతనం ఉంది అని అనుకోవడం వల్లనే జీవితం మొత్తం సంఘర్షణగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు సరిగ్గా ఉంటేనే మీరు ఆనందంగా ఉంటారు.

004

కోరికలు తీరక తృప్తి కలగక మనిషి నిరాశపడుతూ ఉంటాడు దీనికి కారణం జీవితం అంటే ఏంటి అది ఎలా పని చేస్తుంది అనే విషయం తెలియకపోవటమే. జీవితంలో అదేదో కావాలి అని అడిగినప్పుడు ఆ జీవితం నీకు అది ఎందుకు ఇవ్వాలి అని కూడా ప్రశ్నించుకోవాలి. కోరిక లేకుండా మనిషి ఎలా ఉండగలడు అని ఎదురు ప్రశ్నించడం కాదు. ఆ కోరిక నాకు ఎందుకు కలిగింది అని తనని తాను ప్రశ్నించు కోవాలి. నిన్ను నువ్వు విశ్లేషించుకోకుండా ఈ జీవితంలో నేనేం సుఖపడ్డాను అని ప్రశ్నించటం సరికాదు. ఎందుకంటే నువ్వు జీవితం ఒకటే. నీకు నువ్వు నచ్చి నీ జీవితం నీకు నచ్చలేదు అంటే జీవితం అంటే ఏంటో ఇంకా నీకు సరైన అవగాహన కలగలేదు అని అర్థం. ఇప్పటికైనా జీవితం ఏంటి, ఎలా వచ్చింది, ఎలా నడుస్తుంది, ఎలా ముగిసిపోతుంది, దానికి నాకు సంబంధం ఏంటి అనే ప్రశ్నలకి సమాధానాలు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడే కోరికలు తగ్గి తృప్తి పెరుగుతుంది. 

Tuesday, 5 August 2025

003

ప్రతి మనిషి ఉత్తమ గతులు పొందటం కోసం జన్మ తీసుకుని తన ప్రయాణం సాగిస్తూ ఉంటాడు కర్మ ప్రకారం తప్పులో ఒప్పులో చేసుకుంటూ వీలు చిక్కినప్పుడు తనని తాను సరిదిద్దుకుంటూ కదులుతూ ఉంటాడు ఈలోగా భార్య భర్త కూతురు కొడుకు స్నేహితుడు పక్కింటి వాడు ఎవడో ఒకడు వచ్చి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని వ్యాఖ్యానిస్తే కుదరదు. ఎవరి కర్మ వారిది నమ్మి తీరాలి. ఒకరికి తగినట్టు మరొకరు నడుచుకోవాలి అనేది జీవన నియమం కాదు ఎవరికివారు తమకి ఉత్తమ గతులు ఎలా కలుగుతాయో తెలుసుకుని ఆ ప్రకారం జీవించాలి. ఎవరి జీవితం వారి బాధ్యత. ఒకళ్ళు ఇంకొకళ్ళ జీవితం గురించి వ్యాఖ్యానించే అర్హతలు ఏ కాలంలోనూ లేవు. తన జీవితానికి ఏది మంచిదో తెలుసుకునే ఆసక్తి అందరిలో ఉంటేనే సంబంధాలు బాగుంటాయి. అందరి నుంచి అన్నీ ఆశించటం కంటే తన కర్మ పరిధిలో తను జీవించడమే శ్రేయోదాయకం. 

Monday, 4 August 2025

002

జీవితమంత చిన్న విషయం ఈ బ్రహ్మాండంలో ఇంకోటి లేనేలేదు నీకు వ్యక్తుల వల్ల వస్తువుల వల్ల విషయాల వల్ల ఏర్పడిన సంఘటనలు సంబంధాలు తప్ప జీవితంలో ఇంకొకటి లేనేలేదు నువ్వు వందేళ్లు బతికినా సరే ఈ ఒక్క వాక్యమే జీవితమంతా దీని మీద నీకు కలిగే అభిప్రాయాలు ఆలోచన వల్ల మాత్రమే జీవితం గొప్పగా అనిపిస్తుంది కానీ అందులో సారం ఏమాత్రం లేదు కాబట్టే నువ్వు మానసికంగా నిత్యం కుమిలిపోతూ ఉంటావు అందుకనే ఆలోచనలు అభిప్రాయాలు లేకపోతే జీవితం ఆనందంగా ఉంటుంది. అందుకే వ్యక్తులు విషయాలు వస్తువులు వల్ల నీకు ఎదురయ్యే సంబంధాలు సంఘటనలపై నీకంటూ ఆలోచన అభిప్రాయం లేకపోతే నువ్వు ఋషితో సమానం అని పెద్దలంటారు. బతకడం అంటే సాధించటం కాదు మనలో మార్పు తెచ్చుకోవటం. మనిషిగా పుట్టిన మనం ఋషిగా మారగలిగినప్పుడే జీవితం సార్థకమైనట్టు. 

Sunday, 3 August 2025

001

ఈ సృష్టిలో మనిషి ఓ అద్భుతం. తను బ్రహ్మ అని తెలుసుకోగలడు తన చుట్టూ ఉన్నది బ్రహ్మాండమని తెలుసుకోగలడు. అయితే మనిషి ఈ పనులు మానేసి ప్రపంచాన్ని తన అవసరం కోసం బలవంతంగా ఉపయోగించుకుంటూ ప్రతిక్షణం తను సుఖంగా ఉండాలి అన్న వ్యసనంలో మునిగిపోయాడు. ప్రపంచానికి నియమాలు ఉన్నాయని తన జీవితానికి పరిమితులు ఉన్నాయని మర్చిపోయి బాధలు పడుతున్నాడు. సూత్రం ఏమిటి అంటే జీవితానికి పరిమితులు ఉన్నాయి అని తెలిస్తే కోరికలు తగ్గిపోతాయి. ప్రపంచానికి నియమాలు ఉన్నాయి అని తెలిస్తే ఆశలు తగ్గిపోతాయి ఇలా కోరికలు ఆశలు అదుపులోకి వచ్చిన మనిషి మాత్రమే తను సుఖపడి తన కుటుంబాన్ని సుఖపెట్టగలుగుతాడు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేకాదు తన జీవితానికి చోటు కల్పిస్తున్న ఈ ప్రపంచం ప్రకృతి పనితీరు గురించి తెలుసుకోవాలి.