ఈ చరాచర సృష్టి అంతటినీ నియంత్రిస్తున్నది ఆద్యంతాలు లేని ఓ మహత్తరశక్తి అనే విషయాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మహర్షులు గమనించారు. ఆ శక్తిని దైవంగా భావించి పూజించారు. ఆ దైవాన్ని చేరుకోవాలని, పూర్తిగా తెలుసుకోవాలని తపించారు.
ఇలా వారి హృదయాల్లో రగిలిన తపన క్రమంగా అనేక పారమార్థిక చింతనలకు దారితీసింది. ఈ చింతనల నుంచి విలక్షణమైన శాస్త్రాలు పుట్టుకువచ్చాయి. వీటిలో యోగశాస్త్రం ఒకటి. ఈ శాస్త్రానికి ఎంతో ప్రత్యేకత, పవిత్రత ఉన్నాయి. యోగంలో పరిపూర్ణత సాధించినవాడు ద్వాపరయుగంలోని శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే.
నిర్మలమైన అంతఃకరణానికి ప్రేరణ కలిగించే అంతర్యామి తత్త్వమైన ఓంకారాన్ని మూలంగా చేసుకుని అలౌకిక భావనలను అన్వేషిస్తూ జీవనాన్ని కొనసాగించడమే యోగసాధన. ప్రాణాయామం, కుండలినీ జాగృతమనే క్రియలు యోగంలో ఒక భాగమే కానీ .. వాటి అభ్యాసమే యోగం కాదు.
యోగ ప్రక్రియ వల్ల మనస్సు - శరీరం పరమాత్ముడి అనంత సామర్థ్యాలను గ్రహించగలిగే స్థాయికి చేరుకుంటాయి. ఒకసారి ఆ శక్తి మానవుడికి లభించిందంటే అతడు దైవాంశను కలిగిఉంటాడు. అదే మానవుని మోక్షానికి మార్గం అవుతుంది.
No comments:
Post a Comment