Thursday, 30 April 2026
శక్తి - పదార్ధం - సమాధి
యజ్ఞం - పరమార్ధం
Wednesday, 29 April 2026
మంత్రమే మోక్ష కారకం
జీవితం - పరమార్ధం
నియమ జీవనమే ఆథ్యాత్మిక జీవనం
'నాకు తెలుసు(లే)'
'నాకు తెలుసు(లే)' అని అనని, అనుకోని మనిషి ఉండడు. కానీ మనిషికి ఏమన్నా తెలుసా లేక ఏదైనా తెలుసుకోగలడా అనేది ప్రశ్న. ఎవ్వరికైనా తెలియనిది అంటూ ఏదో ఒకటి ఉంటుంది. నూటికి కనీసం ఓ 60 మంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు కాబట్టి అంత ఇబ్బంది లేదు.
ఇక .. నాకు తెలుసు అన్న విషయం గురించే అసలు ఇబ్బంది. నూటికి 99 మంది అంటున్న ఈ తెలుసు అన్నదాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇంతకీ మనిషికి తెలిసింది ఏంటి, తెలుసుకోగలిగినది ఎంత? తెలివితేటలని పొరలు పొరలుగా విడదీస్తేనే తప్ప అసలు రంగు బయటపడదు.
నిప్పు కాలుతుందని అందరికీ తెలుసు. కానీ జీవితంలో ఒక్కసారైనా అందరికీ కనీసం వేలైనా చుర్రుమని అనే ఉంటుంది. ఏం? తెలియడం వల్ల 'సంఘటన'ని నియంత్రించడం ఎవరి వల్లా కాదు. ఆట ఎంత తెలిసినా సచిన్ సైతం అవుట్ అవ్వాల్సిందే. అందుకే 'తెలుసు, తెలివితేటలు' వంటి పదాలు కాలగమనంలో మనిషిని గట్టెక్కించ లేవు.
తనలో కలిగిన భావానికి కారణం తెలియడమే అసాధ్యమైనప్పుడు, కాలంలోని విషయాలకి భాష్యం చెప్పటం అమాయకత్వం. అందుకే మనిషి ముందుగా తెలుసుకోవాల్సింది తన గురించే అని ఆథ్యాత్మికం కరాఖండిగా చెప్పింది. నీ గురించి నీకు తెలిసేంత వరకూ నీకు ఇంకేదీ తెలిసే అవకాశమే లేదు అనేది సూత్రం. ఈ సూత్రంలో ఉన్న మర్మం తెలియాలంటే .. ప్రతి విషయాన్నీ 'ఎందుకు' అని ప్రశ్నించాలి.
తన ఆలోచన, మాట, చేత, కదలిక .. అలా ఎందుకు ఉంది అని ప్రశ్నించుకుంటే, ఎవరి అజ్ఞానం వారికే కనిపిస్తుంది. ఉదయం నుంచీ రాత్రి వరకూ జరిగిన ప్రతి అంశమూ ఎందుకు అలా జరిగిందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ 'నేను' ఎవరో తెలిసిన వారికి సాధ్యం.
మనసుకి ఆపాదించుకునే లక్షణం ఉంది. అందుకే ఎవరికి వారు నేను, నా అభిప్రాయం అంటూ మాట్లాడుతుంటారు. కానీ మనిషికి సంఘటనలను నడిపించే సామర్ధ్యం, స్వాతంత్య్రం ఉండనే ఉండదు. ఆ సంఘటనలలో తను అప్రమేయంగా కదిలిపోతున్నా .. తన ప్రమేయాన్ని ఆపాదించుకుని కబుర్లు చెప్పడం మనసు చేసే కోతిపని.
కాబట్టి మనసు ఆ పని చేయకుండా నిఘా ఉంచాలి. నిఘా ఉందని తెలుస్తే దొంగ కూడా నిజాయితీగా ఉంటాడు. కానీ మనసుపై నిరంతరం నిఘా ఉంచడం సాధ్యపడదు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా దొంగతనం చేసినవాడికి శిక్ష ఉంది కానీ దొంగతనాన్ని ఆలోచించిన వాడికి శిక్ష లేదు. నేరపూరితమైన ఆలోచనకి శిక్ష వేయగల సమర్ధత ఈ ప్రపంచానికి లేదు. దొంగతనం అంటే వ్యక్తి చర్య అని మాత్రమే సంఘం గుర్తించగలదు. చర్యకి కారణమైన ఆలోచన రాకుండా చేయడం, అలాంటి ఆలోచనకు మూలమైనదాని స్వభావాన్ని మార్చడం ఏ మనిషి వల్లా, ఏ వ్యవస్థ వల్లా సాధ్యపడదు.
కానీ మనిషి .. 'నేను' అనుకుంటున్న మనసును పుఠం పెడితే .. అసలు చర్య యొక్క రూపమే మారిపోతుంది. అలా మనసు స్వభావాన్ని మార్చేదే మంత్రం. అనంతమైన 'నేను' మనిషికి అనుభవమవాలంటే .. మనసు మౌనంలోకి వెళ్లాల్సిందే. మౌనం అంటే మరో ధ్యాస లేని పనిలో నిమగ్నమవడం. మనసుని మౌనంలోకి తీసుకెళ్లగలిగినది జపం ఒక్కటే.
అందుకనే ముందుగా 'నేనేవరు' అనే ప్రశ్నని పదేపదే సంధిస్తూ ఉండాలి. అపుడు నీరు పల్లమెరుగు అన్నట్టు మనసు మౌనంలో విరాగమవుతుంది. క్రమేపీ ఆపాదించుకునే లక్షణానికి దూరమవుతుంది. తద్వారా మనిషి తాను దేనికీ కర్త కానని గ్రహించగలుగుతాడు. అలా ఈ భౌతిక జీవనంలో తను చేసేది, పొందేది ఏదీ లేదని ఎరుకగలిగిన స్థితిలో ఉండగా జీవుడు అనంతంలోకి విస్తరించే ప్రక్రియ .. శ్రీకారం చుట్టుకుంటుంది. అంతటా వ్యాప్తి చెందిన జీవుడే అసలైన .. పూర్ణమైన ''నేను''.
మనసు మిత్రుడా శత్రువా
ప్రతి మనిషీ తన దేహాన్ని ఉద్దేశించి ‘‘నేను’’ అని ప్రకటిస్తూ ఉంటాడు. ఆ దేహం ఇంద్రియాలకు నిలయం. ప్రాణంతో ఉన్న దేహం నుంచి అందిన శక్తితో కదిలే ఇంద్రియాలే .. జడ స్వరూపమైన మనసును చైతన్యం చేస్తాయి. చైతన్యమైన మనసు ఆ (మనిషి చెప్పుకునే) ‘‘నేను’’ను స్వాధీనం చేసుకుని ఇంద్రియాలు అనే గుర్రాల మీద సవారీ చేస్తూ ఉంటుంది.
కానీ ఈ స్వారీని .. ‘నేనే’ చేస్తున్నాను అనుకుని మనిషి మురిసిపోతూ ఉంటాడు. కొన్నేళ్లకి వయోభారంతో దేహంలో ప్రాణశక్తి క్షీణించి ఇంద్రియాలకు ముసలితనం వస్తుంది. ఆ ముసలి (ఇంద్రియాలపై) గుర్రాలపై స్వారీ చేయలేక మనసు చతికిబడుతుంది. దాంతో పాటు మనిషి కూడా చతికిలబడక తప్పదు. ఈ పరిస్థితికి ఏ మనిషీ మినహాయింపు కాదు. ఇది ప్రకృతి నియమం.
ఇంద్రియాల ఆసరాతో గంతులేసే మనసుకు ఇంద్రియాతీతంగా వికసించే లక్షణం కూడా ఉంది. ఎవరికైతే ‘నేను వేరు, మనసు వేరు’ అనే ఎరుక ఉంటుందో వారి మనసు మాత్రమే వికసించే దిశగా ప్రయాణిస్తుంది. ఆ మనసే దృశ్య భౌతికం (ప్రపంచం) కాకుండా అధిభౌతికం (మరో ప్రపంచం) ఉందని గ్రహిస్తుంది. దానినే మానసిక వికాసం అంటారు.
ఇలా మనసును వికసింప జేయగల శక్తిసామర్ధ్యాలు మేధస్సుకు ఉండవు. మేధస్సు .. దృశ్య (ఇంద్రియ) చింతన పరిధిలో ఉంటుంది. ఇది పరిమితం. మనోవికాసం .. తత్వ (ఇంద్రియాతీత) చింతన పరిధిలో ఉంటుంది. ఇది అపరిమితం. మేధావులు శాస్త్రాలను ప్రమాణంగా తీసుకుని తర్కం అనే కోట కట్టుకోగా, తాత్వికులు అనుభవాన్ని ప్రమాణంగా తీసుకుని అనుభవ సారాన్ని అందరికీ పంచారు.
మేధావుల సిద్ధాంతాలు ఇజాలుగా, తాత్వికుల అనుభవాలు మతాలుగా ప్రపంచంలో పాతుకు పోయాయి. వాస్తవానికి ఇజాన్ని విశ్వజననీయం చేయడం అసంభవం. అలాగే అనుభవాన్ని అక్షరబద్ధం చేయడం అసంభవం. ఈ సూత్రంలోని మర్మం మనిషి జీవితానికి చుక్కాని అయినప్పుడే నిత్య జీవనం ఆనందమయం అవుతుంది.
Tuesday, 28 April 2026
మంచి విషయాలు
తపస్సు అంటే మనస్సుని క్రమంగా (ఎన్నేళ్లకో తెలీదు) ‘మరొకటి’ తనలో కలిపేసుకునే సాధన చెయ్యడం. దానికి మోహం ఒక్కటే అడ్డు. ఆ మోహానికి దేహం ఆధారం. దేహానికి ఆహారం ఆలంబన. ఆహారానికి ‘ఆర్థికం’ అవసరం. దానికి మూలమైన మోహం నుంచి తప్పుకోవడానికి యాచన (భిక్షాందేహీ) మాత్రమే మార్గం.
ఏ మనిషీ తనకు తెలిసిన దానితో జీవితమంతా ఆనందంగా గడపలేడు. ఏ మనిషీ తన ఆనందం కోసం సమస్తాన్నీ తెలుసుకోలేడు. ‘తను’ సత్యం, తను పొందాల్సిన ‘ఆనందం’ సత్యం. ఆ సత్యానుభవమే ‘అహం బ్రహ్మస్మి’.
‘ప్రయత్నం’ మానసికం అయినప్పుడు జయాపజయాలు తప్పవు. అదే ప్రయత్నం ‘‘దైవికం’’ అయినప్పుడు అంతా ఆనందమే. ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే మనందరి కర్తవ్యం.
ప్రతి పనిని మన ప్రతిభతో కాకుండా దైవ భావనతో చేపట్టినపుడు, నైపుణ్యం పెరగడమే కాకుండా, ఆనందం రెట్టింపు అవుతుంది. ‘దైవం .. మన ఆనందం కోసం’ అన్న భావనే ఆధ్యాత్మికానికి పునాది.
LISTEN.
Do not speak, do not see.
LISTEN.
Close your lips, close your lids.
LISTEN.
The ability to 'do' can be acquired only when the humility to listen manifests. 'Doing' is the fascinating result of attentive listening. A person can not understand beyond his/her mind unless he/she listens to the 'experienced' with submission. Are you ready to listen? Enjoy the life however it unfolds.
ఆకలితో ఉన్నవాడికి అన్నం ముఖ్యం కానీ, ఆత్మజ్ఞానం కాదు అని ఆదిశంకరులు చెప్పారు. దేవుడు మీద నమ్మకంతో, దైహిక - ప్రాపంచిక అవసరాల మీద నుంచి "ధ్యాస"ని మళ్లించిన వాడికి "అనంత శక్తి" అనుభవమవుతుందని కూడా ఆదిశంకరులు స్పష్టంగా చెప్పారు.
మనిషికి రెండు ధ్రువాలు ఆధారం. ఒకటి ఆలోచన. రెండవది అనుభవం. ఆలోచనను ప్రేరేపించేది 'దృశ్యం'. అనుభవంలో శాంతినిచ్చేది 'సాత్వికం'. అంటే .. సాత్వికానుభావాన్నిచ్చే దృశ్యం మాత్రమే 'సద్భావన'కు పునాది అవుతుంది. సద్భావనలను స్మృతిలో నిలుపుకోవడమే 'ఆరాధన'.
In terms of the universal cosmology vaikhari, madhyama and pashyanti sounds correspond respectively to bhuh, bhuvah, and svah. కర్మకి గల కార్య స్థానాల స్థాయిలు కూడా అవే. (శరీరం, మనసు, స్ఫురణ) para స్థితిలో ఉన్న శబ్దం .. ఒక్కటే కర్మ రహితమైనది. (అవాజ్గ్మానస గోచరం) జీవిని ఆ స్థితికి చేర్చగలిగినదే 'గాయత్రీ మంత్రం'.
మనిషికి ఉన్న శక్తి పేరు ఇష్టం. మిగిలినవన్నీ దాని సామర్ధ్యాలు మాత్రమే. ఈ ఇష్టం మనసు పరిధి దాటి వ్యవహరిస్తే ఆ వ్యవహారాన్ని ఆరాధన అంటారు. మామిడాకుకు మూడు నామాలు ఏమిటనుకోవచ్చు. అరె ఇది కూడా ఎంతందంగా ఉందో అనచ్చు. అందుకే ఆరాధన మనసుకి ఎబ్బెట్టుగా, మనసు దాటితే తన్మయత్వంగా ఉంటుంది. జీవనశైలి స్వచ్ఛంగా ఉంటే దాని ప్రభావం జడంగా ఉండదు.
శుద్ధమైన శబ్దం .. అక్షరంగా, భాషగా, లిపిగా దిగివచ్చిన నిచ్చెనమీదుగానే .. శుద్ధమైన శబ్దంలోకి ఎగబాకే సాధనే "ఆథ్యాత్మికం".తీపిదనం ఉన్నది 'ఘనమైనా. ద్రవమైనా' జిహ్వామోదమే.శుద్ధ శబ్దంగా ఉన్నది 'ఏదైనా, ఎలాంటిదైనా' సహమోదమే.
మనసులో పుట్టే భావోద్వేగాల వల్ల
సిద్ధాంతాలు తయారవుతాయి.
మనసుకు అవతల మాటలకు అందని
స్థితి వల్లనమ్మకం ఏర్పడుతుంది.
సర్వేంద్రియాణామ్ నయనం ప్రధానం అన్నారు. ఎందుకంటే దృశ్యమే ఇంద్రియాలను తీవ్రంగా ప్రేరేపిస్తుంది. అందుకే ఇంద్రియాలను శాంతపరిచి సాత్వికమైన భావాలను ఉద్దీపనం చేసేందుకే .... దృశ్య ప్రధానమైన ..విగ్రహారాధన ప్రతిపాదితమైంది. అదీగాక, ఆలంబన లేని నిరాకార ఆరాధనలోని అగాధాన్ని దాటించేది విగ్రహారాధనే.
సంప్రదాయం ఉన్న జీవనంలోనే జీవం ఉంటుంది. కాబట్టే 'పండగ' ఇప్పటికీ 'కొత్త బట్టలు' కట్టుకుంటోంది. అమ్మ కుట్టించిన బట్టల్ని తోబుట్టువులతో కలిసి తొడుక్కుంటే .. ఆ 'పండగే' జోషే వేరు. అమ్మ చెయ్యి పట్టుకుని గుడికి వెళ్లి పెట్టిన... ఆ 'దండం'లో థ్రిల్లే వేరు. అమ్మ వండిన అప్పచ్చిని ఆటల్లో తింటుంటే .. ఆ 'ఆకలి' టేస్టే వేరు. అమ్మ చుట్టూ తిరుగుతూ బుధ్ధిగా నేర్చుకున్న ... ఆ 'జీవితం' విలువే వేరు. పండగ ఓ inspiration. బతుకును 'పండించు' కోవడానికి. సంప్రదాయంగా జరుపుకునేదే పండగ. పండగని వేడుకలా చేసుకోకూడదు.
అనుభవ దర్పణం
శక్తిని క్షీణింపజేసే పదార్ధాల నుంచి దూరమై,శక్తిని వృద్ధి చేసే పదార్ధాలకు చేరువై ..జీవనం సాగించడమే మన విధి. ఈ విధి విధానాలను వివరించేదే ఋషిమార్గం.
మనిషి అవసరాలు తీర్చేది ప్రకృతి.ఆ ఇద్దరికీ ఉన్న బంధాన్నే కర్మ అంటారు.ఆ కర్మ బంధం మేరకు మనిషిఅవసరాలను తీర్చడమే ప్రకృతి పని.కర్మలో లేని విషయాన్ని మనిషి ఎంత కోరుకున్నా దానిని ప్రకృతి సమకూర్చదు.
తీరని కోరికలతో మనిషి వికృతమవడం, వికృత జీవుల విన్యాసాలకు భూమినిస్సారమైపోవడం కాల ప్రభావం. ఆధ్యాత్మిక శక్తితో మనిషి జీవనశైలిని క్రమబద్ధంచేయడం, ఆత్మశక్తితో ప్రకృతిలో సారాన్ని పెంచడంవంటి ఉత్తమ లక్ష్యాల సాధనకు యజ్ఞక్రియల నిర్వహణే సర్వోత్తమ మార్గం.
భగవంతుడు ఆ ఏనుగు మీది అంబారీలోనే ఉండొచ్చుగాక ..కానీ ఆ అంబారీని మోసే ఏనుగుకి ఓ అరటి పండిచ్చినా ..సాక్షాత్తూ ఆ భగవంతుడినే శిరసా ధరించినట్టు. !!!
భగవంతుని సంకీర్తన వల్ల మన మన మనసుల్లోనే కాదు, మన చుట్టూ ఉన్నవాతావరణంలో కూడా ఆహ్లాదం నిండుతుంది. మన ఇంట్లో, నిత్య జీవనంలో హాయిగా ఆ పరమాత్ముడిని అనవరతమూ సేవించుకోవడమే సద్భక్తితో కూడిన "సంకీర్తన".
మనిషికి ఆనందం .. అరిషడ్వర్గాలు అదుపులో ఉన్నపుడే. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచేది సత్వగుణం ఒక్కటే. సత్వగుణాన్ని వృద్ధి చేసేది ఆరాధనా భావం మాత్రమే. ఆరాధనా భావాన్ని పాదుగొలిపి, పోషించి, పరిపుష్టం చేసేది .. భగవంతుని సేవించే 'మనసు'.
గుణాలు మనిషిలోని అరిషడ్వర్గాల వేగాన్ని పెంచుతాయి. అరిషడ్వర్గాల కదలిక జీవుడి కర్మకి సంబంధించినది. కర్మ వల్లనే జన్మల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది.
"మహిమ" అనే దాన్ని వేదాంతం ఒప్పుకోదు. స్థిరత్వం ఉన్న జీవుడికి "గోచరించనిది" అనేది ఉండదు కాబట్టి .. గమనించలేని ఇతరులు పేర్కొనే 'మహిమ' .. కేవలం వేగం అంటుంది. "యాదృచ్ఛికం" అనే దాన్ని కూడా వేదాంతం ఒప్పుకోదు. కాలం విస్తీర్ణం తెలిసిన జీవుడికి "సంఘటన"కు కారణం తెలిసి తీరుతుంది కాబట్టి .. కారణం తెలియని మేధస్సు చెప్పే 'యాదృచ్ఛికం' .. కేవలం కూర్పు అంటుంది.
మంత్రాక్షరం లోని శబ్దాన్ని మథించడాన్ని 'జపం' అంటారు. జప శక్తిలోని కొంత భాగాన్ని జీవ శ్రేయస్సు కోసం అగ్నికి ఆహుతినివ్వడమే మహాయజ్ఞం. ‘దేవుడికి ప్రేమపూర్వకమైన సేవ’ చేసుకోవడం తప్ప మనిషికి వేరే పనంటూ లేదు. ఇది నిష్కామ కర్మ మార్గం. ఏ పనికైనా ‘భగవంతుడు మూలం’ అని త్రికరణశుద్ధిగా నమ్మితే ఆనందం చేరువవుతుంది. ఇది భక్తి మార్గం. ఏ పనైనా ‘భగవంతుడే’ అని త్రికరణశుద్ధిగా నమ్మితే జ్ఞానం ఆవిష్కార మవుతుంది. ఇది జ్ఞాన మార్గం.
సమస్త జీవరాశుల్లో ' బుద్ధిమంతుడు' అవగల సమర్ధత మనిషికి మాత్రమే ఉంది. అంతరంగాన్ని అణకువతో అర్పించడమే భక్తి. మనిషి మనిషిలా బతకాలన్నా, మహర్షిలా ఎదగాలన్నా .. కాలం కలిసి రావాల్సిందే. అందుకనే ఋషులు మన కోసం '' జీవన విధానం '' రూపొందించారు. అలా జీవించే వారిని కాలం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ధర్మజీవనం కాలాన్ని అమృతం చేస్తుంది. సైద్ధాంతిక జీవనం మనిషిని సంకుచితం చేస్తుంది.
Mind - Mantra - Manifestation
Mind ‘merges’ only in SAMADHI, and nothing can be said about it. Unless one attains SAMADHI, his (or her) mind, definitely, remains. Beware! Mind has the capacity to behave ‘either way’ when there is opportunity. So it is useless to name any ‘state of mind’ (so as to honor or condemn), because every ‘state of mind’ is fickle in course of time. In fact spirituality has nothing to do with mind or its activity. So spirituality neither answers nor discusses. Only ‘modern’ spirituality stress on Q & A and groups, because ‘its experience’ (which must be respected) is limited to that. Mantra is a spiritual word or short phrase that can be repeated silently in the mind as a means of connecting with our inner wisdom. You can use your mantram while walking, doing chores, or when you are falling asleep. It is a comfort and a support during times when you are angry, afraid, nervous, or worried. And it can provide assistance as we try to shed our likes and dislikes. With the mantram we regain our natural energy, confidence, and control, so that we can transform everything negative in us and make our greatest possible contribution to the welfare of those around us. The mantram serves as calming force in the face of fear and confusion. Using the mantram every day will help it take root in your consciousness.
As the specific pattern of controlled wind-flow through the holes of a flute produces specific sonorous tune, likewise, the vibrations induced by the repeated rhythmic chanting of a specific mantra generate specific pulsation of prana and stimulate the extrasensory energy nuclei in the body accordingly. The japa of Divine Name or Mantras has been an integral part of all modes of worship or prayer in every religion be it Hindu, Sikh, Islam, Buddhist, Christian, Tao, Bahai, etc. Japa-sadhana is a scientific method devised by the Rishis to activate the extrasensory energy centers within to facilitate the sublime flow of vital spiritual currents in this majestic living system.
The sound of a particular mantra also has to pass through several stages before it is fully experienced by the listener in perfection. These stages are termed as para, pashyanti, madhyama and vaikhari. Each level of sound corresponds to a level of existence, and one's experience of sound depends upon the refinement of one's consciousness. It takes a realized consciousness to experience the full range of sound, the full range of existence. The seers who can comprehend the four stages of sound are known as Manishis.
Monday, 27 April 2026
ఎందుకు "అనిపిస్తుంది"?
చాలామంది స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుకుంటారు. కానీ ఆజన్మాంతం తన జీవితం మరొక దానికి బందీ అని తెలుసుకోరు. విజ్ఞులు సూచించిన చింతనను ఒక్కసారి స్వీకరిస్తే తామెంత బంధనంలో ఉన్నామో ఎవరికైనా తెలుస్తుంది. బుద్ధుడికి ఇల్లు వదిలి వెళ్లాలని ఎందుకు అనిపించింది? ఎన్ని కారణాలు చెప్పినా .. ఆ విధంగానే .. అనిపించడానికి కారణం ఏమిటో ఎవ్వరూ చెప్పలేరు. బుద్ధుడు కూడా. ఈ అనిపించడం అనేది దేనివల్ల కలుగుతుందో తెలుసుకోవడం ఎవ్వరి వల్లా కాదు.
ఒకడు మామూలుగా తన రోజువారీ పనుల్లో తలమునకలుగా ఉన్నపుడు సడన్‌గా ఓ వ్యక్తిని ఫలానప్ఫుడు కలవాలని అనుకుంటాడు. ఆ టైమ్‌కి ఆ వ్యక్తిని కలుస్తాడు. ఆ తర్వాత మొత్తానికి ఎవో కొన్ని సంఘటనలు జరుగుతాయి. సరే! అసలు ఆ వ్యక్తిని కలవాలి అని ఈ మనిషికి ఎందుకు అనిపించింది. అనిపించకపోతే కలిసేవాడు కాదుగా .. ఆ సంఘటనలు జరిగేవి కాదుగా!! కానీ ఆ ..అనిపించడం .. నుంచి ఆ మనిషి కాదుకదా, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకని?
నాకు అది ఇష్టం అంటారు, ఆ అమ్మాయినో, అబ్బాయినో ప్రేమించాను అంటారు, నాకు అది పడదు అంటారు, నేను పెద్దయ్యాక డాక్టరవుతా, యాక్టరవుతా అంటారు .. అలా అనాలని వారికి ఎందుకు అనిపిస్తుంది? నా గురించి నాకు తెలుసు అంటారు కానీ ఫలానాది నీకు ఎందుకు ఇష్టం అంటే ఒక్కరూ చెప్పలేరు? నీకే అనిపించిన దానికి ఏది కారణమో నీకు తెలియనప్పుడు .. ఇతరుల ఆలోచనలకి, చేతలకి కారణమేమిటో నీకు ఎలా తెలుస్తుంది? అందుకే రమణ మహర్షి అంటారు .. నువ్వెవరు! తెలుసుకో .. అని.
తన నుంచి కదులుతున్న ఆలోచనలకి, చేతలకి ఏది కారణమో తెలియనప్పుడు, వాటికి కర్తను నేను అని అనుకోవడం అమాయకత్వం. నా జీవితానికి ఇదీ కారణం అని తెలియని వాడికి ఆ జీవితం మీద స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎలా వస్తాయి, ఎవరిస్తారు? చూసిన వస్తువు మీద, విన్న విషయం మీద, తెలిసిన స్పర్శ మీద, కలిగిన రుచి మీద .. ఇలా ప్రతిదాని మీద ఏ ఇద్దరికీ ఒకే భావన కలగనప్పుడు .. తన భావనా అనుభవంతో మరొకడి మనోగతాన్ని నిలదీయడం, తన భావజాలానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండాలనుకోవడం .. కేవలం తెలివితేటలతో పరస్పరం మోసం చేసుకోవడమే.
మనిషి జీవితాన్ని నిర్దేశించే ''అనిపించడం'' వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఋషులు తెలుసుకున్నారు. మనలాంటి వాళ్లం ఇంకా తెలుసుకోలేదు. అందుకే మనలో కొందరు తెలివిగా ''తెలియనిది ఏదో'' అని వాడుతుంటారు. ఋషులు తెలివిగా మాట్లాడరు, అనుభవంతో మాట్లాడతారు కాబట్టి ఆ తెలియనిదే కర్మ అన్నారు. అది ఏమిటో తెలియకపోతే వచ్చే నష్టం లేదన్నారు. అది ఉందో లేదో అని వాదులాడుకుంటే కలిగే ప్రయోజనం శూన్యం అన్నారు. అది మనల్ని సుఖపెట్టినా - కష్టపెట్టినా పట్టించుకోకపోతే ఆనందం వస్తుందన్నారు. అలా ఆనందంగా ఉండాలంటే "ఇలా జీవిస్తే చాలు" అని మార్గం చెప్పారు.
జీవనం ఋషిప్రోక్తం
ఫలితాన్ని ఏది నిర్ణయిస్తుంది?
చేతని అనుసరించే ఫలితం ఉంటుంది. ఇది గణితమంత కచ్చితం. కష్టపడినా ఫలితం లేకపోయింది అంటూ కొందరు వాపోతుంటారు కానీ అది నిజం కాదు. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహాదేవ! ఇది నిజం. పనికి ఆబ్లిగేషన్లు, సెంటిమెంట్లు ఉండవు. మైలు దూరం వెళ్లాలంటే పిల్లవాడికైనా, ముసలివారికైనా, అంగవికలురకైనా అదే దూరం. వారి వారి సామర్ధ్యాన్ని బట్టి కష్టపడి ఆ దూరం దాటాలి. వాడెవడో పది అంగల్లో అక్కడికి వెళ్లాడు నేను ఇరవై అంగలు వేసినా వెళ్లలేకపోయాను అంటే లాభంలేదు. పోన్లే పాపం అని జాలిపడి దూరం తగ్గదు.
చేతకి ఒక పద్ధతి ఉంటుంది. పనికి ఒక విధానం ఉంటుంది. మనిషిని బట్టి అది మారదు, దాని కోసం మనిషి మారాలి. ఈ మార్పు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. దాన్ని అసమానత్వం అంటే కుదరదు. ఉపాధ్యాయుడి బోధ ఒకటే అయినా, విద్యార్థుల అవగాహనలో తేడాలుంటాయి. బోధనా స్థాయికి అవగాహన పెంచుకోవడం విద్యార్ధుల బాధ్యత. ఇది నిర్వివాదాంశం. చేతకి అవసరమైన సామర్ధ్యాన్ని పెంచుకోకుండా, ఫలితాన్ని అందుకోవడానికి ప్రయత్నించడం రాక్షసత్వం. సామర్ధ్యానికి అనుగుణమైన చేతను ఎన్నుకుని, దానికి నిర్దేశించిన ఫలితంతో తృప్తి పడడమే మానవత్వం.
మనుషుల్లో కొందరు ధీరులు ఉంటారు. వారు చేతను ఎన్నుకుని దానికి అవసరమైన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి అహర్నిశలూ సాధన చేస్తారు. ఒక పనిలో రాణించాలంటే రోజువారీ జీవితంలో ఎక్కువ సమయాన్ని ఆ పనికి కేటాయించాలి. అలా సాధకులు తమను కదిలించే అవసరాలనూ, మోజులను పక్కన పెట్టేస్తారు. క్రమంగా వారిలో మోజు నశిస్తుంది. అవసరాలు అత్యంత కనీస స్థాయికి తగ్గిపోతాయి. పనిలో ఉన్న ''వారికి'' పనికిరాని హోదాల భేదాలు ఉండవు. తాము పొందాలనుకున్న ఫలితాన్ని ఇచ్చే చేత ఒక్కటే వారి ఇరవై నాలుగు గంటలనూ ఆక్రమిస్తూ ఉంటుంది.
సగటు మనుషుల్లో అవసరాలు, మోజులు ఎక్కువై వర్గాలు సృష్టిస్తుంటే, పనిలో ఉన్న వారిలో (సాధకుల్లో) అవసరాలు, మోజులు దూరమై సమానత్వం ఏర్పడుతోంది. దీనిని అనుభవం చేసుకున్న ఋషులు, ప్రతి మనిషి .. పనిలో నిమగ్నమయ్యే విధంగా జీవనశైలిని రూపుదిద్దారు. ఆ రకంగా జీవించడమే మనిషి పని. ఆ పనికి దూరమైతే ఫలితం రాదు. ఇది నిజం. మనుషులు పని (జీవనశైలి) కి దూరం అవడం వల్లనే అసమానతలు ఏర్పడుతుంటే, మేధావులు మాత్రం అసలు పనిలోనే అసమానతలు ఉన్నాయని ఏకంగా పనినే పాతర పెడుతున్నారు.
మూడు పొరలు - ముచ్చట్లు
స్థూలం, సూక్ష్మం, కారణం అనే మూడు పొరలు ఉన్నట్టే, మనిషికి దేహం, మనసు, మనసుకు అవతల ఉంటాయి. దేహం బేసిక్ ఇన్‌స్టింక్ట్ ప్రకారం నడుచు కుంటుంది. దానికి వేరే ఆప్షన్ లేదు. ఆహారం, భయం, నిద్ర, మైథునాలతో విసుగెత్తిన వారు మాత్రమే ‘ఇంకేం లేదా’ అని మనసులోకి తొంగి చూస్తారు.
అయితే వారి దృష్టి .. పదార్ధాలకు, పరిసరాలకు, పరిస్థితులకు మించి ఉండక పోవడంతో గోడకి తగిలిన బంతి వెనక్కొచ్చినట్టు .. బేసిక్ ఇన్‌స్టింక్ట్ తోనే "తెలివి" గా జీవిస్తుంటారు. నిత్యమైన శాశ్వతమైన అనుభవాన్ని మిగల్చలేని ఈ దేహాన్ని, మనసుని దాటితే ఏమవుతుంది? ఈ ప్రశ్నే మనిషిని ఋషిగా మార్చింది.
అందరూ క్రమంగా శారీరక, మానసిక జీవితాలతో విసిగి వేసారిపోతారనే సత్యం తెలిసి ఋషి మనల్ని రెండు పనులు చెయ్యమన్నాడు. ఒకటి ఋషి అయ్యే ప్రయత్నం (తపస్సు) చేయడం, రెండు అలాంటి ప్రయత్నం చేసే వారిని పోషించడం. ఈ రెండు పనులూ ఆచరించే వారికి అప్రమేయమైన (శారీరక, మానసిక సంబంధం లేని) ఆనందం ఆనుభవమవుతుంది.
చేయించే సమస్తం భగవంతుడు అనేది సత్యం. ఆ సత్యం అనుభవంగా తెలియడమే జన్మ అదృష్టం.
తపస్సు చేసే అవకాశం అందరికీ రాదు కానీ తపస్సుకు అండగా నిలిచే అవకాశం అందరికీ ఉంటుంది. మనసు గ్రహించలేని ఒక చేతకు మనసారా చేయూతనివ్వానిపించడం ఋషుల అనుగ్రహ ఫలమే. దీని వల్ల తెలిసీ తెలియక చేసిన అనేక జన్మ పాపాలు ప్రక్షాళనమవుతాయి. నిర్మోహమైన చేత ఒక్కటే గురుకృపను కటాక్షిస్తుంది.
మనసుకు ఉన్న పీకులాటే మనలోని పర్వతమంత మోహానికి గుర్తు. అందుకే కృష్ణుడు ‘కర్మణ్యేవాధికరస్తే ..’ అన్నాడు. చేతను దైవానికి సంధానం చేసి మనసుకు దూరం చేయడమే (చేత) సేవ. భగవత్సేవలో మనసుకు చిన్న కోరికైనా ఉండచ్చేమో గానీ, తాపసులకు మనసుతో (కోరి) చేయగల పని అంటూ ఏదీ సృష్టిలో లేదు. అందుకే ఋషి ఋణం తీర్చుకోవడమే అత్యంత దుర్లభమైనది. అలాంటి అవకాశాన్ని ‘చేతనైనంత మేర చేయగలిగింది చేస్తా’నని అందిపుచ్చుకోవడానికి జన్మ సుకృతం ఉండాలి.
ఆదిశంకరులు - అద్వైతం - అవబోధ
ఆది శంకరులు ప్రతిపాదించిన అద్వైతం, ఒలిచిపెట్టిన అరటిపండులా ఉండదు. ఆ విషయం ఆ మహానుభావుడికి కూడా తెలుసు. అద్వైతం అర్ధం అవ్వాలంటే జీవుడికి పూర్ణ వైరాగ్య స్థితి ఉండాలి. ఈ వైరాగ్యం అనేది అంత సుభంగా ఒంటబట్టదు. అందుకు కారణం కోరికలే.
కర్మ అధీనంలో ఉన్న మనిషికి కోరికలు సహజం. అపుడు వైరాగ్యం రాదు. అద్వైతం తెలియదు. ఇలా నూటికి తొంభై తొమ్మిది మందికి కోరికలే ఉన్నపుడు .. అద్వైత సిద్ధిపై ఆసక్తి కలవారు ఏమి చెయ్యాలి అని శంకర భగవత్పాదులు కలవర పడ్డారు. కోరిక (కర్మ) ఉన్నవాడు అద్వైతం జోలికి వెళ్లడు, వెళ్లినా నిలబడలేడు. కర్మలో ఉండగా (కోరిక తీరి) అద్వైతం జోలికి వెళ్లడం సంభవించదు. అద్వైతానికి మూలమైన యోగశక్తి .. జీవుడి కర్మలోకి వస్తే తప్ప కోరిక తీరే అవకాశం లేనప్పుడు, పరిష్కారం ఏమిటా అని శంకరులు చింతించారు. జీవుల శ్రేయస్సు కోసం పరితపించారు.
కాబట్టే .. ఆయన ద్వారా అఖండమైన ఆత్మశక్తి .. ‘ఆరాధన’ రూపంలో ఆవిష్కృతమైంది. జీవుడి కర్మస్థితిలోకి యోగశక్తిని ప్రవహింప జేయగల క్రియా విధానమే ఆరాధన. భగవంతుడనే దృష్టితో ఆరాధనను క్రమబద్ధంగా చేస్తే .. యోగశక్తి, అంచెలంచలుగా జీవుని కర్మలోకి దిగివస్తుంది. కర్మలోకి చేరిన యోగశక్తి ద్వారా మాత్రమే కోరికలు తీరిన జీవుడు కర్మబంధాలకు దూరమవుతాడు. అలా క్రమంగా వైరాగ్య భావన బలపడి ఆ జీవుడు అద్వైత సాధన వైపు మరలుతాడు. ఇదీ శంకరాచార్యులు ప్రతిపాదించిన అనుభవ సారాంశం. ఈ సారాంశ స్వరూపమైన ఆరాధనలో ఏమున్నదీ అంటే .. బలోపేతమైన బుద్ధిని యోగమార్గం దిశగా నడిపించగల క్రియా విధానమున్నది. అంటే శంకరులు పేర్కొన్న ఆరాధనా క్రమాన్ని అనుష్టించాలంటే ముందుగా బుద్ధి బలోపేతం అయి ఉండాలి.
అందుకే ఆయన బుద్ధిని ప్రచోదనం చేయగల గాయత్రీ మంత్ర జపాన్ని ప్రతి ఒక్కరికి నిర్దేశించారు. అంటే ఆదిశంకరులు అనుభవించిన అద్వైతాన్ని సిద్ధింప జేసుకోవాంటే జీవుడు .. ముందుగా గాయత్రీ మంత్ర జపంతో బుద్ధిని బలోపేతం చేసుకుని, అలా బలపడిన బుద్ధిని యోగమార్గం వైపు నడిపించగల భగవదారాధనా క్రమాన్ని అనుష్టించి, తద్వారా కర్మబంధములై ఉన్న కోరికల నుంచి యోగబంతో విడివడి, వైరాగ్యంతో జీవనం సాగించి అద్వైతాన్ని అనుభవైకవేద్యం చేసుకోవాలి.
ఇక్కడ రెండు స్పష్టమైన సూత్రాలున్నాయి. ఒకటి. (కర్మ ఉండగా) కోరిక ఉండగా (అద్వైత) సాధన సాగదు. రెండవది. మనసు వైరాగ్య స్థితికి చేరకుండా ఆత్మజ్ఞానం రాదు. కొన్ని సందర్భాల్లో జీవుడు పుట్టుకతోనే అద్భుతమైన బుద్ధిబం కలిగి వైరాగ్యస్థితి పొంది ఆత్మజ్ఞానంతో యోగి కావచ్చు. అలా పుట్టని వారు గాయత్రీ మంత్ర జపంతో బుద్ధి బలం పెంచుకుంటే, ఆ బుద్ధి .. ఆరాధనా బలం వల్ల యోగమార్గం పట్టి, వైరాగ్యాన్ని మనసుకి పట్టించి ... జీవుడిని, ఆత్మస్థితి వైపు కదిలిస్తుంది. ఇలా కోరిక (కర్మ), గాయత్రీ మంత్ర జపం, బుద్ధి బలం, భగవదారాధన, కోరికపై వైమనస్యం, క్రమేణా వైరాగ్యం, యోగసాధన, ఆత్మజ్ఞానం, అద్వైత స్థితి అన్న అంశాలతో జగద్గురువు ఆదిశంకరులు ఈ జగత్తుకి ఆధ్యాత్మిక భిక్ష పెట్టారు.
ఎప్పుడైతే జీవులు గాయత్రీ మంత్ర జపానికి దూరమయ్యారో ఆనాటి నుంచే కోరికల పరంపరలో చిక్కుకుపోయారు. కోరికల సాంద్రత నుంచి బయటపడాలంటే గాయత్రీ మంత్ర జపం తప్ప జీవుడికి మరొక మార్గం లేదు. కర్మతో వచ్చిన మనసు తోటి, దాని బలం తోటి ఏది చేసినా .. ఎవరు చేసినా .. అది బుద్ధి బలాన్ని పెంచలేదు. తెలియని బుద్ధి కంటే తెలిసిన మనసు గొప్పదనే భావన బలపడిననాటి నుంచి, ఆ మానసిక భావనలోనే భగవదారాధన చేయడం అలవాటు పడిన నాటి నుంచి, ఆధ్యాత్మికం మొత్తం ఆత్మజ్ఞానానికి దూరమైంది. ఇవాళ్టికీ పరిస్థితి మారలేదు.
కొన్ని మంచి మాటలు
కోరిక తీరాలంటే ప్రయత్నించాలి.
ప్రయత్నించాలంటే విధానం తెలియాలి.
తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి.
విధాన ఆచరణకు మనోబలం ఉండాలి.
అది లేనపుడు ఆసరా తీసుకోవాలి.
అందుకు అన్నీ వదులుకోవాలి.
మనం మరొకరి కోసం అనుకోవాలి.
అలాంటి జీవుడే .. శిష్యుడు.
అతనికి సృష్టి నియమమే గురువు.
విద్య విశ్వ శ్రేయస్సు కోసం.
విద్య అంటే యజ్ఞ విద్య.
'విద్యావంతుడు' అంటే ఋషి.
ఏకత్వ లక్షణం ఉన్నదే శాస్త్రం
ఆకలి ఉన్నవాడు
అన్నాన్ని వెతుక్కున్నట్టు
ఆర్తి ఉన్నవాడు
దైవాన్ని వెతుక్కుంటాడు.
జీవభావన ఉన్నవాడికి లింగ బేధం ఉండదు
లింగ భేదం ఉన్నవాడికి జీవ భావన రాదు.
శరీరాన్ని ఉపాధిగా చేసుకునే కర్మని
అనుభవిస్తూ ఉంటే
జీవుడు మోక్షం పొందుతాడు
శ్వాసని ఉపాధిగా చేసుకుని
శబ్దం చేస్తూ ఉంటే
మనసు దివ్యత్వం పొందుతుంది.
శరీర ఆరోగ్యం దైవీ శక్తిని నింపుకునేలాగా,
యోగశక్తిని భరించేలాగా తీర్చిదిద్దుకోవాలి.
తను విజయం సాధించాలి అనుకునే
బాలుడుఎంత ప్రయత్నం చేసినా
అవకాశాలు అందిపుచ్చుకునే
ఆసరా లేనప్పుడు
అతని కోరిక తీరదు.
ఎంతటి ప్రకాశవంతమైన నక్షత్రమైనా
చీకటి లేకపోతే దాని వెలుగు కనబడదు.
అందుకనే మనిషికి ఎదురయ్యే కష్టాలు
అతని జీవన విలువలను ప్రకాశవంతం
చేసేలా ఉంటాయి అందుకే జీవనాన్ని
తీర్చిదిద్దుకోకపోతే కష్టాలు భరించటం
కష్టంగానే ఉంటుంది.
మనిషి ప్రతిభకు నిదర్శనం
అనేకమంది మనుషుల ప్రశంసలు కాదు.
పక్కవారిని ప్రభావితం చేసి
ప్రయోజకులుగా మార్చగలిగినదే ప్రతిభ.
ఒక స్త్రీ జీవితానికి ప్రమాణం
ఆమె పెంచి పోషించే కుటుంబం,
దానిలో పాదుకున్న విలువలు.
ఒక పురుషుడి జీవితానికి ప్రమాణం
ఒక అనుభవజ్ఞుడి దగ్గర
అతను ఉండే తీరు,
భగవంతుడిని అతను కొలిచే తీరు.
Indian Spiritual Practices
Sunday, 26 April 2026
సాధనే అనుభవానికి పునాది
ఆది శంకరాచార్య ‘భజగోవిందం’ స్తోత్రంలో ఇలా అన్నారు. ‘‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం .... నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి:’’. అంటే మనిషి జీవన్ముక్తుడు అవడానికి సత్సంగత్వం మొదటిమెట్టు. ఒక మొలక పెరిగి వటవృక్షం అవడానికి తొలిదశల్లో రక్షణ ఎంత అవసరమో, సాధకుడు సిద్ధి పొందడానికి సత్సాంగత్యం అంత ఆవశ్యకం. పురాణ ప్రవచనాలు, హరికథలు, నాయనమ్మలు చెప్పే భాగవత రామాయణ కథలు కూడా జీవులను ఉద్ధరించిన సత్సాంగత్యమే.
తనకు, సంఘానికి, తద్వారా సృష్టికి శ్రేయస్సును అందించడానికి ప్రతి జీవుడూ సాధన చేయాల్సిందే. ‘తనను ఆడించే’ కర్మల నుండి విడివడి, ‘తను నడిపించగల’ జీవ కల్యాణ క్రియలను నిర్వహించే స్థితికి జీవుడు చేరడానికి సాధన తప్పనిసరి. ఈ సాధనా మార్గం యోగానుభవాన్ని ఇస్తుంది కాబట్టి ‘యోగమార్గం’ అని, ఇది ఋషిప్రోక్తం కాబట్టి ‘ఋషిమార్గం’ అని విజ్ఞులు బోధిస్తుంటారు. కర్మబంధంలో ఉన్న జీవుడికి సాధనా మార్గం చీకటిమయం. ఆ మార్గంలో నడవాలంటే గురువు అనే వెలుగును ఆశ్రయించాల్సిందే. అలా ఆశ్రయించిన జీవుడే సాధకుడు.
బొత్తిగా తెలియని విషయం తెలుస్తున్నప్పుడు, కాస్త తెలిసిన విషయాన్నితన తెలివితేటలతో రంగరిస్తునప్పుడు సందేహాలు రావడం సహజం. అయితే జీవుల సందేహాలు తర్కానికి దారితీస్తాయి. సాధకుల సందేహాలు మాత్రమే అనుభవానికి పునాది వేస్తాయి. అందుకే సాధకుడు నిరంతరం గురువు సాంగత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అలాంటి సాంగత్య పరిణామాల్ని ఆదిశంకరులు వివరిస్తూ, అదే సాధనకు అవరోధమైన మోహాన్ని తొలగిస్తుందని, తద్వారా నిశ్చలతత్వం వైపునడిపించి సాధకుడిని జీవన్ముక్తుడను చేస్తుందని చెప్పారు
జగత్తు మొత్తం కర్మాధీనమే
భారతదేశం కర్మభూమి. అంటే కర్మలను ఆచరిస్తూనే ఆత్మస్థితికి చేరుకోగల అవకాశాన్ని, సామర్ధ్యాన్ని ఇవ్వగల నేల. జీవుడు ఏ దేశంలో పుట్టినా కర్మలకు లోబడే ఉంటాడు. ఎందుకంటే జన్మకు కారణం కర్మ కాబట్టి. అలా జన్మకి కారణమైన కర్మల్ని ఆచరిస్తూ ఆత్మస్థితికి చేరడమే జీవిత పరమార్ధం. ఈ పరమార్ధాన్ని సాధించుకోగల అవకాశం కేవలం భారతదేశంలోనే ఉంది.
జన్మతః జీవుడిని చుట్టుకుని ఉండే కర్మలు పుంఖానుపుంఖాలుగా ఉంటాయి. వాటిని లెక్కించడం, మేధస్సుతో అంచనా వేయగలగడం ఎవరికీ సాధ్యం కాదు. ఆత్మస్థితిని చేరుకున్న జీవుడికి మాత్రమే ఈ కర్మపొరలు అర్ధం అవుతాయి. జన్మించే ప్రదేశం మొదలుకొని నివసించే ప్రదేశం, మరణించే ప్రదేశం వరకు, అందచందాలు, ఆకర్షణ, ఇష్టాఇష్టాలు, చేసే వృత్తులు, చూసే దృశ్యాలు, పెంచుకునే జంతువులు, ఇష్టపడే మనుషులు, ధరించే దుస్తులు, పెళ్లి, బ్రహ్మచర్యం, స్నేహితులు, శత్రువులు, అరిషడ్వర్గాల వేగాలు, ఆస్తికత్వం, నాస్తికత్వం, భార్యాభర్తల అన్యోన్యతలు, శాస్త్ర విజ్ఞానం, విద్య అవిద్యలు, సంపద, దరిద్రం, రోగాలు, మరణాల మధ్య వ్యత్యాసాలు, స్థిర చరాస్తుల యోగం, తర్క వితర్కాలు, సంతానం లేకపోవడం, సంతానం వల్ల ఆనందం, వ్యక్తిగత అర్హతలతో సంబంధం లేని సిరిసంపదలు, సిరి ఉన్నా ఆకలితో జీవించడం, అయాచితంగా వచ్చే స్థితిగతులు, అన్నీ ఉన్నా అనుభవించలేనితనం, ఇలా ఎన్నెన్నో.. లెక్కలేనన్ని అంశాలన్నీ కర్మలో భాగమే.
ఈ జన్మకు కారణమైన కర్మను తెలుసుకుని, దానిని నిబద్ధతతో ఆచరించడమే ప్రతి జీవుడికి ఉన్న పని .. చేయాల్సిన పని. ఇతరమైన పనులన్నీ చివరికి విషాదాన్నే మిగుల్చుతాయని ఋషులు తేల్చి చెప్పారు. ఆలోచనల వేగానికి ప్రభావితమై, తన జన్మకు సంబంధం లేని పనులు (కర్మలు) చేపట్టి బతుకును విషాదాంతం చేసుకోవద్దని వారు సందేశమిచ్చారు.
ఋషులంటే తమ జన్మకు కారణమైన కర్మను తెలుసుకుని, వాటి పరిధి వరకు మాత్రమే జీవితం గడిచిపోయేలా ఆలోచనలను, చర్యలను క్రమబద్ధీకరించుకుని ఆత్మస్థితికి చేరుకున్నవారు. వారి జీవన విధానాన్ని ఆచరిస్తూ, అంటే ఋషిమార్గంలో జీవనాన్ని గడిపి, బతుకు సార్థకం చేసుకున్న వారే ఋషి సంతతిగా భారతదేశంలో నిలిచిపోయారు. వీరందరూ కర్మాచరణలో సంయమనాన్ని ప్రదర్శించి, తమ జీవితాలను తమ అనుభవాలను ప్రతిపాదిస్తూ, ఆచరణను విపులీకరిస్తూ భూ మండలమంతా విస్తరించారు.
చెదరని ప్రేమ సాధన, 'ఆరాధన'
ఎవ్వరికైనా సంతానంపై అమితమైన ప్రేమ ఉంటుంది. సృష్టిలో అది సహజం. ఎందుకంటే రక్త సంబంధం అంత బలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇది కూడా చెదిరిపోతూ ఉంటుంది. అది కూడా సహజమే. ఎందుకంటే ప్రేమకున్న పూర్ణ నైజం ఎవ్వరికీ అర్థం కాదు. బాల్యంలో తల్లిదండ్రులపై ఉండే ఆపేక్ష .. ఆ తర్వాత యవ్వనంలో తలెత్తే శృంగార కాంక్ష ముందు పలుచబడుతుంది. ఆ పైనచెదరని ప్రేమ సాధన, 'ఆరాధన' తనకీ సంతానం కలిగాక ఆ ఆపేక్ష కొంచెం చేదుగా మారుతుంది. దీనికి కారణం మనిషి తన ఉనికిని శరీరంతో ముడిపెట్టు కోవడమే.
చెదరని ప్రేమను అనుభవించాలనుకున్న సనాతనులు తమ ధ్యాసను శరీరం మీద నుంచి తప్పించి మనసు వైపు మళ్లించారు. అప్పట్నుంచి మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలైంది. అలా శరీర తృష్ణను మనసులో పుఠం పెట్టడంతో అమలిన శృంగారం ఆవిష్కారమైంది. కానీ అత్యధికులకి ఉన్న శారీరక ధ్యాస వల్ల అది అభాసుపాలైంది. దీనికి తోడు (మనసుకు భూమిక శరీరమే కాబట్టి) మానసిక ప్రేమలో కూడా ‘శరీరం’ పాలు ఎక్కువగానే ఉండడాన్ని గ్రహించిన సనాతనులు దిమ్మెరబోయారు. అసలు ప్రేమించకుండా, కాస్తో కూస్తో ప్రేమ ఛాయలు లేకుండా జీవించడం దుర్లభమే అయినా, చెదరని ప్రేమను ఆస్వాదించలేని జీవనం వ్యర్థమని వారు భావించారు.
శారీరకమైనది, మానసికమైనది కానటువంటి ప్రేమ ఉంటుందా, ఉంటే దాన్ని ఎలా పొందాలి అని అన్వేషణ మొదలు పెట్టారు. ఆ అన్వేషణలో వారు అద్వితీయమైన తాదాత్మ్యకతను స్పర్శించారు. దానికి శరీరం, మనసు ఆధారంగా లేదని గుర్తించారు. దీన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించి బోర్లాపడ్డారు. దానికి దూరం కాలేక, తన సంతానాన్ని దూరం చేసుకోలేక మథనపడ్డారు.
‘తను’ అనుకున్న శరీరానికి, ‘తను’కు ఆధారమైన మనస్సుకు చిక్కకుండా .. తనలోనే ఉన్న ఆ తన్మయత్వానికి ఏది ఆధారమో తెలుసుకోవడానికి అవస్థ పడ్డారు. గుర్తొస్తున్న ఆ అనుభవానికి బాహ్యంలో ఎలాంటి గుర్తు లేకపోవడాన్ని చూసి విస్మయపడ్డారు. ఆ ఆనందానికి ఎలా అతుక్కుపోవాలో తెలుసుకోలేక పోయారు. చివరికి భౌతికంగానే ఒక ‘గుర్తు’ను తామే పెట్టుకున్నారు. దాన్ని దైవం అన్నారు. దానికి తనకు నచ్చిన రూపాన్ని ఇచ్చారు. అద్భుతమైన భావనలతో అలంకరించారు. అంతరంగంలో ఎప్పటికప్పుడు పొందుతున్న ఆనందాన్ని, ఏరోజుకా రోజు బాహ్యంలో ఉన్న ఆ దైవానికి అద్దుతూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
‘నా’ అనుకున్న ప్రతిదానిపై కలుగుతున్న ప్రేమను ఆ (దైవ) స్వరూపానికి ఆపాదిస్తూ, అన్వయిస్తూ.. అలౌకిక స్థాయికి చేరుకున్నారు. క్రమంగా ‘తన’ చుట్టూ ఉన్న జీవితాన్ని, ‘దైవం’లో ప్రతిబింబించేలా మలుచుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ తానే దైవ స్వరూపంగా భాసిస్తున్న వైనాన్ని గమనించి తబ్బిబ్బులయ్యారు. అయితే భౌతికంగా ఉన్న దైవ స్వరూపానికి భౌతికమైన కారణాన్ని వివరించలేక వదిలేశారు. అంతరంగంలోని ఆనందానికి బాహ్యం నుంచి లంగరు వేసే ఈ క్రియా విధానానికి ఆరాధన అని పేరు పెట్టుకున్నారు.
ఈ ఆరాధన వల్లనే దైవం అని, ప్రాణి అని, బంధమని, భేదమని వేధించే ద్వైతం కరిగి పోతున్న వైనం అనుభవమవుతుంది. వారే అసలైన భగవదారాధకులు. వారే ‘దేవుడు ప్రత్యేకంగా లేడని, విశ్వమంతా నారాయణుడు నిండి ఉన్నాడని’ అనగలవారు. అందుకే చిన్ననాటి నుంచి ప్రేమకు దైవాన్ని ఆధారంగా చేసుకొని, వాడు కూడా తాను ప్రేమించే పిల్లలలో ఒకడని జీవనం సాగిస్తే, అదే ఆరాధనగా మారుతుంది. అదే మనలో చెదరని ప్రేమను నింపుతుంది.
Friday, 24 April 2026
ప్రాణశక్తిని పెంచేదే ఆరోగ్యం
Wednesday, 22 April 2026
మనం చేసే తప్పులు
మనం చేసే అన్ని తప్పులు (పాపాలు) మూడింటితోనే చేస్తాం !
మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు. కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం ! ఈ విషయంలో మన భారతీయ సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది.
మనంచేసే అన్ని తప్పులు (పాపాలు) మూడింటితోనే చేస్తాం.
(1) *కాయిక* (శరీర గత) ;
(2) *వాచిక* (మాటతో) ;
(3) *మానసిక* (మనసుతో).
ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం ! ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పారు. ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగా పరీక్షించుకుని మార్పుచెందే సులువైన మార్గం.
*(1) కాయిక (శరీరగత) పాపములు :
(సనాతన ధర్మ శాస్త్ర ఆధారంగా)
*శ్లోకం :*
అదత్తాముపాదానం హింసాచైవా విధానతః, పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం.
*అర్థం :*
అన్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీసంగమం. ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు).
ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా.
*శ్లోకము :*
దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్య పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.
*అర్థము:*
దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ఙ్ఞానులను పూజించడం, శరీరమును శుచిగా ఉంచడం, పవిత్రమైన ఆచారములు, డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం, బ్రహ్మచర్యము (తన భార్యతో తప్ప ఇతర స్త్రీలయందు కామ దృష్టి లేకపోవడం), ఇతరులను హింసించకుండా ఉండడం.. ఇవి శారీరిక తపస్సులు.
*(2) వాచిక (మాటతో) పాపములు :*
*శ్లోకము:*
పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః, అసంబద్ధ ప్రలాపశ్చ వాఙ్ఞ్మయంస్యాచ్చతుర్విధం'
*అర్థం :*
కఠినముగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందిస్తూ మాట్లాడడం, వ్యర్థమైన/పనికిమాలిన మాటలాడడం. ఇవి వాక్కుతో చేసే తప్పులు.
ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా
*శ్లోకము :*
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్ఞ్మయం తప ఉచ్యతే.
*అర్థము :*
ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం, ఇష్టముగా మరియు మేలుకలిగించే విధంగా మాట్లాడడం, యదార్థము మాట్లాడడం, వేద శాస్త్రములను పఠించడం, పరమేశ్వరుని నామ జపం చేయడం.. ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది.
*(3) మానసిక పాపములు :*
*శ్లోకము :*
పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం, వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం.
*అర్థము :*
ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడుతలపెట్టే ఆలోచన, శరీర అభిమానము.. ఇవి మనసుకి సంబంధించిన పాపములు. ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
*శ్లోకము :*
మనః ప్రసాదః సౌమ్యత్త్వం మౌనమాత్మ వినిగ్రహ:, భావ సంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే.
*అర్థము :
మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం, శాంత భావం, సదా భగవచ్చింతన చేసే స్వభావం, మనోనిగ్రహం, అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడము.. ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి* అన్నిటిలోకి *మానసిక తపస్సు* చాలా గొప్పది. ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనందరం ఈ నిముషం నుండే అభ్యాసం మొదలుపెడితే ఉత్తమోత్తమం !!