Friday, 24 April 2026

ప్రాణశక్తిని పెంచేదే ఆరోగ్యం

ఇవాళ అందరికీ ఆరోగ్యం మీదకి దృష్టి మళ్లింది. అల్లోపతీ, హోమియోపతీ, ఆ తీ, ఈ తీల్లాంటివి దాటుకుని ప్రత్యామ్నాయ వైద్య విధానాలంటే ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు నడవమంటే నవ్విపోయే వారు, ఇప్పుడు నడక నాలుగింతల మేలు అంటున్నారు. ఆరోగ్యంపై దృష్టి అభినందనీయమే అయినా,  ముందుగా ఆరోగ్యం అంటే ఏమిటో అందరూ తెలుసుకోవాలి. ఆడవాళ్లు మెరుపు తీగల్లా, మగవాళ్లు ఆజానుబాహువుల్లా ఉండడమే ఆరోగ్యం కాదు. సౌందర్యం కోసం ఆరోగ్యం కోరుకునేవారు ఏదో ఒక రోజు తలబాదుకోక తప్పదు. ఎందుకంటే ఆరోగ్యం పేరుతో శరీరాన్ని మెలితిప్పడం ప్రకృతి విరుద్ధం. 

అసలు శరీరం అంటే ఏమిటి? ముందు ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. శరీరం అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాల సమ్మిశ్రమం. అవి ఏయే పాళ్లలో ఉంటే.. దాని ప్రకారం శరీర ఆకృతి ఉంటుంది. అంటే శరీరాకృతికి, పంచభూతాల మిశ్రమమే కారణం. ఉదాహరణకు ‘అగ్ని’ పాలు కొంచెం ఎక్కువగా ఉన్న శరీరాకృతి కంటిని ఆకర్షిస్తుంది. అలాగే ఆకర్షణ లేకపోయినా అవయవాలు అమరినట్టు ఉండే రూపులో భూమి తత్వం ఎక్కువ అని తెలుసుకోవాలి. ఇలా ఒక్కో ఎలిమెంట్‌ ప్రభావం వల్ల శరీరంలో ఒక్కో మార్పు లేదా కూర్పు ఉంటుంది. 

ఈ ఐదు ఎలిమెంట్స్‌ శాతాలు (పాళ్లు) ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా, జిమ్‌లో శరీరాన్ని చితక్కొడితే ఆ ఎలిమెంట్స్‌కి ఉన్న బ్యాలెన్స్‌ తప్పిపోతుంది. రోగగ్రస్తమవుతుంది. ఒక జీవికి ఒక రకమైన శరీరం ఏర్పడడానికి ఏమిటి కారణం అనేది తెలియాలి. ఒకబ్బాయి లావుగా ఉంటాడు కానీ బలం ఉండదు. ఒకడు సన్నగా ఉన్నా బలవంతుడుగా ఉంటాడు. అసలు సన్నగా, లావుగా, పొడుగ్గా, పొట్టిగా ఎందుకుంటారు. ఈ శరీరాన్ని మనం అనుకున్నట్లు ఉంచుకోగలమా? అసలు అలా ఉంచుకోవాలా? వైద్యంతో అసలు శరీరానికి రోగం రాకుండా చేయగలమా? ఏ మనిషీ మరొకరిలా ఉండకపోవడానికి కారణం ఏమిటి? అసలు రోగం ఎందుకు వస్తుంది? 
ఆలోచిస్తే లెక్కలేనన్ని ప్రశ్నలు. అన్నిటికీ సైన్స్‌ సమాధానం చెబుతుందని ఎదురుచూసే వారు తమ జీవితకాలంలో అసలైన ఆరోగ్యాన్ని అనుభవించలేరు. శరీరం గాలి, నీరు, ఆహారం ద్వారా పోషకాలను స్వీకరించి, ఎదుగుతుంది. ఇది ప్రాథమిక విషయం. అయితే ఈ స్వీకరణలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ఎందుకని? సైన్స్‌ ఎన్ని కబుర్లు చెప్పినా ఆ అలవాట్లను మానిపించి, కొత్త అలవాట్లను చేయించలేదు. కానీ ఆధ్యాత్మికానికి అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికం ఒక్కటే శరీరాన్ని నూటికి నూరు శాతం ఆకళింపు చేసుకున్న శాస్త్రం. 

ఒక శరీరంలో ఉన్న ప్రాణశక్తి పరిమాణం వల్ల ఐదు ఎలిమెంట్స్‌ ఆయా శాతాల్లో మిశ్రమంగా ఏర్పడుతుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే గర్భంలోకి ముందుగా ప్రాణశక్తి చేరుకుని, తన సామర్థ్యం మేరకు ఐదు ఎలిమెంట్స్‌ సారాన్ని గ్రహించి, దాని ప్రకారం శరీరాన్ని ఏర్పరచుకుంటుంది. ఇది సైన్స్‌కి అర్థం కాదు. అందుకనే ఋషులు శరీరాన్ని పక్కనబెట్టి, దాని ఆవిర్భావానికి మూల కారణమైన ప్రాణశక్తిని పట్టుకున్నారు. ఆ ప్రాణశక్తి పరిమాణాన్ని మార్చడం ద్వారా శరీరాకృతిని మార్చే వారు. ఒక్కమాటలో చెప్పాలంటే శరీర ఆరోగ్యం ప్రాణశక్తి వికాసానికే. పరులను ఆకర్షించడానికి కాదు.

No comments:

Post a Comment