చేతని అనుసరించే ఫలితం ఉంటుంది. ఇది గణితమంత కచ్చితం. కష్టపడినా ఫలితం లేకపోయింది అంటూ కొందరు వాపోతుంటారు కానీ అది నిజం కాదు. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహాదేవ! ఇది నిజం. పనికి ఆబ్లిగేషన్లు, సెంటిమెంట్లు ఉండవు. మైలు దూరం వెళ్లాలంటే పిల్లవాడికైనా, ముసలివారికైనా, అంగవికలురకైనా అదే దూరం. వారి వారి సామర్ధ్యాన్ని బట్టి కష్టపడి ఆ దూరం దాటాలి. వాడెవడో పది అంగల్లో అక్కడికి వెళ్లాడు నేను ఇరవై అంగలు వేసినా వెళ్లలేకపోయాను అంటే లాభంలేదు. పోన్లే పాపం అని జాలిపడి దూరం తగ్గదు.
చేతకి ఒక పద్ధతి ఉంటుంది. పనికి ఒక విధానం ఉంటుంది. మనిషిని బట్టి అది మారదు, దాని కోసం మనిషి మారాలి. ఈ మార్పు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. దాన్ని అసమానత్వం అంటే కుదరదు. ఉపాధ్యాయుడి బోధ ఒకటే అయినా, విద్యార్థుల అవగాహనలో తేడాలుంటాయి. బోధనా స్థాయికి అవగాహన పెంచుకోవడం విద్యార్ధుల బాధ్యత. ఇది నిర్వివాదాంశం. చేతకి అవసరమైన సామర్ధ్యాన్ని పెంచుకోకుండా, ఫలితాన్ని అందుకోవడానికి ప్రయత్నించడం రాక్షసత్వం. సామర్ధ్యానికి అనుగుణమైన చేతను ఎన్నుకుని, దానికి నిర్దేశించిన ఫలితంతో తృప్తి పడడమే మానవత్వం.
మనుషుల్లో కొందరు ధీరులు ఉంటారు. వారు చేతను ఎన్నుకుని దానికి అవసరమైన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి అహర్నిశలూ సాధన చేస్తారు. ఒక పనిలో రాణించాలంటే రోజువారీ జీవితంలో ఎక్కువ సమయాన్ని ఆ పనికి కేటాయించాలి. అలా సాధకులు తమను కదిలించే అవసరాలనూ, మోజులను పక్కన పెట్టేస్తారు. క్రమంగా వారిలో మోజు నశిస్తుంది. అవసరాలు అత్యంత కనీస స్థాయికి తగ్గిపోతాయి. పనిలో ఉన్న ''వారికి'' పనికిరాని హోదాల భేదాలు ఉండవు. తాము పొందాలనుకున్న ఫలితాన్ని ఇచ్చే చేత ఒక్కటే వారి ఇరవై నాలుగు గంటలనూ ఆక్రమిస్తూ ఉంటుంది.
సగటు మనుషుల్లో అవసరాలు, మోజులు ఎక్కువై వర్గాలు సృష్టిస్తుంటే, పనిలో ఉన్న వారిలో (సాధకుల్లో) అవసరాలు, మోజులు దూరమై సమానత్వం ఏర్పడుతోంది. దీనిని అనుభవం చేసుకున్న ఋషులు, ప్రతి మనిషి .. పనిలో నిమగ్నమయ్యే విధంగా జీవనశైలిని రూపుదిద్దారు. ఆ రకంగా జీవించడమే మనిషి పని. ఆ పనికి దూరమైతే ఫలితం రాదు. ఇది నిజం. మనుషులు పని (జీవనశైలి) కి దూరం అవడం వల్లనే అసమానతలు ఏర్పడుతుంటే, మేధావులు మాత్రం అసలు పనిలోనే అసమానతలు ఉన్నాయని ఏకంగా పనినే పాతర పెడుతున్నారు.
చేస్తే ఫలితం వస్తుంది. అంటే దానర్ధం ఫలితం వచ్చే వరకూ చెయ్యమని. పనికి ఫలితానికి మధ్యలో సొంత ఆలోచన వచ్చిందంటే ఓడిపోయినట్టే. అందుకే గీత అందరినీ చెయ్యమనే చెప్పింది. ఎవరెవరు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వేదాలు చెప్పాయి. ఉపనిషత్తులు ఎందుకు చెయ్యాలో చెప్పాయి. శాస్త్రాలు - మతాల సారాన్ని విమర్శించడం అంటే చేతకు దూరమవడం, అవసరాల్లో కూరుకుపోవడం, మోజుల్లో చిక్కుకుపోవడం.
No comments:
Post a Comment