ఉత్తమ లక్ష్యాన్ని ఫలరూపకంగా విశ్వవ్యాపితం చేయాలంటే యజ్ఞం ఒక్కటే మార్గం. అదే విధంగా మానవుల్లో అత్యుత్తమ లక్షణాలు పాదుకొని వికసించాలన్నా యజ్ఞమే సాధనం. అందుకే మనిషి నిర్వహించగల అత్యుత్తమ ప్రక్రియగా యజ్ఞం నిలిచింది.
కచ్చితంగా చెప్పాలంటే .. ఒక అంశం పలురెట్లుగా వ్యాప్తి చెంది అనేక మందికి హితకారి అవ్వాలంటే యజ్ఞం తప్ప మరో ఉపాయం లేదు. ఒక వ్యక్తి త్యాగం కూడా ద్విగుణీకృతమై సంఘ శ్రేయస్సును సాధించాలంటే యజ్ఞం జరగడం తప్పనిసరి.
స్థూలమైన శబ్ద తరంగాలు యజ్ఞ జ్వాలల ద్వారా సూక్ష్మీకరణ చెందుతాయని సైన్స్ కూడా ఒప్పుకుంది. అంటే స్థూలాన్ని సూక్ష్మంగానూ, పలు రెట్లు గానూ, వ్యాప్తి చెందించగల సమర్ధత యజ్ఞక్రియకు ఉన్నట్టే కదా. అందుకే సనాతనులు యజ్ఞ క్రియను మానవ దైనందిన జీవితంలో ఒక భాగంగా నిర్దేశించారు.
వారి నిర్దేశన మేరకు నిత్యం యజ్ఞాలు, హోమాలు జరుగున్నంత కాలం సకల జీవరాశులూ శాంతిని, ఆనందాన్ని అనుభవించాయి. సంఘం కళకళలాడింది. కాబట్టి సృష్టికి హితకరంగా సమాజం చైతన్యమవాలంటే .. యజ్ఞక్రియ దేదీప్యమానమవ్వాలని నమ్మాలి.
మనపై ప్రత్యక్ష ప్రభావం ఉన్న పంచభూత తత్వాలకు, గ్రహ తత్వాలకు బలాన్ని చేకూర్చగల ప్రక్రియనూ .. సూక్ష్మ స్థితిలో .. సాధించగల విధానం కూడా యజ్ఞమే. ఇంతటి ప్రభావశీలమైన యజ్ఞక్రియ మరుగున పడిపోవడానికి నికార్సైన కారణం .. వ్యక్తి మనోవికాస ప్రక్రియ నీరసపడిపోవడమే. ఎందుకంటే యజ్ఞక్రియకు వ్యక్తి మనోవికాసమే అసలైన భూమిక.
అనాది కాలంలో అనేక మంది తమ జప తపో శక్తులను యజ్ఞ క్రియలలో ధారపోసిన ఫలం .. కాలక్రమేణా వినియోగమవుతూ .. నేటికి దాదాపు శూన్యమైపోయింది. ఇప్పటికైనా మనం మేలుకుని, యజ్ఞక్రియను నిస్వార్ధమైన - స్వచ్ఛమైన అంకిత భావంతో, సర్వతోముఖంగా, నిర్వహించకపోతే ముందు తరాలు చీకట్లోనే మగ్గిపోతాయి.
No comments:
Post a Comment