ఎవ్వరికైనా సంతానంపై అమితమైన ప్రేమ ఉంటుంది. సృష్టిలో అది సహజం. ఎందుకంటే రక్త సంబంధం అంత బలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇది కూడా చెదిరిపోతూ ఉంటుంది. అది కూడా సహజమే. ఎందుకంటే ప్రేమకున్న పూర్ణ నైజం ఎవ్వరికీ అర్థం కాదు. బాల్యంలో తల్లిదండ్రులపై ఉండే ఆపేక్ష .. ఆ తర్వాత యవ్వనంలో తలెత్తే శృంగార కాంక్ష ముందు పలుచబడుతుంది. ఆ పైనచెదరని ప్రేమ సాధన, 'ఆరాధన' తనకీ సంతానం కలిగాక ఆ ఆపేక్ష కొంచెం చేదుగా మారుతుంది. దీనికి కారణం మనిషి తన ఉనికిని శరీరంతో ముడిపెట్టు కోవడమే.
చెదరని ప్రేమను అనుభవించాలనుకున్న సనాతనులు తమ ధ్యాసను శరీరం మీద నుంచి తప్పించి మనసు వైపు మళ్లించారు. అప్పట్నుంచి మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలైంది. అలా శరీర తృష్ణను మనసులో పుఠం పెట్టడంతో అమలిన శృంగారం ఆవిష్కారమైంది. కానీ అత్యధికులకి ఉన్న శారీరక ధ్యాస వల్ల అది అభాసుపాలైంది. దీనికి తోడు (మనసుకు భూమిక శరీరమే కాబట్టి) మానసిక ప్రేమలో కూడా ‘శరీరం’ పాలు ఎక్కువగానే ఉండడాన్ని గ్రహించిన సనాతనులు దిమ్మెరబోయారు. అసలు ప్రేమించకుండా, కాస్తో కూస్తో ప్రేమ ఛాయలు లేకుండా జీవించడం దుర్లభమే అయినా, చెదరని ప్రేమను ఆస్వాదించలేని జీవనం వ్యర్థమని వారు భావించారు.
శారీరకమైనది, మానసికమైనది కానటువంటి ప్రేమ ఉంటుందా, ఉంటే దాన్ని ఎలా పొందాలి అని అన్వేషణ మొదలు పెట్టారు. ఆ అన్వేషణలో వారు అద్వితీయమైన తాదాత్మ్యకతను స్పర్శించారు. దానికి శరీరం, మనసు ఆధారంగా లేదని గుర్తించారు. దీన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించి బోర్లాపడ్డారు. దానికి దూరం కాలేక, తన సంతానాన్ని దూరం చేసుకోలేక మథనపడ్డారు.
‘తను’ అనుకున్న శరీరానికి, ‘తను’కు ఆధారమైన మనస్సుకు చిక్కకుండా .. తనలోనే ఉన్న ఆ తన్మయత్వానికి ఏది ఆధారమో తెలుసుకోవడానికి అవస్థ పడ్డారు. గుర్తొస్తున్న ఆ అనుభవానికి బాహ్యంలో ఎలాంటి గుర్తు లేకపోవడాన్ని చూసి విస్మయపడ్డారు. ఆ ఆనందానికి ఎలా అతుక్కుపోవాలో తెలుసుకోలేక పోయారు. చివరికి భౌతికంగానే ఒక ‘గుర్తు’ను తామే పెట్టుకున్నారు. దాన్ని దైవం అన్నారు. దానికి తనకు నచ్చిన రూపాన్ని ఇచ్చారు. అద్భుతమైన భావనలతో అలంకరించారు. అంతరంగంలో ఎప్పటికప్పుడు పొందుతున్న ఆనందాన్ని, ఏరోజుకా రోజు బాహ్యంలో ఉన్న ఆ దైవానికి అద్దుతూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
‘నా’ అనుకున్న ప్రతిదానిపై కలుగుతున్న ప్రేమను ఆ (దైవ) స్వరూపానికి ఆపాదిస్తూ, అన్వయిస్తూ.. అలౌకిక స్థాయికి చేరుకున్నారు. క్రమంగా ‘తన’ చుట్టూ ఉన్న జీవితాన్ని, ‘దైవం’లో ప్రతిబింబించేలా మలుచుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ తానే దైవ స్వరూపంగా భాసిస్తున్న వైనాన్ని గమనించి తబ్బిబ్బులయ్యారు. అయితే భౌతికంగా ఉన్న దైవ స్వరూపానికి భౌతికమైన కారణాన్ని వివరించలేక వదిలేశారు. అంతరంగంలోని ఆనందానికి బాహ్యం నుంచి లంగరు వేసే ఈ క్రియా విధానానికి ఆరాధన అని పేరు పెట్టుకున్నారు.
ఈ ఆరాధన వల్లనే దైవం అని, ప్రాణి అని, బంధమని, భేదమని వేధించే ద్వైతం కరిగి పోతున్న వైనం అనుభవమవుతుంది. వారే అసలైన భగవదారాధకులు. వారే ‘దేవుడు ప్రత్యేకంగా లేడని, విశ్వమంతా నారాయణుడు నిండి ఉన్నాడని’ అనగలవారు. అందుకే చిన్ననాటి నుంచి ప్రేమకు దైవాన్ని ఆధారంగా చేసుకొని, వాడు కూడా తాను ప్రేమించే పిల్లలలో ఒకడని జీవనం సాగిస్తే, అదే ఆరాధనగా మారుతుంది. అదే మనలో చెదరని ప్రేమను నింపుతుంది.
No comments:
Post a Comment