Sunday, 26 April 2026

సాధనే అనుభవానికి పునాది

ఆది శంకరాచార్య ‘భజగోవిందం’ స్తోత్రంలో ఇలా అన్నారు. ‘‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం .... నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి:’’. అంటే మనిషి జీవన్ముక్తుడు అవడానికి సత్సంగత్వం మొదటిమెట్టు. ఒక మొలక పెరిగి వటవృక్షం అవడానికి తొలిదశల్లో రక్షణ ఎంత అవసరమో, సాధకుడు సిద్ధి పొందడానికి సత్సాంగత్యం అంత ఆవశ్యకం. పురాణ ప్రవచనాలు, హరికథలు, నాయనమ్మలు చెప్పే భాగవత రామాయణ కథలు కూడా జీవులను ఉద్ధరించిన సత్సాంగత్యమే. 

తనకు, సంఘానికి, తద్వారా సృష్టికి శ్రేయస్సును అందించడానికి ప్రతి జీవుడూ సాధన చేయాల్సిందే. ‘తనను ఆడించే’ కర్మల నుండి విడివడి, ‘తను నడిపించగల’ జీవ కల్యాణ క్రియలను నిర్వహించే స్థితికి జీవుడు చేరడానికి  సాధన తప్పనిసరి. ఈ సాధనా మార్గం యోగానుభవాన్ని ఇస్తుంది కాబట్టి ‘యోగమార్గం’ అని, ఇది ఋషిప్రోక్తం కాబట్టి ‘ఋషిమార్గం’ అని విజ్ఞులు బోధిస్తుంటారు. కర్మబంధంలో ఉన్న జీవుడికి సాధనా మార్గం చీకటిమయం. ఆ మార్గంలో నడవాలంటే గురువు అనే వెలుగును ఆశ్రయించాల్సిందే. అలా ఆశ్రయించిన జీవుడే సాధకుడు.

బొత్తిగా తెలియని విషయం తెలుస్తున్నప్పుడు, కాస్త తెలిసిన విషయాన్నితన తెలివితేటలతో రంగరిస్తునప్పుడు సందేహాలు రావడం సహజం. అయితే జీవుల సందేహాలు తర్కానికి దారితీస్తాయి. సాధకుల సందేహాలు మాత్రమే అనుభవానికి పునాది వేస్తాయి. అందుకే సాధకుడు నిరంతరం గురువు సాంగత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అలాంటి సాంగత్య పరిణామాల్ని ఆదిశంకరులు వివరిస్తూ, అదే సాధనకు అవరోధమైన మోహాన్ని తొలగిస్తుందని, తద్వారా నిశ్చలతత్వం వైపునడిపించి సాధకుడిని జీవన్ముక్తుడను చేస్తుందని చెప్పారు

No comments:

Post a Comment