Wednesday, 29 April 2026

జీవితం - పరమార్ధం

జీవితంలో రెండే ఉంటాయి. ఒకటి శరీరము. రెండవది మనస్సు. ఎవరెవరి జీవితాల గురించి ఎంత మంది చెప్పినా .. అదంతా ఆ రెండిటి గురించే. మనిషికి ఉన్న ఆదర్శాలు, ప్రతిభాపాటవాలు, ఘనతలు, భావజాలాలు, పోరాటపటిమలు, విశాల హృదయాలు ... ఇలాంటివి అన్నీ ఆ మనిషి శరీరము, మనస్సుకి ముడిపడి ఉన్నవే తప్ప మరొకటి కానేకాదు. 

కాలం నడిపించే ఈ సృష్టిలో .. మనిషి కాలధర్మానికి లోబడి జీవించాల్సిందే. అంటే మనిషి శరీరము, మనస్సు కాల నియమాన్ని అతిక్రమించి ప్రవర్తించ లేదు. అలాగే ఎంతటి మహానుభావుడైనా కాలంలో సొంత పెత్తనం చేయలేడు. ప్రతి శరీరం బాల్యం, యవ్వనం, వార్ధక్యం దశలు అనుభవించాల్సిందే. మనస్సు కూడా ఆ శరీర దశలకు అనుగుణమైన అవస్థలను అనుగమించాల్సిందే. ఏ జీవితమైనా అంతే.

జీవితానికి ఏది ఆధారమో, మరణానికి ఏది కారణమో తెలియని స్థితిలో.. ప్రతి మనిషీ తను జీవిస్తున్నాను అనుకుంటాడు. నిజానికి జీవిని నడిపించేది అవసరం. అవసరం అనేది లేకపోతే సంబంధం అనేదే ఉండదు. సంబంధమే లేకపోతే జీవితానికి అర్ధమే తెలియదు. ఇక పరమార్ధాన్ని తెలుసుకునే అవకాశం ఎలా ఉంటుంది? మానవ జీవితం  పరమార్ధాన్ని తెలుసుకోవడానికే అని గ్రహించిన ఋషులు ..ఈ సంబంధాన్ని ముడిపదార్ధంగా చేసుకుని కుటుంబ వ్యవస్థను ఏర్పరచారు. 

శరీరము, మనస్సు అనే వాటితో నడిచే జీవితానికి రెండు సంబంధాలుంటాయి. రక్త సంబంధం, భావ సంబంధం.  జన్మకి కారణమైన వారితో ఏర్పడేది రక్త సంబంధం. పెరిగి పెద్దయ్యాక తన భావాలతో భార్య (భర్త) అనీ, స్నేహితుడనీ,  శత్రువనీ ఏర్మరచుకున్నవి భావ సంబంధం. ఒక జన్మకి ఇద్దరు తల్లులు ఉండరు కాబట్టి రక్తబంధం బలమైనది. భార్య (భర్త), మిత్రుడు, శత్రువు అనే మూడు బంధాలు కేవలం 'అనుకుంటేనే' ఏర్పడేవి కాబట్టి భావబంధాలు బలహీనమైనవి. అందరూ ఈ బంధాల మధ్యలో, తమ తమ అవసరాల కోసం, ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తూ జీవించడం మినహా ఇంకేమీ చేయలేరు.

అత్యుత్తమం, ఉత్తమం, మధ్యమం, నీచం, అతినీచం అనే స్థాయిల్లో మనిషి అవసరాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి చేసే ప్రయత్నమే జీవితం. ఈ ప్రయత్నంలో మనిషి అన్ని వేళలా లేదా అన్నిటియందు సమభావంతో ఉండడం అసంభవం. మనిషి తన అవసరం కోసం ఏదో ఒకదాని యందు మాత్రమే ఇష్టం లేదా అయిష్టంగా ఉండగలడు తప్ప రెండిటి యందు సమాన ఇష్టాయిష్టాలతో ఉండలేడు. ఇన్ని పరిమితులను, ఇంతటి అశక్తతను తనకు తానుగా గుర్తించలేకపోవడమే మాయ. దాని పొరలలో చిక్కుకుని తాను ఉదారుడు, విశాల హృదయుడు, కళాకారుడనే భ్రమలో జీవుడు ఉంటాడు.

బాల్యంలో అమ్మతో ఉన్న మనస్సు యవ్వనంలో మరో స్త్రీతో ఉండటానికి ఇష్టపడడం సహజం. శరీరం వార్ధక్యంలో ఉన్నపుడు మనసు యవ్వనంలో ఉండడం అసహజం. మనిషికి సమభావం అసంభవం. ఎలాంటి వికారాలు లేకుండా శరీరము, మనస్సుకి ఉన్న పరిమితులను అంగీకరిస్తూ, అవసరాలు - సంబంధాల ప్రలోభంలో పడకుండా ..మాయ, భ్రమ .. ప్రభావం నుంచి ఎవరికి వారు బయటపడడమే వారి వారి జీవిత పరమార్ధం.

No comments:

Post a Comment