ఈ విశాలమైన భూమండలంలో భారతదేశం అని పేరుగాంచిన భూభాగం ఎంతో విశిష్టమైనది. అంతే కాదు. అత్యంత శక్తిమంతమైనది కూడా.ఇందుకు తగిన ఆధారాలు చారిత్రక గ్రంథాలలోనే కాకుండా, వేద వాఙ్మయంలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. భారతదేశ విశిష్టతకు ప్రధాన కారణం అక్కడి ప్రజల జీవనశైలి. ప్రపంచ దేశాల జనాభాను ఆకర్షించే స్థాయిలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లడానికి ఈ జీవనశైలే ఆయువుపట్టు. అద్వితీయమైన, అపురూపమైన ఈ జీవనశైలికి ప్రాణం పోసి, ఆటుపోట్లకు చెదిరిపోకుండా బలోపేతం చేసిన ఘనత అక్కడి ఋషులదే.
ఋషులంటే ఎవరు?
ప్రాణకోటిగా మనం ప్రస్తావించుకునే 84 లక్షల జీవరాశుల్లో మానవాకారం దాల్చి ఉన్న జీవికి ఒక మనిషిగా జీవించే విధానాన్ని అలవాటు చేసింది ఋషులే. 'మైట్ ఈజ్ రైట్' అనుకునే మృగ సమూహంతో మమేకమై జీవనం సాగిస్తున్న రెండుకాళ్ల మృగాన్ని మనిషిగా మార్చడానికి వేల సంవత్సరాలు కృషి చేసింది ఋషులే. దేహధర్మం తప్ప మరొకటి లేదనుకుని, దానికే పరిమితమై కాలం గడుపుతున్న జంతువుల నుంచి వేరుచేసి, మనోధర్మాన్ని గుర్తించే మనిషిగా మార్చింది ఋషులే. దేహము-మనసు మాత్రమే కాదు, ఆ రెండిటికీ అతీతమైన ప్రజ్ఞాస్థితి (కాన్షియస్‌నెస్) ఉందని ఎరుక పరిచి, దానిని స్వానుభవంలోకి తెచ్చుకునేలా చేసింది ఋషులే.
ఋషుల నేపథ్యం ఏమిటి?
సృష్టి క్రమాన్ని నిర్దేశించే మౌలిక స్పందనల (బేసిక్ ఇన్‌స్టింక్ట్స్) చట్రాన్ని విచక్షణతో ఛేదించుకుని, ఆలోచనతో అంతర్ముఖమై, తన ఉనికినే మర్చిపోయి సమస్త విశ్వానికి సేవకుడిగా జీవనం సాగించిన వాడే ఋషి. ఆహారం, భయం, నిద్ర, మైథునం మాత్రమే జీవక్రియలు కాదని నమ్మి, మనిషిగా ఎదగడానికి సిద్ధపడిన మనందరి కోసం ఒక మార్గాన్ని ఏర్పరచిన వారు ఋషులే. ఆ మార్గంలో మనందరం ఋషి స్థితికి చేరడం కోసం వేల సంవత్సరాల తన సాధనా అనుభవాన్ని సంప్రదాయంగా అందించి వెళ్లిన వాడు ఋషి. నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు కృంగిపోకుండా ఎప్పుడూ ఆనందంగా గడపడానికి ఆసరాగా ఉండే ఎన్నెన్నో విధానాలను, ఉపకరణాలను, ఆచరణలను అందుబాటులో ఉంచిన వాడు ఋషి.
ఋషుల ఆశయం ఏమిటి?
ఈ భూమండలంలోని చరాచర జగత్తు మొత్తం వాటి వాటి ధర్మాన్ని అనుసరించి ఆనందంగా ఉండాలన్నదే ఋషుల ఆశయం .. ఆకాంక్ష. కాలాన్ని అనుసరించి తిరిగే ధర్మ చక్రానికి ఆధారమైన ఇరుసులాంటి సత్యమే ఋషి అనుభవం. ఈ అనుభవం పొందడానికి మనిషి గోవును, యజ్ఞాన్ని, అనుష్టానాన్ని ఆశ్రయించాల్సిందేనని ఋషులు ఉద్భోదించారు. అగ్నిక్రియతో ఆరాధించిన గోవు కామధేనువు అవుతుందని, త్యాగబుద్ధితో చేసే యజ్ఞం విశ్వకల్యాణ కారకమవుతుందని, శరణాగతితో చేసే అనుష్టానం ధర్మాచరణకు అంకురమవుతుందని వివరించారు. ఈ మూడు అంశాలను త్రికరణ శుద్ధిగా నిర్వహించే విధానమే ఋషిమార్గమని చెప్పారు. అలాంటి ఋషిమార్గంలో నడిచే నాగరిక సమాజమే సుఖసంతోషాలకు చిరునామా అని దీవించారు.
No comments:
Post a Comment