Wednesday, 20 May 2026

మూడు కర్మలు - మూడు గుణాలు

ఈ ప్రపంచంలో జీవులందరూ ఏదో ఒక పని చేయడానికి motivate అవుతూనే ఉంటారు. ఆ పని 3 రకాలుగా, motivation 3 రకాలుగా ఉంటుంది.

పని (కర్మ) మూడు రకాలు.

అవి 1. కర్మ, 2. అకర్మ, 3. వికర్మ.

1. పెద్దలు చెప్పిన పనులను నియమానుసారం చేస్తూ ఉంటే అది కర్మ అవుతుంది. దీనికి వేదాలు, శాస్త్రాలు ప్రమాణం.

2. జనన, మరణ చక్రం నుంచి బయటపడటానికి .. అంటే మోక్షం కోసం మహా ఋషులు చెప్పిన పనులను చేస్తూ ఉంటే ఆ పని అకర్మ అవుతుంది. దీనికి ఆత్మజ్ఞానమే ప్రమాణం.

3. ఎటువంటి ప్రమాణాలను పట్టించుకోకుండా, తమకు నచ్చినట్లు చేసుకునే పనిని వికర్మ అంటారు.

Motivation కూడా మూడు రకాలు.

అవి 1. సత్వగుణం 2. రజోగుణం 3. తమోగుణం.

ఈ గుణాల ప్రమేయంతో జీవుడు అనుక్షణం ఆ మూడు కర్మల్లో దొర్లుతూనే ఉంటాడు. కర్మల లక్షణాన్ని బట్టి, గుణాల స్వభావాన్ని బట్టి మనిషి తాను చేసుకునే (కర్మలకు) పనులకు కష్టసుఖాలు, లాభనష్టాలు, ఎగుడుదిగుళ్లు అనుభవిస్తూ ఉంటాడు.

ఈ కర్మ ఫలాల్లో దేవుడికి గానీ, మనల్ని కష్ట - సుఖపెట్టిన మనుషులకు గానీ సంబంధం లేదా ప్రమేయం ఉండనే ఉండదు. ఎవరి కర్మ వారిదే.

అందుకే మనిషి తనకు నచ్చిన పనులు కాకుండా శాస్త్ర ప్రమాణాలున్న కర్మలను, అనుభవ ప్రమాణమున్న అకర్మలను చేస్తూ ఉండాలి.

Tuesday, 19 May 2026

శరణాగతి ఒకటే మార్గం

ప్రత్యక్ష ప్రయత్నం వల్ల పరోక్షమైన ఒక పరిణామం సంభవిస్తుంది. అంతే తప్ప పరోక్షమైన పరిణామాన్ని ప్రత్యక్షంగా సంభవింపజేయగలగడం ఎవరి వల్లా కాదు. అందుకే జయాపజయాలు దైవాధీనాలు అన్నారు.

ఎవరూ ఫలితాన్ని నిర్దేశించలేరు. కాబట్టే గీతలో శ్రీకృష్ణుడు ‘కర్మణ్యే వాధికారస్తే..’ అని స్పష్టంగా చెప్పాడు. ప్రయత్నంతో పరిశ్రమించడమే మానవుడి విద్యుక్తధర్మం. ఫలితం అనేది ఆ పరిశ్రమలో ఉన్న "ప్రకృతి నియమానికి" లోబడి ఉంటుంది. ఆ ఫలితం మన పరిశ్రమలోని లోటుపాట్లను, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అంతే తప్ప అది భగవంతుని అభిప్రాయం కాదు.

కష్టపడితే ఫలితం వస్తుంది అనేటువంటి మాట మనిషిని ఉత్తేజం చేయడానికి తప్ప సత్యాన్ని ప్రకటించడం కాదు. నేను ఎంత కష్టపడినా ఫలితం సరిగ్గా రాలేదు అనేటువంటి ఆవేదన సరైనటువంటి ఆలోచన కాదు. మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కనిపించే వ్యక్తులు గానీ, కనపడని దేవుడు కానీ కారణం కాదు.

ఇది తెలుసుకోకుండా ఇదేం దేవుడు, మంచికి విలువ లేదు అంటూ ఆలోచిస్తే అహంకారం, నైరాశ్యం మనల్ని చుట్టుకుంటాయి. ఈ విపరీతాల (extremities) నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి శరణాగతి ఒక్కటే మార్గమని మహా ఋషులు ప్రేమగా చెప్పారు. మనం చేసిన పనికి ఫలితం అనేది ప్రాకృతిక నియమాలకు ప్రాపంచిక పరిమితులకు లోబడి ఉంటుంది అని తెలుసుకొని మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి.

Wednesday, 13 May 2026

శరీరాన్ని సార్ధకం చేసుకోవాలి

మహాయుగాలు మన్వంతరాలు గడిచినా కూడా మనిషి శరీర నిర్మాణం, దాని సామర్థ్యం ఇప్పటికీ మారలేదు. ఇక ఎప్పటికీ మారదు. అట్లాంటి శరీరాన్ని గత మూడు తరాలుగా నిర్లక్ష్యం చేస్తూ మన పతనాన్ని మనమే నిర్మించుకున్నాం. దీనికి ఇక మంగళం పాడాల్సిన సమయం వచ్చింది.

మనిషి శరీరం ఒక మహోజ్వలమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని భారతీయ సనాతనులు అద్భుతంగా వినియోగించుకుని మహా ఋషులుగా మారారు. అంటే మనిషిని మహా ఋషిగా మార్చగలిగిన ప్రధానమైన ఉపాధి శరీరమే అని అర్థం చేసుకోవాలి. శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలి తద్వారా ఎలా ఉద్దతిని పొందాలి అనే విషయాన్ని మూలాల నుంచి తెలుసుకుంటేనే మనం విజయం సాధించగలం. ఆ విధంగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది.

ఈ దిశగా మనం చేయాల్సిన పని ఒక్కటే. శరీరం అనేది కేవలం భౌతిక ఆనందం కోసం మాత్రమే కాదని, శరీరాన్ని ఇంద్రియాల లోలత్వంలో ముంచకూడదని, భౌతిక సుఖాల కోసమే ఈ శరీరం ఉందని భావించే దౌర్భాగ్యం నుంచి మనం బయటపడాలి. పరిస్థితుల వల్ల మనకి ఎదురయ్యే కష్టనష్టాలకు మనసు కల్లోలం అవకుండా మౌనంగా ప్రశాంతంగా ఉండగల అద్భుత స్థితిని మనం పొందాలంటే దానికి ప్రధానమైన సాధనం శరీరమే అని గుర్తించాలి.

శరీరం యొక్క నిర్మాణం, దానిలోని అవయవాల మధ్య ఉన్న సమన్వయం, ఆ సమన్వయం ద్వారా ఏర్పడే శక్తి, అలాంటి శక్తిని పొందగలిగిన విధానం, ఆ విధానాన్ని పాటించగలిగిన నేర్పరితనం ఇత్యాది విషయాలన్నింటి గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అందుకోసం  మనం ఈ శరీర నిర్మాణ వ్యవస్థ గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి.

శరీరం అంటే కండలు పెంచడం కాదు, ఆరోగ్యంగా ఉండటమే కాదు, సమయానికి సముచిత ఆహారాన్ని దానికి అందించడం మాత్రమే కాదు, దానికి తగిన విశ్రాంతిని ఇవ్వడం ఒక్కటే కాదు. వాటన్నింటినీ సమకూర్చినప్పుడు అది ఇవ్వగలిగిన ఆంతరంగిక శక్తిని మనం పొందగలిగినప్పుడే మనం శరీరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు లెక్క.  

ఇలా శరీరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన మెలకువలు అన్నీ భారతీయ సనాతన విద్యలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆ మెలకువలను అర్థం చేసుకుని శరీరాన్ని సార్ధకం చేసుకుందాం.

Sunday, 3 May 2026

ఈ సద్విషయాలు తెలుసుకుందాం

ప్రాణం అంటే అనంతమైన శక్తిలోంచి విడివడిన అత్యంత సూక్ష్మమైన తునక. ఈ నిరాకార తునక ప్రకృతిలోకి వచ్చినపుడు, దేహం అనే ఆకారం అవుతుంది. ప్రకృతి పరిధిలోని దేహం .. దశేంద్రియాల, మనో బుద్ధి చిత్తహంకారాల మయం. వాటి విన్యాసాలతో క్షీణించే ప్రాణానికి యోగబలాన్ని ఎక్కించడమే ‘సాధన’. యోగబలంతో నిండిన ప్రాణమే శివుడు. కర్మభారంతో కదిలే ప్రాణమే జీవుడు.


తానెవరో తెలుసుకునే దృష్టి, తృష్ణ లేకపోతే .. ఏదో ఒక రోజు తనకు తానే ప్రశ్నార్థకంగా మిగిలిపోతాడని వేదాంతం హెచ్చరించింది. నువ్వెవరో నీకు తెలియనప్పుడు, మనసుకు తెలుస్తున్న మిగిలిన విషయాలన్నీ మన అహంకారానికి ప్రతీకలే.

 

'నేనేవరు?' అన్న ప్రశ్నకి (ఎన్ని ప్రయత్నాలు చేసినా) సూటి సమాధానం దొరకదు. మనసుకు తెలిసిన, తెలుస్తున్న ప్రతిదాన్ని ఇదికాదు అని వదిలేస్తూ పోతూ ఉంటే, చివరికి 'నేను' అనుభవమవుతుంది. నా గురించి నాకు తెలిసిన నా ఉనికి, నా గురించి ఇతరులు గుర్తిస్తున్న నా ఉనికి కాకుండా .. అప్రమేయంగా కదులుతున్న 'నేను' ఎవరో తెలియడమే నిరహంకారం.


సృష్టిలో శక్తిని క్షీణింపజేసే పదార్ధాల నుంచి దూరమై, శక్తిని వృద్ధి చేసే పదార్ధాలకు చేరువై .. జీవనం సాగించడమే మన విధి. ఈ విధి విధానాలను వివరించేదే ఋషిమార్గం. ఋషిమార్గంలో నడవడం అంటే .. జీవుడు తానుగా పదార్ధ భావన నుంచి దూరమై .. శక్తి స్థితికి చేరడానికి ప్రయత్నించడం.


ఋషిమార్గంలో నడిచే వారికి సర్వోత్కృష్టమైన ఊతకర్ర ‘‘సాలగ్రామం’’. సృష్టిలో విశ్వశక్తిని యథాతథంగా కలిగి ఉన్న పదార్ధం సాలగ్రామం ఒక్కటే. సాలగ్రామాన్ని సేవించకుండా ఏ మనిషీ .. ఋషి అవలేడు .. అవలేదు. అంతటి విశేషత, విశిష్టత ఉన్న సాలగ్రామాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ సమర్ధత మేరకు ప్రత్యక్ష పరోక్ష స్థితుల్లో ఆరాధించుకోవడానికి ప్రయత్నించాలి.


అనుభవం తరవాతే అన్నీ పుట్టాయి. అలా పుట్టిన వాటిలో "అక్షరం" చాలా శక్తి వంతమైనది. ఎందుకంటే అది శబ్దానికి రూపాన్ని ఇవ్వగలుగుతుంది. శబ్దం అంటే సృష్టి యొక్క సూక్ష్మ స్థితిని ప్రభావితం చేయగల శక్తి. అటువంటి శక్తిని అక్షరాల సంపుటిలో ఉన్నప్పుడు దాన్ని మంత్రం అంటారు. ఈ మాత్రమే మనిషిని అక్షర జ్ఞానం లోంచి అనుభవసారంలోకి తీసుకు వెళుతుంది. కొసమెరుపు ఏమిటంటే .. అనుభవం .. 'అక్షరం' లోకి translate అవదు, అవలేదు.


"నేనే ఆనంద స్వరూపం". ఈ సత్యం, అనుభవం అవడమే 'జ్ఞానం'. సాధన చేస్తేనే అనుభవం వస్తుంది. సాధన మూడంచెలు. 1.శ్రవణ 2 మనన 3 నిదిధ్యాసలు. అంటే ఆథ్యాత్మిక సాధనలో "శ్రవణం" అత్యంత కీలకం. శ్రవణము (గురువును అనుసరించుట) సులభమైన తర్వాతే మననము ఫలితమిస్తుంది. 


సృష్టిలో  మారునదే తప్ప .. పోవునది, మిగులునది అనేవి ఉండవు. మార్పు ఒక్కటే సృష్టి లక్షణం. అందుకే సృష్టి అంశములకు శాశ్వతత్వం ఉండదు. అలాగే గురువు 'ఇలా చేసుకో' అని చెపుతాడు తప్ప .. ఎవరు ఏమి అవుతారో అన్న విషయం ఎవరికీ తెలియదు.


ఆథ్యాత్మిక అంశం అనుభవంలో తెలిసేది, ప్రపంచ అంశం మాటల్లో తెలిసేది. సాధన వల్ల అనుభవం వస్తుంది. మాట వల్ల తర్కం పెరుగుతుంది. అనుభవం ఆనందానికి, తర్కం ఘర్షణకు దారి తీస్తుంది.


ఆలోచన లేకుండా క్రియ చేయడం సాధ్యమే.. అయితే అది "పరోక్షం"గా మాత్రమే వీలవుతుంది. ఉదాహరణకు .. మీ ఆలోచనతో సంబంధం లేని ఒక పనిని నేను చేయమన్నప్పుడు, ఆ పనిని మీరు చేశారనుకోండి .. ఆ పనిని మీరు ఆలోచన లేకుండా చేసినట్టు. ఆ పని విధానం అనేది ఎప్పుడూ ఆలోచనలో ఉంటుంది..కానీ దాని result మీ ఆలోచనకు అందదు. గురువును అనుసరించడం, గురువు మాటను ఆచరించడం ఈ కోవ లోదే.


ఆలోచన మనసు నుంచి generate అవుతుంది. సంకల్పానికి మూలం బుద్ధి. మనసు ఏ దిశగానైనా పరుగెడుతుంది. కానీ బుద్ధి .. (పుణ్య-పాప) కర్మ ప్రకారమే కదులుతుంది. బుద్దిని బలోపేతం చేస్తే అది మనసుతో కలవకుండా, సత్సంకల్పాలకి మూలం అవుతుంది. అందుకే  మనిషి అంటే మనసున్నవాడు కాదు, బుద్ధిమంతుడు.


"ప్రశ్న-జవాబు" అనేవి శాస్ర పరిధిలోవి. "సంశయం-అనుభవం" అనేవి ఆథ్యాత్మిక పరిధిలోవి. శాస్త్రం మేధస్సుకి, ఆథ్యాత్మికం సాధనకి సంబంధించినవి. శాస్త్ర విషయాలు చర్చని, సాధనాంశాలు ప్రజ్ఞని పెంచుతాయి. వల్లె వేస్తే వేదం నోటికి వస్తుంది కానీ జపం చేస్తేనే తప్ప వేదాంతం అనుభవం లోకి రాదు. ప్రశ్నించే మనస్సును అదపులో ఉంచేది చేత ఒక్కటే. కర్మ జీవులకి అనుష్టానము, జపము తప్ప మరో చేత లేదు.


వ్యక్తిని కాకుండా విషయాన్ని 'గురువు'గా స్వీకరించ గలిగిన వాడు మాత్రమే 'చెప్పింది విని చేతలోకి దూకుతాడు'. విషయాన్ని గురువుగా స్వీకరించేంత పరిపక్వత రావాలంటే .. తర్కించే మనసు వేగాన్ని అదుపు చేయాల్సిందే. అభ్యాస వైరాగ్యాలతోనే అది సాధ్యమని కృష్ణుడు గీతలో చెప్పాడు. వేదాలు అనేవి విధానాలు, ఉపనిషత్తులు అనేవి చేతలు. అందుకే శ్రీకృష్ణుడు 'చేతలోకి దూకు' అని చెప్పిన గీత .. ఉపనిషత్తుల సారం అయ్యింది.


"అంతర్ముఖం" తప్ప మిగిలినదంతా డంబమే. అలాంటి అంతర్ముఖం ప్రేరేపించిన 'చేత' తప్ప -- మిగిలిన చేతలన్నీ డంబాచారమే. అంటే భగవంతునితో సంబంధం లేనిది అని అర్థం. అంతటి తీక్షణతను అనుక్షణం ధరించే శక్తిని ఇవ్వగలిగినది "అనుష్టానం" ఒక్కటే. అనుష్టానం అంటే సాధన.

Thursday, 30 April 2026

శక్తి - పదార్ధం - సమాధి

సృష్టిలో ఉన్నవి రెండే. ఒకటి శక్తి .. రెండవది పదార్ధము. వీటిలో శక్తి అగోచరము, అనుభవ దూరము. కాబట్టే పదార్ధమే ఈ సృష్టిలో అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. అన్ని జీవరాశుల్లో మహా తెలివైన మనిషి ఈ పదార్ధాలను తన అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ, ఆ సామర్ధ్యాన్ని తన శక్తిగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ పటాటోపానికి ఆ మనిషి సైన్స్‌ అని పేరు పెట్టుకున్నాడు. ఇలా సైన్స్‌ వర్గానికి చెందిన వారంతా మేధావులుగా ఖ్యాతికెక్కారు. అయితే సైన్స్‌కి ఆధారమైన పదార్ధంలో ఉన్నది కూడా శక్తేననీ, ఆ శక్తి చలనంలో ఉన్న మార్పులు చేర్పులే పదార్ధ స్వరూప స్వభావాల్లో ఉన్న తేడాలనీ గమనించిన కొందరు, అసలు శక్తికి ఉన్న లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని అన్వేషణ మొదలుపట్టారు. వారిని తాత్వికులు అన్నారు. 

ఒక బుల్లెట్‌ని తీసుకుందాం. దానితో ఒక మనిషిని ఎంత బలంగా కొట్టినా ఏమీ అవదు. అదే బుల్లెట్‌ని రివాల్వర్‌లో పెట్టి వదిలితే మనిషిని చంపేస్తుంది. కాబట్టి బల్లెట్‌ అనే పదార్ధానికి వేగం అనే శక్తి లేకపోతే నిరుపయోగమే. అంటే పదార్ధంలోకి శక్తిని ప్రవేశపడితేనే ఫలితం ఉంటుంది. ఇది సైంటిఫిక్‌ థింకింగ్‌. 

మరి శక్తిలోకి పదార్ధాన్ని ప్రవేశపెడితే? ఫలితం ఊహించనంత తీవ్రంగా ఉంటుంది. ఇది తాత్విక థింకింగ్‌. ఈ తాత్విక థింకింగ్‌ని సైంటిఫిక్‌గా వివరించడం అసాధ్యం. కనపడని శక్తిలోకి కనపడే పదార్థాన్ని ఎలా పెట్టాలి? సమాధానం శోధిస్తూ కదిలిన తాత్వికులు అరణ్యాల్లో తేలారు. పరిసరాలు, పర్యావరణం అనుకూలించడంతో అంతర్ముఖమయ్యారు. శక్తి, పదార్ధాల గుట్టు విప్పే పనిలో విజయం సాధించారు. 

పదార్ధ స్థితికి చేరువలో ఉన్న శక్తి శబ్దమేనని, శక్తికి చేరువలో ఉన్న పదార్ధం మనసేనని గుర్తించారు. ఇక మనసుని ఎలాగైనా శక్తిలో పెట్టే పనిలోకి దూకి చావుదెబ్బలు తిన్నారు. చివరికి మనసుని పట్టుకోవడం అసంభవం అని తీర్మానించారు. ఈ యుద్దంలో వారికి మనసు లక్షణాలన్నీ తెలిశాయి. మనసు దేనినైనా ఒడిసిపట్టగలదనీ, తన ఆస్వాదన పూర్తి కాగానే దేనినైనా దూరంగా విసిరి వెయ్యగలదనీ గమనించి .. ఏమీ చెయ్యలేక .. బుద్ధిగా ఓ మూల కూర్చున్నారు.

మనసుని ఏనుగుతో పోల్చవచ్చు. ఏనుగును బంధించాలంటే ముందుగా దానిని కదలకుండా చెయ్యాలి. ఎలా? సరిగ్గా అది పట్టే గుంటలో పడెయ్యాలి. కానీ గుంట ఉన్న సంగతిని ఏనుగు తన తొండంతో పసిగట్టెయ్య గలదు. కానీ ఆ పసిగట్టే పనినుంచి ఏనుగు దృష్టిని మళ్లించే గందరగోళాన్ని సృష్టించి గొయ్యి ఉన్న వైపు మళ్లిస్తే ఆ ఏనుగుని గోతిలో  పడెయ్యచ్చు. ఈ భౌతిక సూత్రాన్ని తాత్వికులు మనసుకి వర్తింపజేశారు. 

మనసుకి ఓ లక్షణం ఉంది. ఇంద్రియాలు గ్రహించిన ప్రతి దానినీ రుచి చూడనిదే వదిలిపెట్టదు. తను రుచి చూసిన ప్రతి దానినీ దూరంగా విసిరెయ్యక మానదు. ఈ రెండు పనుల సంధికాలంలోనే మనసును శాశ్వతంగా పట్టి వెయ్యాలి. అదీ తాత్వికుల వ్యూహం. పదార్ధాలలో అత్యంత సూక్ష్మమైనదీ, వేగమైనదీ, బలమైనదీ మనసే కాబట్టి ఏ పదార్ధమూ దానిని పట్టలేదు. ఇక శక్తిని ఉపయోగించాలి. కానీ మనసుకి శక్తి అంటే ఏమిటో తెలుసుకునే శక్తే లేదు. కాబట్టి అది శక్తి జోలికి రాలేదు. అందుకే ఇటు శక్తి రూపానికి .. అటు పదార్ధ లక్షణానికి చేరువలో ఉన్న శబ్దాన్ని మథించారు. 

శబ్దం అధిభౌతికమే అయినా దానికి వాక్కు, అక్షరం అనే భౌతిక (ఇంద్రియ) స్థితులున్నాయి. ఈ అవకాశాన్ని తాత్వికులు ఊతంగా తీసుకున్నారు. అక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఆ ఉచ్చరించిన దానిని వినడం ప్రారంభించారు. 'వినడం' ఇంద్రియ స్థితి కాబట్టి మనసు దానిని ఆస్వాదించడానికి వచ్చి తీరుతుంది. అలా ఆస్వాదిస్తుండగా .. శబ్దం (శక్తి) తన లక్షణం మేరకు ఆ మనసును తనలో కలిపేసుకుంటుంది. అంటే గుణ భూయిష్టమైన మనసు స్వభావాన్ని మార్చేస్తుంది. విజయవంతమైన ఈ ప్రయత్నమే ఆత్యాత్మికానికి పునాది అయింది.
శబ్దంతోో మనసును పూర్ణంగా శుద్ధి చేసుకున్న తాత్వికులే ఋషులు. మనసును పూర్ణంగా శుద్ధి చేయగల ఋషిప్రోక్తమైన శబ్దాలే మంత్రాలు. మంత్రాక్షరాలను ఉచ్చరిస్తూ, ఆ మంత్రాక్షరాలను వినడమే జపం. శబ్దం పరిపూర్ణంగా మనసును తనలో కలిపేసుకున్నపుడే సమాధి.

యజ్ఞం - పరమార్ధం

ఉత్తమ లక్ష్యాన్ని ఫలరూపకంగా విశ్వవ్యాపితం చేయాలంటే యజ్ఞం ఒక్కటే మార్గం. అదే విధంగా మానవుల్లో అత్యుత్తమ లక్షణాలు పాదుకొని వికసించాలన్నా యజ్ఞమే సాధనం. అందుకే మనిషి నిర్వహించగల అత్యుత్తమ ప్రక్రియగా యజ్ఞం నిలిచింది. 

కచ్చితంగా చెప్పాలంటే .. ఒక అంశం పలురెట్లుగా వ్యాప్తి చెంది అనేక మందికి హితకారి అవ్వాలంటే యజ్ఞం తప్ప మరో ఉపాయం లేదు. ఒక వ్యక్తి త్యాగం కూడా ద్విగుణీకృతమై సంఘ శ్రేయస్సును సాధించాలంటే యజ్ఞం జరగడం తప్పనిసరి. 

స్థూలమైన శబ్ద తరంగాలు యజ్ఞ జ్వాలల ద్వారా సూక్ష్మీకరణ చెందుతాయని సైన్స్‌ కూడా ఒప్పుకుంది. అంటే స్థూలాన్ని సూక్ష్మంగానూ, పలు రెట్లు గానూ, వ్యాప్తి చెందించగల సమర్ధత యజ్ఞక్రియకు ఉన్నట్టే కదా. అందుకే సనాతనులు యజ్ఞ క్రియను మానవ దైనందిన జీవితంలో ఒక భాగంగా నిర్దేశించారు. 

వారి నిర్దేశన మేరకు నిత్యం యజ్ఞాలు, హోమాలు జరుగున్నంత కాలం సకల జీవరాశులూ శాంతిని, ఆనందాన్ని అనుభవించాయి. సంఘం కళకళలాడింది. కాబట్టి సృష్టికి హితకరంగా సమాజం చైతన్యమవాలంటే .. యజ్ఞక్రియ దేదీప్యమానమవ్వాలని నమ్మాలి.

మనపై ప్రత్యక్ష  ప్రభావం ఉన్న పంచభూత తత్వాలకు, గ్రహ తత్వాలకు బలాన్ని చేకూర్చగల ప్రక్రియనూ .. సూక్ష్మ స్థితిలో .. సాధించగల విధానం కూడా యజ్ఞమే. ఇంతటి ప్రభావశీలమైన యజ్ఞక్రియ మరుగున పడిపోవడానికి నికార్సైన కారణం .. వ్యక్తి మనోవికాస ప్రక్రియ నీరసపడిపోవడమే. ఎందుకంటే యజ్ఞక్రియకు వ్యక్తి మనోవికాసమే అసలైన భూమిక. 

అనాది కాలంలో అనేక మంది తమ జప తపో శక్తులను యజ్ఞ క్రియలలో ధారపోసిన ఫలం .. కాలక్రమేణా వినియోగమవుతూ .. నేటికి దాదాపు శూన్యమైపోయింది. ఇప్పటికైనా మనం మేలుకుని, యజ్ఞక్రియను నిస్వార్ధమైన - స్వచ్ఛమైన అంకిత భావంతో, సర్వతోముఖంగా, నిర్వహించకపోతే ముందు తరాలు చీకట్లోనే మగ్గిపోతాయి. 

Wednesday, 29 April 2026

మంత్రమే మోక్ష కారకం

సృష్టి సమస్తం శక్తిమయం. ఈ సృష్టి ఏర్పడేందుకు అవసరమైన ప్రదేశం (మహత్తు) మొదలుకొని.. గ్రహాలు, పంచ భూతాలు, జీవరాశులు, శిల వృక్షాదుల వరకూ.. అంతా శక్తి రూపమే. ఆ శక్తి పరిమాణంలో ఉన్న తేడాలే  ఆయా పదార్థాల రూప లక్షణాలలో ఉన్న తేడాలకు అసలు కారణం. అయితే  అత్యంత శుద్ధమైన స్థితిలో ఉండే శక్తి .. పదార్ధ రూపమైన సృష్టిగా ఆకారం దాల్చడానికి ముందు జరిగే ప్రక్రియ ఏమిటి? ఆ ప్రక్రియను ప్రభావితం చేసేది ఏది? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించిన వారే ఋషి స్థితికి చేరుకుని బ్రహ్మతత్వాన్ని అనుభవం చేసుకోగలిగారు.

ఈ నేపథ్యంలో ఒక సాధారణ సన్నివేశాన్ని విశ్లేషిద్దాం. ఒక వ్యక్తికి ఫలానా చోటుకి వెళ్లాలి అనిపిస్తుంది. ఇది సూక్ష్మస్థితి. ఎందుకంటే ఆ 'అనిపించడం' ఎవరికీ కనిపించదు. కానీ తర్వాత ఆ వ్యక్తి దుస్తులు వేసుకోవడం, తల దువ్వుకోవడం, చెప్పులు వేసుకోవడం, నడుచుకుంటూ (లేదే వాహనంపై) ఫలానా చోటుకి వెళ్లడం అందరికీ కనిపిస్తుంది. ఇది స్థూలస్థితి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఆ వ్యక్తికి అలా ఎందుకు అనిపించిందో అతనికి గానీ, ఇతరులకి గానీ అణుమాత్రం కూడా తెలియదు. ఇది కారణస్థితి. ఇలా మనుషులకు స్థూల స్థితి తప్ప, సూక్ష్మ - కారణ స్థితులు గ్రహించగల సామర్ధ్యం ఉండదు. ఎవరికి వారు తమకు కనిపించిన దాన్ని (స్థూలాన్ని) బట్టి వాటిని (సూక్ష్మ - కారణాల్ని) ఊహించుకుంటారు. అలాంటి ఊహలకు చోటివ్వకుండా ప్రతి కదలికలోనూ (స్థూలంలో) ఉన్న రహస్యం (సూక్ష్మ - కారణాలు) తెలిసిన జీవుడే ఋషి, బ్రహ్మవేత్త.  

శక్తి నుంచి సృష్టి ఎలా జరుగుతుందో, ఆ పరిణామంలో ఉన్న దశలు ఏమిటో, అవన్నీ జీవరాశుల వికాసానానికి ఎలా దోహదపడతాయో వివరించేవే వేదాలు. ఇవి శబ్ద ప్రధానమైనవి. అత్యంత శుద్ధమైన శక్తి తప్ప మిగిలిన సమస్తానికి స్థూల - సూక్ష్మ - కారణ స్థితులు ఉంటాయి. అలాగే శబ్దానికి కూడా ఆ మూడు స్థితులు ఉంటాయి. స్థూల శబ్దాన్ని అక్షరమని, సూక్ష్మ శబ్దాన్ని గాయత్రీ అని, కారణ శబ్దాన్ని బ్రహ్మమని ఋషులు పిలుచుకున్నారు. అలా కారణ శబ్ద రూపకమైన సృష్టిని, ఏ జీవుడు అవబోధపరుచుకోగలడో అతడే బ్రహ్మవేత్త. ఈ స్థితిని పొందడానికి అత్యంత సులభమైన సాధనం మంత్రం. 

మంత్రం అనేది స్థూల శబ్దం. నిజానికి మనిషి, జంతువు, రాయి యిత్యాదులన్నీ స్థూల శబ్దాలే. మన మనసు కూడా ఒక శబ్దమే. అయితే ఏ శబ్దమైతే స్థూలమైన 'మనసు' శబ్దాన్ని తనలో కలుపుకుని, సమస్త పదార్థాల చేతనకు కారణమైన సూక్ష శబ్దాలను లయం చేసుకుంటూ, శక్తి లక్షణమైన కారణ శబ్దం వైపు తీసుకొని పోగలదో .. అట్టి ప్రత్యేక శక్తి గల శబ్దమే మంత్రము. నింగి, నేల,నీరు, నిప్పు, గాలికి ఎలా మతాలు లేవో .. అలాగే వాటి తన్మాత్రలైన శబ్దం, గంధం, రుచి, రూపం,స్పర్శ లకు కూడా మతాలు లేవు. మనిషిని చక్కదిద్దేది మతం. మానవాళి శ్రేయస్సును తీర్చిదిద్దేది మంత్రం.

దీనిపై ఋషులు వేల వేల సంవత్సరాలు పరిశోధన చేసి .. ఎలాంటి శబ్దం మనిషి మనసుని కారణ శబ్దానికి పరిచయం చేసి, అక్కడ నుంచి ఆ మనసుని శక్తి లక్షణానికి, తత్వానికి దగ్గరగా తీసుకువెళుతుందో తెలుసుకున్నారు. అలాంటి శబ్ద (సంపుటికి) రూపానికి గాయత్రీ మంత్రం అని పేరు పెట్టారు. ఆ మంత్రాన్ని ఎవరైతే మననం చేస్తూ మనసులో రాపిడి పుట్టిస్తారో వారి మనసు కారణ శబ్దం దిశగా ప్రయాణం మొదలుపెడుతుంది. అందుకే  మానవులందరూ గాయత్రీ మంత్రాన్ని జపించాలని, దాని వల్ల కాలంలో వచ్చే మార్పులకు జీవ - పర్యావరణ సమతుల్యత చెక్కుచెదరదని  బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హితవు చెప్పాడు. అందుకే  గాయత్రీ మంత్రాన్ని అందరూ తమ తమ సామర్ధ్యం మేరకు జపించాలి. 

జీవితం - పరమార్ధం

జీవితంలో రెండే ఉంటాయి. ఒకటి శరీరము. రెండవది మనస్సు. ఎవరెవరి జీవితాల గురించి ఎంత మంది చెప్పినా .. అదంతా ఆ రెండిటి గురించే. మనిషికి ఉన్న ఆదర్శాలు, ప్రతిభాపాటవాలు, ఘనతలు, భావజాలాలు, పోరాటపటిమలు, విశాల హృదయాలు ... ఇలాంటివి అన్నీ ఆ మనిషి శరీరము, మనస్సుకి ముడిపడి ఉన్నవే తప్ప మరొకటి కానేకాదు. 

కాలం నడిపించే ఈ సృష్టిలో .. మనిషి కాలధర్మానికి లోబడి జీవించాల్సిందే. అంటే మనిషి శరీరము, మనస్సు కాల నియమాన్ని అతిక్రమించి ప్రవర్తించ లేదు. అలాగే ఎంతటి మహానుభావుడైనా కాలంలో సొంత పెత్తనం చేయలేడు. ప్రతి శరీరం బాల్యం, యవ్వనం, వార్ధక్యం దశలు అనుభవించాల్సిందే. మనస్సు కూడా ఆ శరీర దశలకు అనుగుణమైన అవస్థలను అనుగమించాల్సిందే. ఏ జీవితమైనా అంతే.

జీవితానికి ఏది ఆధారమో, మరణానికి ఏది కారణమో తెలియని స్థితిలో.. ప్రతి మనిషీ తను జీవిస్తున్నాను అనుకుంటాడు. నిజానికి జీవిని నడిపించేది అవసరం. అవసరం అనేది లేకపోతే సంబంధం అనేదే ఉండదు. సంబంధమే లేకపోతే జీవితానికి అర్ధమే తెలియదు. ఇక పరమార్ధాన్ని తెలుసుకునే అవకాశం ఎలా ఉంటుంది? మానవ జీవితం  పరమార్ధాన్ని తెలుసుకోవడానికే అని గ్రహించిన ఋషులు ..ఈ సంబంధాన్ని ముడిపదార్ధంగా చేసుకుని కుటుంబ వ్యవస్థను ఏర్పరచారు. 

శరీరము, మనస్సు అనే వాటితో నడిచే జీవితానికి రెండు సంబంధాలుంటాయి. రక్త సంబంధం, భావ సంబంధం.  జన్మకి కారణమైన వారితో ఏర్పడేది రక్త సంబంధం. పెరిగి పెద్దయ్యాక తన భావాలతో భార్య (భర్త) అనీ, స్నేహితుడనీ,  శత్రువనీ ఏర్మరచుకున్నవి భావ సంబంధం. ఒక జన్మకి ఇద్దరు తల్లులు ఉండరు కాబట్టి రక్తబంధం బలమైనది. భార్య (భర్త), మిత్రుడు, శత్రువు అనే మూడు బంధాలు కేవలం 'అనుకుంటేనే' ఏర్పడేవి కాబట్టి భావబంధాలు బలహీనమైనవి. అందరూ ఈ బంధాల మధ్యలో, తమ తమ అవసరాల కోసం, ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తూ జీవించడం మినహా ఇంకేమీ చేయలేరు.

అత్యుత్తమం, ఉత్తమం, మధ్యమం, నీచం, అతినీచం అనే స్థాయిల్లో మనిషి అవసరాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి చేసే ప్రయత్నమే జీవితం. ఈ ప్రయత్నంలో మనిషి అన్ని వేళలా లేదా అన్నిటియందు సమభావంతో ఉండడం అసంభవం. మనిషి తన అవసరం కోసం ఏదో ఒకదాని యందు మాత్రమే ఇష్టం లేదా అయిష్టంగా ఉండగలడు తప్ప రెండిటి యందు సమాన ఇష్టాయిష్టాలతో ఉండలేడు. ఇన్ని పరిమితులను, ఇంతటి అశక్తతను తనకు తానుగా గుర్తించలేకపోవడమే మాయ. దాని పొరలలో చిక్కుకుని తాను ఉదారుడు, విశాల హృదయుడు, కళాకారుడనే భ్రమలో జీవుడు ఉంటాడు.

బాల్యంలో అమ్మతో ఉన్న మనస్సు యవ్వనంలో మరో స్త్రీతో ఉండటానికి ఇష్టపడడం సహజం. శరీరం వార్ధక్యంలో ఉన్నపుడు మనసు యవ్వనంలో ఉండడం అసహజం. మనిషికి సమభావం అసంభవం. ఎలాంటి వికారాలు లేకుండా శరీరము, మనస్సుకి ఉన్న పరిమితులను అంగీకరిస్తూ, అవసరాలు - సంబంధాల ప్రలోభంలో పడకుండా ..మాయ, భ్రమ .. ప్రభావం నుంచి ఎవరికి వారు బయటపడడమే వారి వారి జీవిత పరమార్ధం.

నియమ జీవనమే ఆథ్యాత్మిక జీవనం

తెలుసుకుందాం అనేది అందరికీ ఉండే ఆసక్తి. ఎలాంటి విషయాలను ఎంత లోతుగా తెలుసుకుంటారు అనేది మాత్రం ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఏది ఏమైనా విషయాసక్తి లేని జీవుడు ఉండనే ఉండడు. ఎలాంటి వ్యక్తిత్వాన్నైనా తీర్చిదిద్దేది ఈ విషయాసక్తే. ఇది మూడు రకాలు. ఒకటి ప్రపంచ విషయాలు, రెండు శాస్త్ర విషయాలు, మూడవది 'తన' (సొంత) విషయాలు. ఆ విషయాలపై ఆయా పరిమాణాల్లో ఉండే ఈ ఆసక్తే వ్యక్తి జీవన విధానాన్ని శాసిస్తూ ఉంటుంది. ఎవరూ ఈ సూత్రానికి మినహాయింపు కాదు.

ప్రతి వ్యక్తిలో ప్రస్ఫుటంగా కనిపించే ఈ విషయాసక్తి ద్వారానే ఇష్టాయిష్టాలు ప్రేరిపితమవుతూ ఉంటాయి. ఆ ఇష్టాయిష్టాలే సుఖద్ణుఖాలకి కారణం. అవే ఆ జీవిలోని (సాత్విక, రాజసిక, తామసిక) గుణాలను రెచ్చగొడుతూ ఉంటాయి. ఆ గుణాలే చేతలను, ఆ చేతలే రాగద్వేషాలను, అవే మళ్లీ ఇష్టాయిష్టాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. గమనిస్తే ఎవరి జీవితమైనా ఈ వలయంలోనే తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రతివాడూ ఈ వలయాన్ని భేదించడానికే జీవిస్తున్నట్టు భ్రమ కలుగుతుంది. 

పరస్పర అంతరాలకు కారణమవుతున్న ఈ విషయాసక్తిని శుద్ధి చేస్తేనే సామరస్య సహజీవనం సాధ్యం. అందుకే సంఘం లో శాంతి నెలకొనాలంటే ఎవరికి వారు తమ గురించి తాము తెలుసుకోవాల్సిందే. తన ఆలోచన, చూపు, మాట, చేత వంటి సమస్త (ఇంద్రియ) కదలికలకు ఏది కారణమో తెలియని వారు ఇతరుల కదలికల్లోని గూఢమైన ఆంతర్యాన్ని గ్రహించలేరు. అందుకే 'తన గురించి తాను తెలుసుకోవడం' వ్యక్తి కనీస బాధ్యత. 24 శాఖల పనితనమే తెరమీద 'సినిమా'గా కనప డుతున్నట్టు, త్రిగుణాలతో ప్రభావితమైన దశేంద్రియాల కదలికలే 'మనసు'గా మనకి తెలుస్తోంది. అంటే నేను అని మనం అనుకుంటున్న ఈ మనసును నడిపించేది మనలోని త్రిగుణాలే.

ఇలా మన జీవితానికి ఆధారంగా ఉన్న మనసే గుణాలను ఆసరా చేసుకుని విషయాసక్తిని రేపుతూ ఉంటుంది. కాబట్టి గుణాల ఎగసిపాటుని నిరోధించగలుగుతే మనసు కూడా ఆయా విషయాలపై ఉండే ఆసక్తి నుంచి తిరోగమిస్తుంది. అంటే ఇంద్రియాల వేగం తగ్గిందని అర్ధం. అలా విషయాలపైకి ఇంద్రియాల వేగం తగ్గగానే నెమ్మదించిన మనసు క్రమంగా శక్తిని కూడగట్టుకుంటుంది. ఈ దశలో నియమాలను కచ్చితంగా పాటించకపోతే .. కూడగట్టుకున్న శక్తితో మనసు (ఇంద్రియాలు) మళ్లీ బాహ్యం (విషయాల) లోకి దూకుతుంది. దీంతో రోగంలాంటి విషయాసక్తి క్యాన్సర్‌లాంటి అహంకారంగా మారుతుంది. అందుకే నియమాలను పాటించగలిగిన మనసుని మాత్రమే శక్తిని కూడదీసుకునే మార్గంలోకి మళ్లించాలి.

'నాకు తెలుసు(లే)'

'నాకు తెలుసు(లే)' అని అనని, అనుకోని మనిషి ఉండడు. కానీ మనిషికి ఏమన్నా తెలుసా లేక ఏదైనా తెలుసుకోగలడా అనేది ప్రశ్న. ఎవ్వరికైనా తెలియనిది అంటూ ఏదో ఒకటి ఉంటుంది. నూటికి కనీసం ఓ 60 మంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు కాబట్టి అంత ఇబ్బంది లేదు.

ఇక .. నాకు తెలుసు అన్న విషయం గురించే అసలు ఇబ్బంది. నూటికి 99 మంది అంటున్న ఈ తెలుసు అన్నదాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇంతకీ మనిషికి తెలిసింది ఏంటి, తెలుసుకోగలిగినది ఎంత? తెలివితేటలని పొరలు పొరలుగా విడదీస్తేనే తప్ప అసలు రంగు బయటపడదు.

నిప్పు కాలుతుందని అందరికీ తెలుసు. కానీ జీవితంలో ఒక్కసారైనా అందరికీ కనీసం వేలైనా చుర్రుమని అనే ఉంటుంది. ఏం?  తెలియడం వల్ల 'సంఘటన'ని నియంత్రించడం ఎవరి వల్లా కాదు. ఆట ఎంత తెలిసినా సచిన్‌ సైతం అవుట్‌ అవ్వాల్సిందే. అందుకే 'తెలుసు, తెలివితేటలు' వంటి పదాలు కాలగమనంలో మనిషిని గట్టెక్కించ లేవు.

తనలో కలిగిన భావానికి కారణం తెలియడమే అసాధ్యమైనప్పుడు, కాలంలోని విషయాలకి భాష్యం చెప్పటం అమాయకత్వం. అందుకే మనిషి ముందుగా తెలుసుకోవాల్సింది తన గురించే అని ఆథ్యాత్మికం కరాఖండిగా చెప్పింది. నీ గురించి నీకు తెలిసేంత వరకూ నీకు ఇంకేదీ తెలిసే అవకాశమే లేదు అనేది సూత్రం. ఈ సూత్రంలో ఉన్న మర్మం తెలియాలంటే .. ప్రతి విషయాన్నీ 'ఎందుకు' అని ప్రశ్నించాలి.

తన ఆలోచన, మాట, చేత, కదలిక .. అలా ఎందుకు ఉంది అని ప్రశ్నించుకుంటే, ఎవరి అజ్ఞానం వారికే కనిపిస్తుంది. ఉదయం నుంచీ రాత్రి వరకూ జరిగిన ప్రతి అంశమూ ఎందుకు అలా జరిగిందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ 'నేను' ఎవరో తెలిసిన వారికి సాధ్యం.

మనసుకి ఆపాదించుకునే లక్షణం ఉంది. అందుకే ఎవరికి వారు నేను, నా అభిప్రాయం అంటూ మాట్లాడుతుంటారు. కానీ మనిషికి సంఘటనలను నడిపించే సామర్ధ్యం, స్వాతంత్య్రం ఉండనే ఉండదు. ఆ సంఘటనలలో తను అప్రమేయంగా కదిలిపోతున్నా .. తన ప్రమేయాన్ని ఆపాదించుకుని కబుర్లు చెప్పడం మనసు చేసే కోతిపని.

కాబట్టి మనసు ఆ పని చేయకుండా నిఘా ఉంచాలి. నిఘా ఉందని తెలుస్తే దొంగ కూడా నిజాయితీగా ఉంటాడు. కానీ మనసుపై నిరంతరం నిఘా ఉంచడం సాధ్యపడదు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా దొంగతనం చేసినవాడికి శిక్ష ఉంది కానీ దొంగతనాన్ని ఆలోచించిన వాడికి శిక్ష లేదు. నేరపూరితమైన ఆలోచనకి శిక్ష వేయగల సమర్ధత ఈ ప్రపంచానికి లేదు. దొంగతనం అంటే వ్యక్తి చర్య అని మాత్రమే సంఘం గుర్తించగలదు. చర్యకి కారణమైన ఆలోచన రాకుండా చేయడం, అలాంటి ఆలోచనకు మూలమైనదాని స్వభావాన్ని మార్చడం ఏ మనిషి వల్లా, ఏ వ్యవస్థ వల్లా సాధ్యపడదు.

కానీ మనిషి .. 'నేను' అనుకుంటున్న మనసును పుఠం పెడితే .. అసలు చర్య యొక్క రూపమే మారిపోతుంది. అలా మనసు స్వభావాన్ని మార్చేదే మంత్రం. అనంతమైన 'నేను' మనిషికి అనుభవమవాలంటే .. మనసు మౌనంలోకి వెళ్లాల్సిందే. మౌనం అంటే మరో ధ్యాస లేని పనిలో నిమగ్నమవడం. మనసుని మౌనంలోకి తీసుకెళ్లగలిగినది జపం ఒక్కటే.

అందుకనే ముందుగా 'నేనేవరు' అనే ప్రశ్నని పదేపదే సంధిస్తూ ఉండాలి. అపుడు నీరు పల్లమెరుగు అన్నట్టు మనసు మౌనంలో విరాగమవుతుంది. క్రమేపీ    ఆపాదించుకునే లక్షణానికి దూరమవుతుంది. తద్వారా మనిషి తాను దేనికీ కర్త కానని గ్రహించగలుగుతాడు. అలా ఈ భౌతిక జీవనంలో తను చేసేది, పొందేది ఏదీ లేదని ఎరుకగలిగిన స్థితిలో ఉండగా జీవుడు అనంతంలోకి విస్తరించే    ప్రక్రియ .. శ్రీకారం చుట్టుకుంటుంది. అంతటా వ్యాప్తి చెందిన జీవుడే అసలైన .. పూర్ణమైన ''నేను''.

మనసు మిత్రుడా శత్రువా

ప్రతి మనిషీ తన దేహాన్ని ఉద్దేశించి ‘‘నేను’’ అని ప్రకటిస్తూ ఉంటాడు. ఆ దేహం ఇంద్రియాలకు నిలయం. ప్రాణంతో ఉన్న దేహం నుంచి అందిన శక్తితో కదిలే ఇంద్రియాలే .. జడ స్వరూపమైన మనసును చైతన్యం చేస్తాయి. చైతన్యమైన మనసు ఆ (మనిషి చెప్పుకునే) ‘‘నేను’’ను స్వాధీనం చేసుకుని ఇంద్రియాలు అనే గుర్రాల మీద సవారీ చేస్తూ ఉంటుంది.

కానీ ఈ స్వారీని .. ‘నేనే’ చేస్తున్నాను అనుకుని మనిషి మురిసిపోతూ ఉంటాడు. కొన్నేళ్లకి వయోభారంతో దేహంలో ప్రాణశక్తి క్షీణించి ఇంద్రియాలకు ముసలితనం వస్తుంది. ఆ ముసలి (ఇంద్రియాలపై) గుర్రాలపై స్వారీ చేయలేక మనసు చతికిబడుతుంది. దాంతో పాటు మనిషి కూడా చతికిలబడక తప్పదు. ఈ పరిస్థితికి ఏ మనిషీ మినహాయింపు కాదు. ఇది ప్రకృతి నియమం. 

ఇంద్రియాల ఆసరాతో గంతులేసే మనసుకు ఇంద్రియాతీతంగా వికసించే లక్షణం కూడా ఉంది. ఎవరికైతే  ‘నేను  వేరు, మనసు వేరు’ అనే ఎరుక ఉంటుందో వారి మనసు మాత్రమే వికసించే దిశగా ప్రయాణిస్తుంది. ఆ మనసే దృశ్య భౌతికం (ప్రపంచం) కాకుండా అధిభౌతికం (మరో ప్రపంచం) ఉందని గ్రహిస్తుంది. దానినే మానసిక వికాసం అంటారు.

ఇలా మనసును వికసింప జేయగల శక్తిసామర్ధ్యాలు మేధస్సుకు ఉండవు. మేధస్సు .. దృశ్య (ఇంద్రియ) చింతన పరిధిలో ఉంటుంది. ఇది పరిమితం. మనోవికాసం .. తత్వ (ఇంద్రియాతీత) చింతన పరిధిలో ఉంటుంది. ఇది అపరిమితం. మేధావులు శాస్త్రాలను ప్రమాణంగా తీసుకుని తర్కం అనే కోట కట్టుకోగా, తాత్వికులు అనుభవాన్ని ప్రమాణంగా తీసుకుని అనుభవ సారాన్ని అందరికీ పంచారు.  

మేధావుల సిద్ధాంతాలు ఇజాలుగా, తాత్వికుల  అనుభవాలు మతాలుగా ప్రపంచంలో పాతుకు పోయాయి. వాస్తవానికి ఇజాన్ని విశ్వజననీయం చేయడం అసంభవం. అలాగే అనుభవాన్ని అక్షరబద్ధం చేయడం అసంభవం. ఈ సూత్రంలోని మర్మం మనిషి జీవితానికి చుక్కాని అయినప్పుడే నిత్య జీవనం ఆనందమయం అవుతుంది.


Tuesday, 28 April 2026

మంచి విషయాలు

తపస్సు అంటే మనస్సుని క్రమంగా (ఎన్నేళ్లకో తెలీదు) ‘మరొకటి’ తనలో కలిపేసుకునే సాధన చెయ్యడం. దానికి మోహం ఒక్కటే అడ్డు. ఆ మోహానికి దేహం ఆధారం. దేహానికి ఆహారం ఆలంబన. ఆహారానికి ‘ఆర్థికం’ అవసరం. దానికి మూలమైన మోహం నుంచి తప్పుకోవడానికి యాచన (భిక్షాందేహీ) మాత్రమే మార్గం.

ఏ మనిషీ తనకు తెలిసిన దానితో  జీవితమంతా ఆనందంగా గడపలేడు. ఏ మనిషీ తన ఆనందం కోసం  సమస్తాన్నీ తెలుసుకోలేడు. ‘తను’ సత్యం, తను పొందాల్సిన ‘ఆనందం’ సత్యం. ఆ సత్యానుభవమే ‘అహం బ్రహ్మస్మి’.

‘ప్రయత్నం’ మానసికం అయినప్పుడు జయాపజయాలు తప్పవు. అదే ప్రయత్నం ‘‘దైవికం’’ అయినప్పుడు అంతా ఆనందమే. ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే మనందరి కర్తవ్యం.

ప్రతి పనిని మన ప్రతిభతో కాకుండా దైవ భావనతో చేపట్టినపుడు, నైపుణ్యం పెరగడమే కాకుండా, ఆనందం రెట్టింపు అవుతుంది. ‘దైవం .. మన ఆనందం కోసం’ అన్న భావనే ఆధ్యాత్మికానికి పునాది.


LISTEN. 

Do not speak, do not see.

LISTEN.

Close your lips, close your lids.

LISTEN.

The ability to 'do' can be acquired only when the humility to listen manifests. 'Doing' is the fascinating result of attentive listening. A person can not understand beyond his/her mind unless he/she listens to the 'experienced' with submission. Are you ready to listen? Enjoy the life however it unfolds.  


ఆకలితో ఉన్నవాడికి అన్నం ముఖ్యం కానీ, ఆత్మజ్ఞానం కాదు అని ఆదిశంకరులు చెప్పారు.  దేవుడు మీద నమ్మకంతో, దైహిక - ప్రాపంచిక అవసరాల మీద నుంచి "ధ్యాస"ని మళ్లించిన వాడికి "అనంత శక్తి" అనుభవమవుతుందని కూడా ఆదిశంకరులు స్పష్టంగా చెప్పారు. 

మనిషికి రెండు ధ్రువాలు ఆధారం.  ఒకటి ఆలోచన. రెండవది అనుభవం.  ఆలోచనను ప్రేరేపించేది 'దృశ్యం'. అనుభవంలో శాంతినిచ్చేది 'సాత్వికం'. అంటే .. సాత్వికానుభావాన్నిచ్చే దృశ్యం మాత్రమే 'సద్భావన'కు పునాది అవుతుంది. సద్భావనలను  స్మృతిలో నిలుపుకోవడమే 'ఆరాధన'.

In terms of the universal cosmology vaikhari, madhyama and pashyanti sounds correspond respectively to bhuh, bhuvah, and svah.  కర్మకి గల కార్య స్థానాల స్థాయిలు కూడా అవే. (శరీరం, మనసు, స్ఫురణ) para స్థితిలో ఉన్న శబ్దం .. ఒక్కటే కర్మ రహితమైనది. (అవాజ్గ్మానస గోచరం) జీవిని ఆ స్థితికి చేర్చగలిగినదే 'గాయత్రీ మంత్రం'. 

మనిషికి ఉన్న శక్తి పేరు ఇష్టం. మిగిలినవన్నీ దాని సామర్ధ్యాలు మాత్రమే. ఈ ఇష్టం మనసు పరిధి దాటి వ్యవహరిస్తే ఆ వ్యవహారాన్ని ఆరాధన అంటారు. మామిడాకుకు మూడు నామాలు ఏమిటనుకోవచ్చు. అరె ఇది కూడా ఎంతందంగా ఉందో అనచ్చు. అందుకే ఆరాధన మనసుకి ఎబ్బెట్టుగా, మనసు దాటితే తన్మయత్వంగా ఉంటుంది. జీవనశైలి స్వచ్ఛంగా ఉంటే దాని ప్రభావం జడంగా ఉండదు.

శుద్ధమైన శబ్దం .. అక్షరంగా, భాషగా, లిపిగా దిగివచ్చిన నిచ్చెనమీదుగానే .. శుద్ధమైన శబ్దంలోకి ఎగబాకే సాధనే "ఆథ్యాత్మికం".తీపిదనం ఉన్నది 'ఘనమైనా. ద్రవమైనా' జిహ్వామోదమే.శుద్ధ శబ్దంగా ఉన్నది 'ఏదైనా, ఎలాంటిదైనా' సహమోదమే.

మనసులో పుట్టే భావోద్వేగాల వల్ల

సిద్ధాంతాలు తయారవుతాయి. 

మనసుకు అవతల మాటలకు అందని

స్థితి వల్లనమ్మకం ఏర్పడుతుంది.

సర్వేంద్రియాణామ్ నయనం ప్రధానం అన్నారు. ఎందుకంటే దృశ్యమే ఇంద్రియాలను తీవ్రంగా ప్రేరేపిస్తుంది. అందుకే ఇంద్రియాలను శాంతపరిచి సాత్వికమైన భావాలను ఉద్దీపనం చేసేందుకే .... దృశ్య ప్రధానమైన ..విగ్రహారాధన ప్రతిపాదితమైంది. అదీగాక, ఆలంబన లేని నిరాకార ఆరాధనలోని అగాధాన్ని దాటించేది విగ్రహారాధనే.

సంప్రదాయం ఉన్న జీవనంలోనే జీవం ఉంటుంది. కాబట్టే 'పండగ' ఇప్పటికీ 'కొత్త బట్టలు' కట్టుకుంటోంది. అమ్మ కుట్టించిన బట్టల్ని తోబుట్టువులతో కలిసి తొడుక్కుంటే .. ఆ 'పండగే' జోషే వేరు. అమ్మ చెయ్యి పట్టుకుని గుడికి వెళ్లి పెట్టిన... ఆ 'దండం'లో థ్రిల్లే వేరు. అమ్మ వండిన అప్పచ్చిని ఆటల్లో తింటుంటే .. ఆ 'ఆకలి' టేస్టే వేరు. అమ్మ చుట్టూ తిరుగుతూ బుధ్ధిగా నేర్చుకున్న ... ఆ 'జీవితం' విలువే వేరు. పండగ ఓ inspiration. బతుకును 'పండించు' కోవడానికి. సంప్రదాయంగా జరుపుకునేదే పండగ. పండగని వేడుకలా చేసుకోకూడదు.

అనుభవ దర్పణం

శక్తిని క్షీణింపజేసే పదార్ధాల నుంచి దూరమై,శక్తిని వృద్ధి చేసే పదార్ధాలకు చేరువై ..జీవనం సాగించడమే మన విధి. ఈ విధి విధానాలను వివరించేదే ఋషిమార్గం.

మనిషి అవసరాలు తీర్చేది ప్రకృతి.ఆ ఇద్దరికీ ఉన్న బంధాన్నే కర్మ అంటారు.ఆ కర్మ బంధం మేరకు మనిషిఅవసరాలను తీర్చడమే ప్రకృతి పని.కర్మలో లేని విషయాన్ని మనిషి ఎంత కోరుకున్నా దానిని ప్రకృతి సమకూర్చదు. 

తీరని కోరికలతో మనిషి వికృతమవడం, వికృత జీవుల విన్యాసాలకు భూమినిస్సారమైపోవడం కాల ప్రభావం. ఆధ్యాత్మిక శక్తితో మనిషి జీవనశైలిని క్రమబద్ధంచేయడం, ఆత్మశక్తితో ప్రకృతిలో సారాన్ని పెంచడంవంటి ఉత్తమ లక్ష్యాల సాధనకు యజ్ఞక్రియల నిర్వహణే సర్వోత్తమ మార్గం.

భగవంతుడు ఆ ఏనుగు మీది అంబారీలోనే ఉండొచ్చుగాక ..కానీ ఆ అంబారీని మోసే ఏనుగుకి ఓ అరటి పండిచ్చినా ..సాక్షాత్తూ ఆ భగవంతుడినే శిరసా ధరించినట్టు. !!!

భగవంతుని సంకీర్తన వల్ల మన మన మనసుల్లోనే కాదు, మన చుట్టూ ఉన్నవాతావరణంలో కూడా ఆహ్లాదం నిండుతుంది. మన ఇంట్లో, నిత్య జీవనంలో హాయిగా ఆ పరమాత్ముడిని అనవరతమూ సేవించుకోవడమే సద్భక్తితో కూడిన "సంకీర్తన". 

మనిషికి ఆనందం .. అరిషడ్వర్గాలు అదుపులో ఉన్నపుడే. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచేది సత్వగుణం ఒక్కటే. సత్వగుణాన్ని వృద్ధి  చేసేది  ఆరాధనా భావం మాత్రమే. ఆరాధనా భావాన్ని పాదుగొలిపి, పోషించి, పరిపుష్టం  చేసేది .. భగవంతుని సేవించే 'మనసు'.

గుణాలు మనిషిలోని అరిషడ్వర్గాల వేగాన్ని పెంచుతాయి. అరిషడ్వర్గాల కదలిక జీవుడి కర్మకి సంబంధించినది. కర్మ వల్లనే జన్మల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది.

"మహిమ" అనే దాన్ని వేదాంతం ఒప్పుకోదు.  స్థిరత్వం ఉన్న జీవుడికి "గోచరించనిది" అనేది ఉండదు కాబట్టి .. గమనించలేని ఇతరులు పేర్కొనే 'మహిమ' .. కేవలం వేగం అంటుంది. "యాదృచ్ఛికం" అనే దాన్ని కూడా వేదాంతం ఒప్పుకోదు. కాలం విస్తీర్ణం తెలిసిన జీవుడికి "సంఘటన"కు కారణం తెలిసి తీరుతుంది కాబట్టి .. కారణం తెలియని మేధస్సు చెప్పే 'యాదృచ్ఛికం' .. కేవలం కూర్పు అంటుంది.

మంత్రాక్షరం లోని శబ్దాన్ని మథించడాన్ని 'జపం' అంటారు. జప శక్తిలోని కొంత భాగాన్ని జీవ శ్రేయస్సు కోసం  అగ్నికి ఆహుతినివ్వడమే  మహాయజ్ఞం.  ‘దేవుడికి ప్రేమపూర్వకమైన సేవ’ చేసుకోవడం తప్ప మనిషికి వేరే పనంటూ లేదు. ఇది నిష్కామ కర్మ మార్గం. ఏ పనికైనా ‘భగవంతుడు మూలం’ అని త్రికరణశుద్ధిగా నమ్మితే ఆనందం చేరువవుతుంది. ఇది భక్తి మార్గం. ఏ పనైనా ‘భగవంతుడే’ అని త్రికరణశుద్ధిగా  నమ్మితే జ్ఞానం ఆవిష్కార మవుతుంది. ఇది జ్ఞాన మార్గం.  

సమస్త జీవరాశుల్లో ' బుద్ధిమంతుడు'  అవగల సమర్ధత మనిషికి మాత్రమే ఉంది. అంతరంగాన్ని అణకువతో అర్పించడమే  భక్తి. మనిషి మనిషిలా బతకాలన్నా,  మహర్షిలా ఎదగాలన్నా ..  కాలం కలిసి రావాల్సిందే.  అందుకనే ఋషులు మన కోసం  '' జీవన విధానం '' రూపొందించారు. అలా జీవించే వారిని కాలం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ధర్మజీవనం కాలాన్ని అమృతం చేస్తుంది. సైద్ధాంతిక జీవనం మనిషిని సంకుచితం చేస్తుంది.

Mind - Mantra - Manifestation

Mind ‘merges’ only in SAMADHI, and nothing can be said about it.  Unless one attains SAMADHI, his (or her) mind, definitely, remains. Beware! Mind has the capacity to behave ‘either way’ when there is opportunity. So it is useless to name any ‘state of mind’ (so as to honor or condemn), because every ‘state of mind’ is fickle in course of time. In fact spirituality has nothing to do with mind or its activity. So spirituality neither answers nor discusses.  Only ‘modern’ spirituality stress on Q & A and groups, because ‘its experience’ (which must be respected) is limited to that.  Mantra is a spiritual word or short phrase that can be repeated silently in the mind as a means of connecting with our inner wisdom. You can use your mantram while walking, doing chores, or when you are falling asleep. It is a comfort and a support during times when you are angry, afraid, nervous, or worried. And it can provide assistance as we try to shed our likes and dislikes. With the mantram we regain our natural energy, confidence, and control, so that we can transform everything negative in us and make our greatest possible contribution to the welfare of those around us. The mantram serves as calming force in the face of fear and confusion. Using the mantram every day will help it take root in your consciousness.

As the specific pattern of controlled wind-flow through the holes of a flute produces specific sonorous tune, likewise, the vibrations induced by the repeated rhythmic chanting of a specific mantra generate specific pulsation of prana and stimulate the extrasensory energy nuclei in the body accordingly.  The japa of Divine Name or Mantras has been an integral part of all modes of worship or prayer in every religion be it Hindu, Sikh, Islam, Buddhist, Christian, Tao, Bahai, etc. Japa-sadhana is a scientific method devised by the Rishis to activate the extrasensory energy centers within to facilitate the sublime flow of vital spiritual currents in this majestic living system.

The sound of a particular mantra also has to pass through several stages before it is fully experienced by the listener in perfection. These stages are termed as para, pashyanti, madhyama and vaikhari. Each level of sound corresponds to a level of existence, and one's experience of sound depends upon the refinement of one's consciousness. It takes a realized consciousness to experience the full range of sound, the full range of existence. The seers who can comprehend the four stages of sound are known as Manishis.

Monday, 27 April 2026

ఎందుకు "అనిపిస్తుంది"?

బుద్ధుడి కథ అందరికీ తెలుసు. వార్ధక్యం, రోగం, మరణం .. అనే అంశాలు అతన్ని కదిలించి వేశాయి. ఈ మూడూ మనిషికి అత్యంత దుఃఖ హేతువులని భావించాడు. ఇవి మనిషిని ఎందుకని పెనవేసుకుని పోయాయి అని చింత పడ్డాడు. ఈ మూడూ జీవులకు ఉండకూడదు అని అనుకున్నాడు. వాటిని పూర్తిగా తొలగించాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించు కున్నాడు. ఈ అంతఃపురం తన చింతనకు అనువైన ప్రదేశం కాదు అనుకున్నాడు. భార్య, పిల్లవాడు, తల్లిదండ్రులు, రాజ్యాధికారమే కాదు అసలు ఈ భోగయుతమైన జీవనాన్నే వదిలి వెళ్లిపోవాలని అతనికి అనిపించింది. ఎందుకని?

చాలామంది స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుకుంటారు. కానీ ఆజన్మాంతం తన జీవితం మరొక దానికి బందీ అని తెలుసుకోరు. విజ్ఞులు సూచించిన చింతనను ఒక్కసారి స్వీకరిస్తే తామెంత బంధనంలో ఉన్నామో ఎవరికైనా తెలుస్తుంది. బుద్ధుడికి ఇల్లు వదిలి వెళ్లాలని ఎందుకు అనిపించింది? ఎన్ని కారణాలు చెప్పినా .. ఆ విధంగానే .. అనిపించడానికి కారణం ఏమిటో ఎవ్వరూ చెప్పలేరు. బుద్ధుడు కూడా. ఈ అనిపించడం అనేది దేనివల్ల కలుగుతుందో తెలుసుకోవడం ఎవ్వరి వల్లా కాదు.

ఒకడు మామూలుగా తన రోజువారీ పనుల్లో తలమునకలుగా ఉన్నపుడు సడన్‌గా ఓ వ్యక్తిని ఫలానప్ఫుడు కలవాలని అనుకుంటాడు. ఆ టైమ్‌కి ఆ వ్యక్తిని కలుస్తాడు. ఆ తర్వాత మొత్తానికి ఎవో కొన్ని సంఘటనలు జరుగుతాయి. సరే! అసలు ఆ వ్యక్తిని కలవాలి అని ఈ మనిషికి ఎందుకు అనిపించింది. అనిపించకపోతే కలిసేవాడు కాదుగా .. ఆ సంఘటనలు జరిగేవి కాదుగా!! కానీ ఆ ..అనిపించడం .. నుంచి ఆ మనిషి కాదుకదా, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకని?

నాకు అది ఇష్టం అంటారు, ఆ అమ్మాయినో, అబ్బాయినో ప్రేమించాను అంటారు, నాకు అది పడదు అంటారు, నేను పెద్దయ్యాక డాక్టరవుతా, యాక్టరవుతా అంటారు .. అలా అనాలని వారికి ఎందుకు అనిపిస్తుంది? నా గురించి నాకు తెలుసు అంటారు కానీ ఫలానాది నీకు ఎందుకు ఇష్టం అంటే ఒక్కరూ చెప్పలేరు? నీకే అనిపించిన దానికి ఏది కారణమో నీకు తెలియనప్పుడు .. ఇతరుల ఆలోచనలకి, చేతలకి కారణమేమిటో నీకు ఎలా తెలుస్తుంది? అందుకే రమణ మహర్షి అంటారు .. నువ్వెవరు! తెలుసుకో .. అని.

తన నుంచి కదులుతున్న ఆలోచనలకి, చేతలకి ఏది కారణమో తెలియనప్పుడు, వాటికి కర్తను నేను అని అనుకోవడం అమాయకత్వం. నా జీవితానికి ఇదీ కారణం అని తెలియని వాడికి ఆ జీవితం మీద స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎలా వస్తాయి, ఎవరిస్తారు? చూసిన వస్తువు మీద, విన్న విషయం మీద, తెలిసిన స్పర్శ మీద, కలిగిన రుచి మీద .. ఇలా ప్రతిదాని మీద ఏ ఇద్దరికీ ఒకే భావన కలగనప్పుడు .. తన భావనా అనుభవంతో మరొకడి మనోగతాన్ని నిలదీయడం, తన భావజాలానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండాలనుకోవడం .. కేవలం తెలివితేటలతో పరస్పరం మోసం చేసుకోవడమే.

మనిషి జీవితాన్ని నిర్దేశించే ''అనిపించడం'' వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఋషులు తెలుసుకున్నారు. మనలాంటి వాళ్లం ఇంకా తెలుసుకోలేదు. అందుకే మనలో కొందరు తెలివిగా ''తెలియనిది ఏదో'' అని వాడుతుంటారు. ఋషులు తెలివిగా మాట్లాడరు, అనుభవంతో మాట్లాడతారు కాబట్టి ఆ తెలియనిదే కర్మ అన్నారు. అది ఏమిటో తెలియకపోతే వచ్చే నష్టం లేదన్నారు. అది ఉందో లేదో అని వాదులాడుకుంటే కలిగే ప్రయోజనం శూన్యం అన్నారు. అది మనల్ని సుఖపెట్టినా - కష్టపెట్టినా పట్టించుకోకపోతే ఆనందం వస్తుందన్నారు. అలా ఆనందంగా ఉండాలంటే "ఇలా జీవిస్తే చాలు" అని మార్గం చెప్పారు.

జీవనం ఋషిప్రోక్తం

ఈ విశాలమైన భూమండలంలో భారతదేశం అని పేరుగాంచిన భూభాగం ఎంతో విశిష్టమైనది. అంతే కాదు. అత్యంత శక్తిమంతమైనది కూడా.ఇందుకు తగిన ఆధారాలు చారిత్రక గ్రంథాలలోనే కాకుండా, వేద వాఙ్మయంలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. భారతదేశ విశిష్టతకు ప్రధాన కారణం అక్కడి ప్రజల జీవనశైలి. ప్రపంచ దేశాల జనాభాను ఆకర్షించే స్థాయిలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లడానికి ఈ జీవనశైలే ఆయువుపట్టు. అద్వితీయమైన, అపురూపమైన ఈ జీవనశైలికి ప్రాణం పోసి, ఆటుపోట్లకు చెదిరిపోకుండా బలోపేతం చేసిన ఘనత అక్కడి ఋషులదే.

ఋషులంటే ఎవరు? 
ప్రాణకోటిగా మనం ప్రస్తావించుకునే 84 లక్షల జీవరాశుల్లో మానవాకారం దాల్చి ఉన్న జీవికి ఒక మనిషిగా జీవించే విధానాన్ని అలవాటు చేసింది ఋషులే. 'మైట్‌ ఈజ్‌ రైట్‌' అనుకునే మృగ సమూహంతో మమేకమై జీవనం సాగిస్తున్న రెండుకాళ్ల  మృగాన్ని మనిషిగా మార్చడానికి వేల సంవత్సరాలు కృషి చేసింది ఋషులే. దేహధర్మం తప్ప మరొకటి లేదనుకుని, దానికే పరిమితమై కాలం గడుపుతున్న జంతువుల నుంచి వేరుచేసి, మనోధర్మాన్ని గుర్తించే మనిషిగా మార్చింది ఋషులే. దేహము-మనసు మాత్రమే కాదు, ఆ రెండిటికీ అతీతమైన ప్రజ్ఞాస్థితి (కాన్షియస్‌నెస్‌) ఉందని ఎరుక పరిచి, దానిని స్వానుభవంలోకి తెచ్చుకునేలా చేసింది ఋషులే. 

ఋషుల నేపథ్యం ఏమిటి?
సృష్టి క్రమాన్ని నిర్దేశించే మౌలిక స్పందనల (బేసిక్‌ ఇన్‌స్టింక్ట్స్‌) చట్రాన్ని విచక్షణతో ఛేదించుకుని, ఆలోచనతో అంతర్ముఖమై, తన ఉనికినే మర్చిపోయి సమస్త విశ్వానికి సేవకుడిగా జీవనం సాగించిన వాడే ఋషి. ఆహారం, భయం, నిద్ర, మైథునం మాత్రమే జీవక్రియలు కాదని నమ్మి, మనిషిగా ఎదగడానికి సిద్ధపడిన మనందరి కోసం ఒక మార్గాన్ని ఏర్పరచిన వారు ఋషులే. ఆ మార్గంలో మనందరం ఋషి స్థితికి చేరడం కోసం వేల సంవత్సరాల తన సాధనా అనుభవాన్ని సంప్రదాయంగా అందించి వెళ్లిన వాడు ఋషి. నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు కృంగిపోకుండా ఎప్పుడూ ఆనందంగా గడపడానికి ఆసరాగా ఉండే ఎన్నెన్నో విధానాలను, ఉపకరణాలను, ఆచరణలను అందుబాటులో ఉంచిన వాడు ఋషి.

ఋషుల ఆశయం ఏమిటి?
ఈ భూమండలంలోని చరాచర జగత్తు మొత్తం వాటి వాటి ధర్మాన్ని అనుసరించి ఆనందంగా ఉండాలన్నదే ఋషుల ఆశయం .. ఆకాంక్ష. కాలాన్ని అనుసరించి తిరిగే ధర్మ చక్రానికి ఆధారమైన ఇరుసులాంటి సత్యమే ఋషి అనుభవం. ఈ అనుభవం పొందడానికి మనిషి గోవును, యజ్ఞాన్ని, అనుష్టానాన్ని ఆశ్రయించాల్సిందేనని ఋషులు ఉద్భోదించారు. అగ్నిక్రియతో ఆరాధించిన గోవు కామధేనువు అవుతుందని, త్యాగబుద్ధితో చేసే యజ్ఞం విశ్వకల్యాణ కారకమవుతుందని, శరణాగతితో చేసే అనుష్టానం ధర్మాచరణకు అంకురమవుతుందని వివరించారు. ఈ మూడు అంశాలను త్రికరణ శుద్ధిగా నిర్వహించే విధానమే ఋషిమార్గమని చెప్పారు. అలాంటి ఋషిమార్గంలో నడిచే నాగరిక సమాజమే సుఖసంతోషాలకు చిరునామా అని దీవించారు.

ఫలితాన్ని ఏది నిర్ణయిస్తుంది?

మనిషి స్వతహాగా రెండిటి కోసం కదులుతూ ఉంటాడు. ఒకటి అవసరం తీరడానికి, రెండు మోజు తీర్చుకోవడానికి. ఇలా అవసరం, మోజు మినహా ఇంకేమంత ప్రధానమైన అంశాలు ఏ మనిషి జీవితంలోనూ ఉండవు. అవసరం ఎంత సుఖంగా తీరింది, మోజును ఎంత గొప్ప తీర్చుకున్నాం అనేవే ఆయా మనుషుల హోదాలను నిర్ణయిస్తున్నాయి. ఈ హోదాల పునాదుల మీదే అన్ని దేశాల మనసుషులు వర్గాలుగా విడిపోయారు. ఈ హోదాలే సహ జీవనంలో కలహాల చిచ్చుకు కారణం 
అవుతున్నాయి.

చేతని అనుసరించే ఫలితం ఉంటుంది. ఇది గణితమంత కచ్చితం. కష్టపడినా ఫలితం లేకపోయింది అంటూ కొందరు వాపోతుంటారు కానీ అది నిజం కాదు. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహాదేవ! ఇది నిజం. పనికి ఆబ్లిగేషన్లు, సెంటిమెంట్లు ఉండవు. మైలు దూరం వెళ్లాలంటే పిల్లవాడికైనా, ముసలివారికైనా, అంగవికలురకైనా అదే దూరం. వారి వారి సామర్ధ్యాన్ని బట్టి కష్టపడి ఆ దూరం దాటాలి. వాడెవడో పది అంగల్లో అక్కడికి వెళ్లాడు నేను ఇరవై అంగలు వేసినా వెళ్లలేకపోయాను అంటే లాభంలేదు. పోన్లే పాపం అని జాలిపడి దూరం తగ్గదు.

చేతకి ఒక పద్ధతి ఉంటుంది. పనికి ఒక విధానం ఉంటుంది. మనిషిని బట్టి అది మారదు, దాని కోసం మనిషి మారాలి. ఈ మార్పు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. దాన్ని అసమానత్వం అంటే కుదరదు. ఉపాధ్యాయుడి బోధ ఒకటే అయినా, విద్యార్థుల అవగాహనలో తేడాలుంటాయి. బోధనా స్థాయికి అవగాహన పెంచుకోవడం విద్యార్ధుల బాధ్యత. ఇది నిర్వివాదాంశం. చేతకి అవసరమైన సామర్ధ్యాన్ని పెంచుకోకుండా, ఫలితాన్ని అందుకోవడానికి ప్రయత్నించడం రాక్షసత్వం. సామర్ధ్యానికి అనుగుణమైన చేతను ఎన్నుకుని, దానికి నిర్దేశించిన ఫలితంతో తృప్తి పడడమే మానవత్వం.

మనుషుల్లో కొందరు ధీరులు ఉంటారు. వారు చేతను ఎన్నుకుని దానికి అవసరమైన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి అహర్నిశలూ సాధన చేస్తారు. ఒక పనిలో రాణించాలంటే రోజువారీ జీవితంలో ఎక్కువ సమయాన్ని  ఆ పనికి కేటాయించాలి. అలా సాధకులు తమను కదిలించే అవసరాలనూ, మోజులను పక్కన పెట్టేస్తారు. క్రమంగా వారిలో మోజు నశిస్తుంది. అవసరాలు అత్యంత కనీస స్థాయికి తగ్గిపోతాయి. పనిలో ఉన్న ''వారికి'' పనికిరాని హోదాల భేదాలు ఉండవు. తాము పొందాలనుకున్న ఫలితాన్ని ఇచ్చే చేత ఒక్కటే వారి ఇరవై నాలుగు గంటలనూ ఆక్రమిస్తూ ఉంటుంది.

సగటు మనుషుల్లో అవసరాలు, మోజులు ఎక్కువై వర్గాలు సృష్టిస్తుంటే, పనిలో ఉన్న వారిలో (సాధకుల్లో) అవసరాలు, మోజులు దూరమై సమానత్వం ఏర్పడుతోంది. దీనిని అనుభవం చేసుకున్న ఋషులు, ప్రతి మనిషి .. పనిలో నిమగ్నమయ్యే విధంగా జీవనశైలిని రూపుదిద్దారు. ఆ రకంగా జీవించడమే మనిషి పని. ఆ పనికి దూరమైతే ఫలితం రాదు. ఇది నిజం. మనుషులు పని (జీవనశైలి) కి దూరం అవడం వల్లనే అసమానతలు ఏర్పడుతుంటే, మేధావులు మాత్రం అసలు పనిలోనే అసమానతలు ఉన్నాయని ఏకంగా పనినే పాతర పెడుతున్నారు.

చేస్తే ఫలితం వస్తుంది. అంటే దానర్ధం ఫలితం వచ్చే వరకూ చెయ్యమని. పనికి ఫలితానికి మధ్యలో సొంత ఆలోచన వచ్చిందంటే ఓడిపోయినట్టే. అందుకే గీత అందరినీ చెయ్యమనే చెప్పింది. ఎవరెవరు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వేదాలు చెప్పాయి. ఉపనిషత్తులు ఎందుకు చెయ్యాలో చెప్పాయి. శాస్త్రాలు - మతాల సారాన్ని విమర్శించడం అంటే చేతకు దూరమవడం, అవసరాల్లో కూరుకుపోవడం, మోజుల్లో చిక్కుకుపోవడం.

మూడు పొరలు - ముచ్చట్లు

స్థూలం, సూక్ష్మం, కారణం అనే మూడు పొరలు ఉన్నట్టే, మనిషికి దేహం, మనసు, మనసుకు అవతల ఉంటాయి. దేహం బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌ ప్రకారం నడుచు కుంటుంది. దానికి వేరే ఆప్షన్‌ లేదు.  ఆహారం, భయం, నిద్ర, మైథునాలతో విసుగెత్తిన వారు మాత్రమే ‘ఇంకేం లేదా’ అని మనసులోకి తొంగి చూస్తారు.

అయితే వారి దృష్టి .. పదార్ధాలకు, పరిసరాలకు, పరిస్థితులకు మించి ఉండక పోవడంతో గోడకి తగిలిన బంతి వెనక్కొచ్చినట్టు .. బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌ తోనే "తెలివి" గా జీవిస్తుంటారు.  నిత్యమైన శాశ్వతమైన అనుభవాన్ని మిగల్చలేని ఈ దేహాన్ని, మనసుని దాటితే ఏమవుతుంది? ఈ ప్రశ్నే మనిషిని ఋషిగా మార్చింది.

అందరూ క్రమంగా శారీరక, మానసిక జీవితాలతో విసిగి వేసారిపోతారనే సత్యం తెలిసి ఋషి మనల్ని రెండు పనులు చెయ్యమన్నాడు. ఒకటి ఋషి అయ్యే  ప్రయత్నం (తపస్సు) చేయడం, రెండు అలాంటి ప్రయత్నం చేసే వారిని పోషించడం. ఈ రెండు పనులూ ఆచరించే వారికి అప్రమేయమైన (శారీరక, మానసిక సంబంధం లేని) ఆనందం ఆనుభవమవుతుంది.

చేయించే సమస్తం భగవంతుడు అనేది సత్యం. ఆ సత్యం అనుభవంగా తెలియడమే జన్మ అదృష్టం. 

తపస్సు చేసే అవకాశం అందరికీ రాదు కానీ తపస్సుకు అండగా నిలిచే అవకాశం అందరికీ ఉంటుంది. మనసు గ్రహించలేని ఒక చేతకు మనసారా చేయూతనివ్వానిపించడం ఋషుల అనుగ్రహ ఫలమే. దీని వల్ల తెలిసీ తెలియక చేసిన అనేక జన్మ పాపాలు ప్రక్షాళనమవుతాయి. నిర్మోహమైన చేత ఒక్కటే గురుకృపను కటాక్షిస్తుంది.

మనసుకు ఉన్న పీకులాటే మనలోని పర్వతమంత మోహానికి గుర్తు. అందుకే కృష్ణుడు ‘కర్మణ్యేవాధికరస్తే ..’ అన్నాడు. చేతను దైవానికి సంధానం చేసి మనసుకు దూరం చేయడమే (చేత) సేవ. భగవత్సేవలో మనసుకు చిన్న కోరికైనా ఉండచ్చేమో గానీ, తాపసులకు మనసుతో (కోరి) చేయగల పని అంటూ ఏదీ సృష్టిలో లేదు. అందుకే ఋషి ఋణం తీర్చుకోవడమే అత్యంత దుర్లభమైనది. అలాంటి అవకాశాన్ని ‘చేతనైనంత మేర చేయగలిగింది చేస్తా’నని అందిపుచ్చుకోవడానికి జన్మ సుకృతం ఉండాలి.

ఆదిశంకరులు - అద్వైతం - అవబోధ

ఆది శంకరులు ప్రతిపాదించిన అద్వైతం, ఒలిచిపెట్టిన అరటిపండులా ఉండదు. ఆ విషయం ఆ మహానుభావుడికి కూడా తెలుసు.  అద్వైతం అర్ధం అవ్వాలంటే జీవుడికి పూర్ణ వైరాగ్య స్థితి ఉండాలి. ఈ వైరాగ్యం అనేది అంత సుభంగా ఒంటబట్టదు. అందుకు కారణం  కోరికలే.

కర్మ అధీనంలో ఉన్న మనిషికి కోరికలు సహజం. అపుడు వైరాగ్యం రాదు. అద్వైతం తెలియదు. ఇలా నూటికి తొంభై తొమ్మిది మందికి కోరికలే ఉన్నపుడు .. అద్వైత సిద్ధిపై ఆసక్తి కలవారు ఏమి చెయ్యాలి అని శంకర భగవత్పాదులు కలవర పడ్డారు. కోరిక (కర్మ) ఉన్నవాడు అద్వైతం జోలికి వెళ్లడు, వెళ్లినా నిలబడలేడు. కర్మలో ఉండగా (కోరిక తీరి) అద్వైతం జోలికి వెళ్లడం సంభవించదు. అద్వైతానికి మూలమైన యోగశక్తి .. జీవుడి కర్మలోకి వస్తే తప్ప కోరిక తీరే అవకాశం లేనప్పుడు,  పరిష్కారం ఏమిటా అని శంకరులు చింతించారు. జీవుల శ్రేయస్సు కోసం పరితపించారు.  

కాబట్టే .. ఆయన ద్వారా అఖండమైన ఆత్మశక్తి .. ‘ఆరాధన’ రూపంలో ఆవిష్కృతమైంది. జీవుడి కర్మస్థితిలోకి యోగశక్తిని ప్రవహింప జేయగల  క్రియా విధానమే ఆరాధన.  భగవంతుడనే దృష్టితో ఆరాధనను క్రమబద్ధంగా చేస్తే ..  యోగశక్తి, అంచెలంచలుగా జీవుని కర్మలోకి దిగివస్తుంది. కర్మలోకి చేరిన యోగశక్తి ద్వారా మాత్రమే కోరికలు తీరిన జీవుడు కర్మబంధాలకు దూరమవుతాడు. అలా క్రమంగా వైరాగ్య భావన బలపడి ఆ జీవుడు అద్వైత సాధన వైపు మరలుతాడు. ఇదీ శంకరాచార్యులు ప్రతిపాదించిన అనుభవ సారాంశం. ఈ సారాంశ స్వరూపమైన ఆరాధనలో ఏమున్నదీ అంటే .. బలోపేతమైన బుద్ధిని యోగమార్గం దిశగా నడిపించగల క్రియా విధానమున్నది.  అంటే శంకరులు పేర్కొన్న ఆరాధనా క్రమాన్ని అనుష్టించాలంటే ముందుగా బుద్ధి బలోపేతం అయి ఉండాలి.  

అందుకే ఆయన బుద్ధిని ప్రచోదనం చేయగల  గాయత్రీ మంత్ర జపాన్ని ప్రతి ఒక్కరికి నిర్దేశించారు. అంటే ఆదిశంకరులు అనుభవించిన    అద్వైతాన్ని  సిద్ధింప జేసుకోవాంటే జీవుడు .. ముందుగా గాయత్రీ మంత్ర జపంతో బుద్ధిని బలోపేతం చేసుకుని,  అలా బలపడిన బుద్ధిని యోగమార్గం వైపు నడిపించగల భగవదారాధనా క్రమాన్ని అనుష్టించి, తద్వారా కర్మబంధములై ఉన్న కోరికల నుంచి యోగబంతో విడివడి, వైరాగ్యంతో జీవనం సాగించి అద్వైతాన్ని అనుభవైకవేద్యం చేసుకోవాలి.  

ఇక్కడ రెండు స్పష్టమైన సూత్రాలున్నాయి. ఒకటి. (కర్మ ఉండగా) కోరిక ఉండగా (అద్వైత) సాధన సాగదు. రెండవది. మనసు వైరాగ్య స్థితికి చేరకుండా ఆత్మజ్ఞానం రాదు. కొన్ని సందర్భాల్లో జీవుడు పుట్టుకతోనే అద్భుతమైన బుద్ధిబం కలిగి వైరాగ్యస్థితి పొంది ఆత్మజ్ఞానంతో యోగి కావచ్చు. అలా పుట్టని వారు గాయత్రీ మంత్ర జపంతో బుద్ధి బలం పెంచుకుంటే, ఆ బుద్ధి .. ఆరాధనా బలం వల్ల యోగమార్గం పట్టి,  వైరాగ్యాన్ని మనసుకి పట్టించి ... జీవుడిని, ఆత్మస్థితి వైపు కదిలిస్తుంది. ఇలా కోరిక (కర్మ), గాయత్రీ మంత్ర జపం, బుద్ధి బలం, భగవదారాధన, కోరికపై వైమనస్యం, క్రమేణా వైరాగ్యం, యోగసాధన, ఆత్మజ్ఞానం, అద్వైత స్థితి అన్న అంశాలతో జగద్గురువు ఆదిశంకరులు ఈ జగత్తుకి ఆధ్యాత్మిక భిక్ష పెట్టారు. 

ఎప్పుడైతే జీవులు గాయత్రీ మంత్ర జపానికి దూరమయ్యారో ఆనాటి నుంచే కోరికల పరంపరలో చిక్కుకుపోయారు. కోరికల సాంద్రత నుంచి బయటపడాలంటే గాయత్రీ మంత్ర జపం తప్ప జీవుడికి మరొక మార్గం లేదు. కర్మతో వచ్చిన మనసు తోటి, దాని బలం తోటి ఏది చేసినా .. ఎవరు చేసినా .. అది బుద్ధి బలాన్ని పెంచలేదు. తెలియని బుద్ధి కంటే తెలిసిన మనసు గొప్పదనే భావన బలపడిననాటి నుంచి, ఆ మానసిక భావనలోనే భగవదారాధన చేయడం అలవాటు పడిన నాటి నుంచి,  ఆధ్యాత్మికం మొత్తం ఆత్మజ్ఞానానికి దూరమైంది.  ఇవాళ్టికీ పరిస్థితి మారలేదు.  

కొన్ని మంచి మాటలు

కోరిక తీరాలంటే ప్రయత్నించాలి.

ప్రయత్నించాలంటే విధానం తెలియాలి.

తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి.

విధాన ఆచరణకు మనోబలం ఉండాలి.

అది లేనపుడు ఆసరా తీసుకోవాలి.

అందుకు అన్నీ వదులుకోవాలి.

మనం మరొకరి కోసం అనుకోవాలి.

అలాంటి జీవుడే .. శిష్యుడు.

అతనికి సృష్టి నియమమే గురువు.


విద్య విశ్వ శ్రేయస్సు కోసం.

విద్య అంటే యజ్ఞ విద్య.

'విద్యావంతుడు' అంటే ఋషి.


ఏకత్వ లక్షణం ఉన్నదే శాస్త్రం


ఆకలి ఉన్నవాడు

అన్నాన్ని వెతుక్కున్నట్టు

ఆర్తి ఉన్నవాడు

దైవాన్ని వెతుక్కుంటాడు.


జీవభావన ఉన్నవాడికి లింగ బేధం ఉండదు

లింగ భేదం ఉన్నవాడికి జీవ భావన రాదు.


శరీరాన్ని ఉపాధిగా చేసుకునే కర్మని

అనుభవిస్తూ ఉంటే

జీవుడు మోక్షం పొందుతాడు

శ్వాసని ఉపాధిగా చేసుకుని

శబ్దం చేస్తూ ఉంటే

మనసు దివ్యత్వం పొందుతుంది.


శరీర ఆరోగ్యం దైవీ శక్తిని నింపుకునేలాగా,

యోగశక్తిని భరించేలాగా తీర్చిదిద్దుకోవాలి.


తను విజయం సాధించాలి అనుకునే

 బాలుడుఎంత ప్రయత్నం చేసినా 

అవకాశాలు అందిపుచ్చుకునే 

ఆసరా లేనప్పుడు

అతని కోరిక తీరదు.


ఎంతటి ప్రకాశవంతమైన నక్షత్రమైనా

చీకటి లేకపోతే దాని వెలుగు కనబడదు.

అందుకనే మనిషికి ఎదురయ్యే కష్టాలు

అతని జీవన విలువలను ప్రకాశవంతం

చేసేలా ఉంటాయి అందుకే జీవనాన్ని

 తీర్చిదిద్దుకోకపోతే కష్టాలు భరించటం

కష్టంగానే ఉంటుంది.


మనిషి ప్రతిభకు నిదర్శనం

అనేకమంది మనుషుల ప్రశంసలు కాదు.

పక్కవారిని ప్రభావితం చేసి

ప్రయోజకులుగా మార్చగలిగినదే ప్రతిభ.


ఒక స్త్రీ జీవితానికి ప్రమాణం

ఆమె పెంచి పోషించే కుటుంబం,

దానిలో పాదుకున్న విలువలు.

ఒక పురుషుడి జీవితానికి ప్రమాణం

ఒక అనుభవజ్ఞుడి దగ్గర

అతను ఉండే తీరు,

భగవంతుడిని అతను కొలిచే తీరు.

Indian Spiritual Practices

Indian Spiritual Practice (ISP) stands as a unique synthesis of science and religion, transcending the boundaries of both disciplines. Its overarching goal lies in alleviating human suffering and fostering holistic well-being by cultivating positive human values. 

ISP draws upon ancient wisdom, scientific principles, and practical techniques to create a comprehensive framework for personal and collective transformation. It recognizes the interconnectedness of mind, body, and spirit, and promotes practices such as rituals,  meditation, good habits, chanting, and oblations to fire etc. 

ISP's focus on human values, such as empathy, compassion, and non-violence, provides a moral compass for personal and social conduct. By fostering these values, ISP aims to mitigate suffering, promote human flourishing, and create a world where all beings can live with dignity and purpose.

In a world where adversity and uncertainty prevail, it is imperative to anchor oneself in the unwavering principles of good values, a loving family, and a profound connection to God. These pillars shape our character, laying the foundation for a fulfilling and purposeful life. 

The Indian Spiritual Practice (ISP) advocates for a comprehensive approach to personal and societal well-being, emphasizing the transformative power of certain practices. 

Rituals, for instance, foster a deep connection between the physical and spiritual realms, igniting an inner awakening and establishing a sense of order and harmony within ourselves. 

Meditation, on the other hand, empowers us with self-awareness, enabling us to navigate life's complexities with greater clarity and focus. 

By cultivating good habits, we replace toxic thoughts with constructive actions, creating a virtuous cycle that leads to a positive societal impact. 

Chanting positive sounds creates a resonant atmosphere that promotes harmony and well-being within our homes, fostering a sense of belonging and tranquility. 

By embracing these practices, we not only enhance our own lives but also contribute to a more peaceful and harmonious world.

Sunday, 26 April 2026

సాధనే అనుభవానికి పునాది

ఆది శంకరాచార్య ‘భజగోవిందం’ స్తోత్రంలో ఇలా అన్నారు. ‘‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం .... నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి:’’. అంటే మనిషి జీవన్ముక్తుడు అవడానికి సత్సంగత్వం మొదటిమెట్టు. ఒక మొలక పెరిగి వటవృక్షం అవడానికి తొలిదశల్లో రక్షణ ఎంత అవసరమో, సాధకుడు సిద్ధి పొందడానికి సత్సాంగత్యం అంత ఆవశ్యకం. పురాణ ప్రవచనాలు, హరికథలు, నాయనమ్మలు చెప్పే భాగవత రామాయణ కథలు కూడా జీవులను ఉద్ధరించిన సత్సాంగత్యమే. 

తనకు, సంఘానికి, తద్వారా సృష్టికి శ్రేయస్సును అందించడానికి ప్రతి జీవుడూ సాధన చేయాల్సిందే. ‘తనను ఆడించే’ కర్మల నుండి విడివడి, ‘తను నడిపించగల’ జీవ కల్యాణ క్రియలను నిర్వహించే స్థితికి జీవుడు చేరడానికి  సాధన తప్పనిసరి. ఈ సాధనా మార్గం యోగానుభవాన్ని ఇస్తుంది కాబట్టి ‘యోగమార్గం’ అని, ఇది ఋషిప్రోక్తం కాబట్టి ‘ఋషిమార్గం’ అని విజ్ఞులు బోధిస్తుంటారు. కర్మబంధంలో ఉన్న జీవుడికి సాధనా మార్గం చీకటిమయం. ఆ మార్గంలో నడవాలంటే గురువు అనే వెలుగును ఆశ్రయించాల్సిందే. అలా ఆశ్రయించిన జీవుడే సాధకుడు.

బొత్తిగా తెలియని విషయం తెలుస్తున్నప్పుడు, కాస్త తెలిసిన విషయాన్నితన తెలివితేటలతో రంగరిస్తునప్పుడు సందేహాలు రావడం సహజం. అయితే జీవుల సందేహాలు తర్కానికి దారితీస్తాయి. సాధకుల సందేహాలు మాత్రమే అనుభవానికి పునాది వేస్తాయి. అందుకే సాధకుడు నిరంతరం గురువు సాంగత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అలాంటి సాంగత్య పరిణామాల్ని ఆదిశంకరులు వివరిస్తూ, అదే సాధనకు అవరోధమైన మోహాన్ని తొలగిస్తుందని, తద్వారా నిశ్చలతత్వం వైపునడిపించి సాధకుడిని జీవన్ముక్తుడను చేస్తుందని చెప్పారు

జగత్తు మొత్తం కర్మాధీనమే

భారతదేశం కర్మభూమి. అంటే కర్మలను ఆచరిస్తూనే ఆత్మస్థితికి చేరుకోగల అవకాశాన్ని, సామర్ధ్యాన్ని ఇవ్వగల నేల. జీవుడు ఏ దేశంలో పుట్టినా కర్మలకు లోబడే ఉంటాడు. ఎందుకంటే జన్మకు కారణం కర్మ కాబట్టి.  అలా జన్మకి కారణమైన కర్మల్ని ఆచరిస్తూ ఆత్మస్థితికి చేరడమే జీవిత పరమార్ధం. ఈ పరమార్ధాన్ని సాధించుకోగల అవకాశం కేవలం భారతదేశంలోనే ఉంది.

జన్మతః జీవుడిని చుట్టుకుని ఉండే కర్మలు పుంఖానుపుంఖాలుగా ఉంటాయి. వాటిని లెక్కించడం, మేధస్సుతో అంచనా వేయగలగడం ఎవరికీ సాధ్యం కాదు. ఆత్మస్థితిని చేరుకున్న జీవుడికి మాత్రమే ఈ కర్మపొరలు అర్ధం అవుతాయి. జన్మించే ప్రదేశం మొదలుకొని నివసించే ప్రదేశం, మరణించే ప్రదేశం వరకు, అందచందాలు, ఆకర్షణ, ఇష్టాఇష్టాలు, చేసే వృత్తులు, చూసే దృశ్యాలు, పెంచుకునే జంతువులు, ఇష్టపడే మనుషులు, ధరించే దుస్తులు, పెళ్లి, బ్రహ్మచర్యం, స్నేహితులు, శత్రువులు, అరిషడ్వర్గాల వేగాలు, ఆస్తికత్వం, నాస్తికత్వం, భార్యాభర్తల అన్యోన్యతలు, శాస్త్ర విజ్ఞానం, విద్య అవిద్యలు, సంపద, దరిద్రం, రోగాలు, మరణాల మధ్య వ్యత్యాసాలు, స్థిర చరాస్తుల యోగం, తర్క వితర్కాలు, సంతానం లేకపోవడం, సంతానం వల్ల ఆనందం, వ్యక్తిగత అర్హతలతో సంబంధం లేని సిరిసంపదలు, సిరి ఉన్నా ఆకలితో జీవించడం, అయాచితంగా వచ్చే స్థితిగతులు, అన్నీ ఉన్నా అనుభవించలేనితనం, ఇలా ఎన్నెన్నో.. లెక్కలేనన్ని అంశాలన్నీ కర్మలో భాగమే.

 ఈ జన్మకు కారణమైన కర్మను తెలుసుకుని, దానిని నిబద్ధతతో ఆచరించడమే ప్రతి జీవుడికి ఉన్న పని .. చేయాల్సిన పని. ఇతరమైన పనులన్నీ చివరికి విషాదాన్నే మిగుల్చుతాయని ఋషులు తేల్చి చెప్పారు. ఆలోచనల వేగానికి ప్రభావితమై, తన జన్మకు సంబంధం లేని పనులు (కర్మలు) చేపట్టి బతుకును విషాదాంతం చేసుకోవద్దని వారు సందేశమిచ్చారు. 

ఋషులంటే తమ జన్మకు కారణమైన కర్మను తెలుసుకుని, వాటి పరిధి వరకు మాత్రమే జీవితం గడిచిపోయేలా ఆలోచనలను, చర్యలను క్రమబద్ధీకరించుకుని ఆత్మస్థితికి చేరుకున్నవారు. వారి జీవన విధానాన్ని ఆచరిస్తూ, అంటే ఋషిమార్గంలో జీవనాన్ని గడిపి, బతుకు సార్థకం చేసుకున్న వారే ఋషి సంతతిగా భారతదేశంలో నిలిచిపోయారు. వీరందరూ కర్మాచరణలో సంయమనాన్ని ప్రదర్శించి, తమ జీవితాలను తమ అనుభవాలను ప్రతిపాదిస్తూ, ఆచరణను విపులీకరిస్తూ భూ మండలమంతా విస్తరించారు. 

చెదరని ప్రేమ సాధన, 'ఆరాధన'

ఎవ్వరికైనా సంతానంపై అమితమైన ప్రేమ ఉంటుంది. సృష్టిలో అది సహజం. ఎందుకంటే రక్త సంబంధం అంత బలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇది కూడా చెదిరిపోతూ ఉంటుంది. అది కూడా సహజమే. ఎందుకంటే ప్రేమకున్న పూర్ణ నైజం ఎవ్వరికీ అర్థం కాదు. బాల్యంలో తల్లిదండ్రులపై ఉండే ఆపేక్ష .. ఆ తర్వాత యవ్వనంలో తలెత్తే శృంగార కాంక్ష ముందు పలుచబడుతుంది. ఆ పైనచెదరని ప్రేమ సాధన, 'ఆరాధన' తనకీ సంతానం కలిగాక  ఆ ఆపేక్ష కొంచెం చేదుగా మారుతుంది. దీనికి కారణం మనిషి తన ఉనికిని శరీరంతో ముడిపెట్టు కోవడమే. 

చెదరని ప్రేమను అనుభవించాలనుకున్న సనాతనులు తమ ధ్యాసను శరీరం మీద నుంచి తప్పించి మనసు వైపు మళ్లించారు. అప్పట్నుంచి మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలైంది. అలా శరీర తృష్ణను మనసులో పుఠం పెట్టడంతో అమలిన శృంగారం ఆవిష్కారమైంది. కానీ అత్యధికులకి ఉన్న శారీరక ధ్యాస వల్ల అది అభాసుపాలైంది. దీనికి తోడు (మనసుకు భూమిక శరీరమే కాబట్టి) మానసిక ప్రేమలో కూడా ‘శరీరం’ పాలు ఎక్కువగానే ఉండడాన్ని గ్రహించిన సనాతనులు దిమ్మెరబోయారు. అసలు ప్రేమించకుండా, కాస్తో కూస్తో ప్రేమ ఛాయలు లేకుండా జీవించడం దుర్లభమే అయినా, చెదరని ప్రేమను ఆస్వాదించలేని జీవనం వ్యర్థమని వారు భావించారు. 

శారీరకమైనది, మానసికమైనది కానటువంటి ప్రేమ ఉంటుందా, ఉంటే దాన్ని ఎలా పొందాలి అని అన్వేషణ మొదలు పెట్టారు. ఆ అన్వేషణలో వారు అద్వితీయమైన తాదాత్మ్యకతను స్పర్శించారు. దానికి శరీరం, మనసు ఆధారంగా లేదని గుర్తించారు. దీన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించి బోర్లాపడ్డారు. దానికి దూరం కాలేక, తన సంతానాన్ని దూరం చేసుకోలేక మథనపడ్డారు. 

‘తను’ అనుకున్న శరీరానికి, ‘తను’కు ఆధారమైన మనస్సుకు చిక్కకుండా .. తనలోనే ఉన్న ఆ తన్మయత్వానికి ఏది ఆధారమో తెలుసుకోవడానికి అవస్థ పడ్డారు. గుర్తొస్తున్న ఆ అనుభవానికి బాహ్యంలో ఎలాంటి గుర్తు లేకపోవడాన్ని చూసి విస్మయపడ్డారు. ఆ ఆనందానికి ఎలా అతుక్కుపోవాలో తెలుసుకోలేక పోయారు. చివరికి భౌతికంగానే ఒక ‘గుర్తు’ను తామే పెట్టుకున్నారు. దాన్ని దైవం అన్నారు. దానికి తనకు నచ్చిన రూపాన్ని ఇచ్చారు. అద్భుతమైన భావనలతో అలంకరించారు. అంతరంగంలో ఎప్పటికప్పుడు పొందుతున్న ఆనందాన్ని, ఏరోజుకా రోజు బాహ్యంలో ఉన్న ఆ దైవానికి అద్దుతూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 

‘నా’ అనుకున్న ప్రతిదానిపై కలుగుతున్న ప్రేమను ఆ (దైవ) స్వరూపానికి ఆపాదిస్తూ, అన్వయిస్తూ.. అలౌకిక స్థాయికి చేరుకున్నారు. క్రమంగా ‘తన’ చుట్టూ ఉన్న జీవితాన్ని, ‘దైవం’లో ప్రతిబింబించేలా మలుచుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ తానే దైవ స్వరూపంగా భాసిస్తున్న వైనాన్ని గమనించి తబ్బిబ్బులయ్యారు. అయితే భౌతికంగా ఉన్న దైవ స్వరూపానికి భౌతికమైన కారణాన్ని వివరించలేక వదిలేశారు. అంతరంగంలోని ఆనందానికి బాహ్యం నుంచి లంగరు వేసే ఈ క్రియా విధానానికి ఆరాధన అని పేరు పెట్టుకున్నారు.

ఈ ఆరాధన వల్లనే దైవం అని, ప్రాణి అని, బంధమని, భేదమని వేధించే ద్వైతం కరిగి పోతున్న వైనం అనుభవమవుతుంది. వారే అసలైన భగవదారాధకులు. వారే ‘దేవుడు ప్రత్యేకంగా లేడని, విశ్వమంతా నారాయణుడు నిండి ఉన్నాడని’ అనగలవారు. అందుకే చిన్ననాటి నుంచి ప్రేమకు దైవాన్ని ఆధారంగా చేసుకొని, వాడు కూడా తాను ప్రేమించే పిల్లలలో ఒకడని జీవనం సాగిస్తే, అదే ఆరాధనగా మారుతుంది. అదే మనలో చెదరని ప్రేమను నింపుతుంది.

Friday, 24 April 2026

ప్రాణశక్తిని పెంచేదే ఆరోగ్యం

ఇవాళ అందరికీ ఆరోగ్యం మీదకి దృష్టి మళ్లింది. అల్లోపతీ, హోమియోపతీ, ఆ తీ, ఈ తీల్లాంటివి దాటుకుని ప్రత్యామ్నాయ వైద్య విధానాలంటే ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు నడవమంటే నవ్విపోయే వారు, ఇప్పుడు నడక నాలుగింతల మేలు అంటున్నారు. ఆరోగ్యంపై దృష్టి అభినందనీయమే అయినా,  ముందుగా ఆరోగ్యం అంటే ఏమిటో అందరూ తెలుసుకోవాలి. ఆడవాళ్లు మెరుపు తీగల్లా, మగవాళ్లు ఆజానుబాహువుల్లా ఉండడమే ఆరోగ్యం కాదు. సౌందర్యం కోసం ఆరోగ్యం కోరుకునేవారు ఏదో ఒక రోజు తలబాదుకోక తప్పదు. ఎందుకంటే ఆరోగ్యం పేరుతో శరీరాన్ని మెలితిప్పడం ప్రకృతి విరుద్ధం. 

అసలు శరీరం అంటే ఏమిటి? ముందు ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. శరీరం అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాల సమ్మిశ్రమం. అవి ఏయే పాళ్లలో ఉంటే.. దాని ప్రకారం శరీర ఆకృతి ఉంటుంది. అంటే శరీరాకృతికి, పంచభూతాల మిశ్రమమే కారణం. ఉదాహరణకు ‘అగ్ని’ పాలు కొంచెం ఎక్కువగా ఉన్న శరీరాకృతి కంటిని ఆకర్షిస్తుంది. అలాగే ఆకర్షణ లేకపోయినా అవయవాలు అమరినట్టు ఉండే రూపులో భూమి తత్వం ఎక్కువ అని తెలుసుకోవాలి. ఇలా ఒక్కో ఎలిమెంట్‌ ప్రభావం వల్ల శరీరంలో ఒక్కో మార్పు లేదా కూర్పు ఉంటుంది. 

ఈ ఐదు ఎలిమెంట్స్‌ శాతాలు (పాళ్లు) ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా, జిమ్‌లో శరీరాన్ని చితక్కొడితే ఆ ఎలిమెంట్స్‌కి ఉన్న బ్యాలెన్స్‌ తప్పిపోతుంది. రోగగ్రస్తమవుతుంది. ఒక జీవికి ఒక రకమైన శరీరం ఏర్పడడానికి ఏమిటి కారణం అనేది తెలియాలి. ఒకబ్బాయి లావుగా ఉంటాడు కానీ బలం ఉండదు. ఒకడు సన్నగా ఉన్నా బలవంతుడుగా ఉంటాడు. అసలు సన్నగా, లావుగా, పొడుగ్గా, పొట్టిగా ఎందుకుంటారు. ఈ శరీరాన్ని మనం అనుకున్నట్లు ఉంచుకోగలమా? అసలు అలా ఉంచుకోవాలా? వైద్యంతో అసలు శరీరానికి రోగం రాకుండా చేయగలమా? ఏ మనిషీ మరొకరిలా ఉండకపోవడానికి కారణం ఏమిటి? అసలు రోగం ఎందుకు వస్తుంది? 
ఆలోచిస్తే లెక్కలేనన్ని ప్రశ్నలు. అన్నిటికీ సైన్స్‌ సమాధానం చెబుతుందని ఎదురుచూసే వారు తమ జీవితకాలంలో అసలైన ఆరోగ్యాన్ని అనుభవించలేరు. శరీరం గాలి, నీరు, ఆహారం ద్వారా పోషకాలను స్వీకరించి, ఎదుగుతుంది. ఇది ప్రాథమిక విషయం. అయితే ఈ స్వీకరణలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ఎందుకని? సైన్స్‌ ఎన్ని కబుర్లు చెప్పినా ఆ అలవాట్లను మానిపించి, కొత్త అలవాట్లను చేయించలేదు. కానీ ఆధ్యాత్మికానికి అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికం ఒక్కటే శరీరాన్ని నూటికి నూరు శాతం ఆకళింపు చేసుకున్న శాస్త్రం. 

ఒక శరీరంలో ఉన్న ప్రాణశక్తి పరిమాణం వల్ల ఐదు ఎలిమెంట్స్‌ ఆయా శాతాల్లో మిశ్రమంగా ఏర్పడుతుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే గర్భంలోకి ముందుగా ప్రాణశక్తి చేరుకుని, తన సామర్థ్యం మేరకు ఐదు ఎలిమెంట్స్‌ సారాన్ని గ్రహించి, దాని ప్రకారం శరీరాన్ని ఏర్పరచుకుంటుంది. ఇది సైన్స్‌కి అర్థం కాదు. అందుకనే ఋషులు శరీరాన్ని పక్కనబెట్టి, దాని ఆవిర్భావానికి మూల కారణమైన ప్రాణశక్తిని పట్టుకున్నారు. ఆ ప్రాణశక్తి పరిమాణాన్ని మార్చడం ద్వారా శరీరాకృతిని మార్చే వారు. ఒక్కమాటలో చెప్పాలంటే శరీర ఆరోగ్యం ప్రాణశక్తి వికాసానికే. పరులను ఆకర్షించడానికి కాదు.

Wednesday, 22 April 2026

మనం చేసే తప్పులు

మనం చేసే అన్ని తప్పులు (పాపాలు) మూడింటి‌తోనే చేస్తాం !

మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు. కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం ! ఈ విషయంలో మన భారతీయ సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది.

మనంచేసే అన్ని తప్పులు (పాపాలు) మూడింటి‌తోనే చేస్తాం.

(1) *కాయిక* (శరీర గత) ;

(2) *వాచిక* (మాటతో) ;

(3) *మానసిక* (మనసుతో).

ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం ! ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పారు. ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగా పరీక్షించుకుని మార్పుచెందే సులువైన మార్గం.

*(1) కాయిక (శరీరగత) పాపములు :

(సనాతన ధర్మ శాస్త్ర ఆధారంగా)

*శ్లోకం :*

అదత్తాముపాదానం హింసాచైవా విధానతః, పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం.

*అర్థం :*

అన్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీసంగమం. ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు).

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా.

*శ్లోకము :*

 దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్య పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.

*అర్థము:*

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ఙ్ఞానులను పూజించడం, శరీరమును శుచిగా ఉంచడం, పవిత్రమైన ఆచారములు, డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం, బ్రహ్మచర్యము (తన భార్యతో తప్ప ఇతర స్త్రీలయందు కామ దృష్టి లేకపోవడం), ఇతరులను హింసించకుండా ఉండడం.. ఇవి శారీరిక తపస్సులు.

*(2) వాచిక (మాటతో) పాపములు :*

*శ్లోకము:*

పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః, అసంబద్ధ ప్రలాపశ్చ వాఙ్ఞ్మయంస్యాచ్చతుర్విధం'

*అర్థం :*

కఠినముగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందిస్తూ మాట్లాడడం, వ్యర్థమైన/పనికిమాలిన మాటలాడడం. ఇవి వాక్కుతో చేసే తప్పులు.

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా

*శ్లోకము :*

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్ఞ్మయం తప ఉచ్యతే.

*అర్థము :*

ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం, ఇష్టముగా మరియు మేలుకలిగించే విధంగా మాట్లాడడం, యదార్థము మాట్లాడడం, వేద శాస్త్రములను పఠించడం, పరమేశ్వరుని నామ జపం చేయడం.. ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది.

*(3) మానసిక పాపములు :*

*శ్లోకము :*

పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం, వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం.

*అర్థము :*

ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడుతలపెట్టే ఆలోచన, శరీర అభిమానము.. ఇవి మనసుకి సంబంధించిన పాపములు. ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…

*శ్లోకము :*

మనః ప్రసాదః సౌమ్యత్త్వం మౌనమాత్మ వినిగ్రహ:, భావ సంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే.

*అర్థము :

మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం, శాంత భావం, సదా భగవచ్చింతన చేసే స్వభావం, మనోనిగ్రహం, అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడము.. ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి* అన్నిటిలోకి *మానసిక తపస్సు* చాలా గొప్పది. ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనందరం ఈ నిముషం నుండే అభ్యాసం మొదలుపెడితే ఉత్తమోత్తమం !!

Sunday, 8 March 2026

ఉనికి సత్యం జీవుడు

ఉనికి ఉన్నంతసేపూ సత్యం తెలియదు.

ఉనికిని కోల్పోయి .. జీవుడు ఉండలేడు.


మరి ఉనికీ లేక .. జీవుడూ లేక ..

సత్యాన్ని తెలుసుకునేది ఎవరు,

తెలియబడేది దేనికి?


ఇంతకూ ఉనికి అంటే ఏమిటి .. ఏది?

మనకు తెలుస్తున్న ఉనికేనా ..

సత్యాన్ని తెలుసుకునేది ఇంకేదైనా ఉందా?


ఏదిఏమైనా  తెలుస్తున్న ఉనికికి

సత్యం తెలిసే అవకాశమే లేదు.

ఇంకేదైనా ఉందో లేదో మనకి తెలియదు.


సత్యం అనేది కచ్చితంగా తెలుస్తుందని,

"తెలుస్తున్న" ఉనికి సత్యాన్ని గ్రహించలేదని,

రూఢి అయిన ఈ నేపథ్యంలో ...

మనకి తెలిసిన ఉనికి .. మిథ్య అని తేలినట్టే.


మరి సత్యం తెలిసేది ఎవరికి?

ఉనికికే. కానీ మిథ్యా ఉనికికి మాత్రం కాదు.

సత్యమైన ఉనికికి మాత్రమే.


అంటే సత్యమే అనంతమైన ఉనికి.

జీవుడి నిజమైన ఉనికే .. సత్యం.

Saturday, 28 February 2026

వయసు ప్రకారం 'బాధ్యత'

బాల్యప్రాయం ఏడేళ్ల వరకు ఆటపాటలతో ఉత్సాహంగా ఉండే పిల్లలకు తల్లిదండ్రులే మంచి అలవాట్లు చేయాలి.

తర్వాత కిశోరప్రాయం 14 ఏళ్ల వరకు సొంత భావాలు ఏర్పడే పిల్లల్లో చిన్నప్పటి మంచి అలవాట్లు నిలబడి పోయేలా తల్లిదండ్రులే కృషి చేయాలి.

కౌమారప్రాయం 21 ఏళ్ల వరకు స్వతంత్ర ప్రవృత్తి ఏర్పడే పిల్లల్లో అవే మంచి అలవాట్లు దృఢపడిపోయేలా తల్లిదండ్రులే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

యవ్వనం మొదటి దశలో 41 ఏళ్ల వరకు చిన్నప్పటి మంచి అలవాట్లతో పాటు జీవితానికి అవసరమైన సద్గుణాలను వ్యక్తి స్వయంగా అభ్యాసం చేసి అలవర్చుకోవాలి.

యవ్వనం రెండో దశ 61 ఏళ్ల వరకు అనుభవంతో జీవనాన్ని ప్రశాంతంగా సాగించే అవగాహనను పెంచుకోవాలి.

వార్ధక్య దశ 82 ఏళ్ల వరకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆనందంగా అనుభవిస్తూ శరణాగతి భావనలో కాలాన్ని గడపాలి.

Saturday, 7 February 2026

కర్మ గురించి టూకీగా ..

ప్రతి మనిషి ఆడగానీ మగ గానీ తను ఏ తల్లిదండ్రులకి పుట్టాలి అనేది ముందుగానే నిర్ణయించుకుంటాడు. తల్లి గర్భంలోకి చేరే ముందు జన్మకి కారణమైన కర్మ మొత్తం సాలిడ్ గా ఒక మూటలా ఉంటుంది. కర్మ అంటే ఇంతకుముందు చేసిన పనులకు ప్రతిఫలం అనుభవించడం. అంటే ఒకరకంగా అప్పు తీర్చడం లాంటిది.

పుట్టటానికి ముందు ఉన్న ఆ కర్మ మూటని 100 రూపాయల అప్పు అనుకుందాం. అందులో కాలం ఆ మనిషికి ఆ జన్మలో 40 రూపాయల అప్పు తీర్చుకునే అవకాశం కల్పిస్తుంది అనుకుందాం. అందుకు అనుగుణంగా మనిషి తన తల్లిదండ్రులను ఎంచుకుని జన్మిస్తాడు. అలా ఆ జన్మలో తీర్చుకునే 40 రూపాయల అప్పును ప్రారబ్ద కర్మ అంటారు. మిగిలి ఉన్న 60 రూపాయల అప్పును సంచిత కర్మ అంటారు.

ఈ జన్మలో 40 రూపాయల అప్పును తీర్చుకోవటానికి పుట్టిన ఆ వ్యక్తి ఆ అప్పు తీర్చుకుంటూ.. పరిస్థితుల ప్రభావానికి లోబడి శారీరక నియంత్రణ మానసిక నియమం కోల్పోయి పాపకర్మలు చేస్తే .. కొత్త అప్పు తయారవుతుంది. ఆ కొత్త అప్పునే ఆగామి కర్మ అంటారు. అది ఓ 40 రూపాయలు  తయారయింది అనుకుందాం. అది వచ్చే జన్మలో సంచిత కర్మ 60 రూపాయలతో కలిసి మళ్లీ 100 రూపాయల కర్మమూటగా తయారవుతుంది. అంటే ఈ జన్మ 40 రూపాయల కర్మను తీర్చుకోవడంలో విఫలమైంది అని అర్థం.

అలా కొత్త అప్పు ఏర్పడకుండా పాత అప్పులు సజావుగా తీర్చుకోగలగాలి అంటే ఒక సూత్రం ఉంది. కొత్త అప్పులు పుట్టటానికి కారణమైన ఇంద్రియ వేగాలు శారీరక విశృంఖలతను నియంత్రించగల సత్కర్మలు చేయాలి. సత్కర్మలు చేస్తూ జీవించటం వల్ల కొత్త అప్పులు పుట్టవు. అలా కొత్త అప్పులు పుట్టకుండా జీవించటాన్ని ధర్మ జీవనం అంటారు.

అలా ధర్మ జీవనం సాగిస్తూ అదనంగా ఆధ్యాత్మిక సాధన గనక చేస్తే సంచిత కర్మగా ఉన్న 60 రూపాయల్లో కూడా కొంత అప్పు ఆ సాధన మేరకు తగ్గుతూ ఉంటుంది. అలా జన్మకు కారణమైన సంచిత - ప్రారబ్ధ - ఆగామి కర్మలను అదుపులో వుంచ గల సత్కర్మలను, ఆధ్యాత్మిక సాధనలను తెలుసుకొని చేస్తూ ఉంటే జన్మ అనేది కర్మ నుంచి విడిపోయి ముక్తి కలుగుతుంది.

Friday, 6 February 2026

పిల్లలపై 'ఆహారం' ప్రభావం

తిండి బలం వల్ల శారీరక ఆరోగ్యం, శబ్ద బలం వల్ల మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. ఇది సూత్రం. శాంత స్వభావంతో కూడిన సత్ప్రవర్తన పిల్లలకు అలవాటు అవాలి అంటే వాళ్ళకి శారీరక, మానసిక దృఢత్వం ఉండాలి. అందుకోసం ముందుగా పిల్లలకు ఉత్తమమైన ఆహారపు అలవాట్లు చేయాలి. ఇంటిల్లపాదికీ క్రమశిక్షణతో కూడిన భోజనపు అలవాట్లు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. శారీరక మానసిక ఆరోగ్యం పై ఆహారం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

ఆహారం వల్ల శరీరానికి అవసరమైన శక్తి పుడుతుంది. ఆ శక్తి ఆహారానికి ఉన్న గుణం వల్ల ప్రభావితం అవుతుంది. ఈ గుణాలే ఇంద్రియాల పనితీరును నిర్ణయిస్తాయి. తమోగుణ ప్రధానంగా ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తే నిద్ర బద్ధకం అలసత్వం అలవాటు అవుతాయి. రజోగుణ ప్రధానమైన ఆహారాన్ని స్వీకరిస్తే కోపం, పోటీ తత్వం, అసహనం అలవాటు అవుతాయి. సత్వగుణ ప్రధానమైన ఆహారం వల్ల పిల్లల్లో శాంతం, మాట వినేతనం, పక్కవారితో పంచుకునేతనం అలవాటు అవుతాయి.

ఆహారం వల్లనే మనసు కూడా ఏర్పడుతుంది. అంటే ఆహారంలో ఉన్న స్వభావమే మనసు స్వభావం అవుతుంది. భోజన అలవాటు క్రమశిక్షణతో లేకపోతే మనసు విచక్షణను కోల్పోతుంది. ఆహారంలో పులుపులు, కారాలు ఎక్కువగా ఉంటే దానివల్ల తయారైన మనసు కూడా రజోగుణంతో ఉద్రేకంగా ఉంటుంది. సత్వగుణం ప్రధానంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనసు కూడా సత్వగుణంతో శాంతంగా ఉంటుంది.

అందుకే ఆహారాన్ని పరిమాణంలోనూ ప్రమాణంలోనూ ఉత్తమంగా ఉండేలా చూసుకుని తినాలి. కాల నియమాన్ని కచ్చితంగా పాటించాలి. ఆయా పదార్థాలకు ఉన్న గుణాల ప్రభావం ఏంటో తెలుసుకుని ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆహారాన్ని భుజించేటప్పుడు ఆలోచనలు దైవికంగా ఉంటే సత్ఫలితాలు వస్తాయి. మన పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగాలి అనుకునే వారి కోసం ఇది.

Thursday, 5 February 2026

ప్రపంచం - అహం - ప్రశాంతత

అన్నిటికీ "నేను" ఆధారం. నేను అంటే అహం. నేను అంటే గుర్తు. నేను అనుకోకుండా ఏ మనిషి ఉండలేడు. నేను కి పునాది ఆలోచనలు అభిప్రాయాలు. వాటికి పునాది, మనిషి చుట్టూ జరిగే సన్నివేశాలు సంఘటనలు. అవి ఏర్పడే వేదికనే "ప్రపంచం" అంటారు.

ఈ విధంగా ప్రపంచం "నేను"ను ఆక్రమించి ఉంటుంది. ప్రపంచం ఆక్రమించి ఉన్న నేను నే అహం అంటారు. ఈ అహం వల్లనే మనిషికి సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. సంఘర్షణలేని ప్రశాంతత కావాలి అంటే అహం కరిగిపోవాలి. అంటే ప్రపంచం కల్పించే సన్నివేశాలు సంఘటనలు వల్ల ఏర్పడే ఆలోచనలు అభిప్రాయాలు మనిషి పై ప్రభావం చూపకూడదు.

ప్రపంచం అనే "మూడు అంశాల" ద్వారా అహాన్ని రెచ్చగొట్టే "రెండు పరిణామాలు" ఏర్పడటానికి మూల కారణం ఇష్టా ఇష్టాలు. ఇలా ఒకదాని వల్ల మరొకటి జరగటాన్ని అంటే "పరిణామాల క్రియాశీలత"ను దృష్టిలో ఉంచుకునే నేను నాది అనే భావనల నుంచి దూరం అవ్వాలి, అప్పుడే ప్రశాంతత ఏర్పడుతుంది.

కాలం మారుతూ ఉంటుంది. అంటే కాల లక్షణం మారుతూ ఉంటుంది అని అర్థం. అందుకే కాలానికి అనుగుణంగా అవగాహన మారుతుంది. అవగాహనకి అనుగుణంగా నిర్వచనాలు మారుతూ ఉంటాయి. కానీ సృష్టికి సంబంధించిన పరిణామాల విధానం ఎప్పటికీ మారదు.

Wednesday, 4 February 2026

మూడు - రెండు. That's all.

ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో ఎదురుపడేవి మూడే మూడు అంశాలు. ఒకటి వ్యక్తి, రెండు వస్తువు, మూడు విషయం. ఈ మూడు అంశాలతోటి లేదా ఏదైనా ఒక అంశం తోటి మనిషి వ్యవహరించినప్పుడు జరిగే పరిణామాలు రెండే రెండు. ఒకటి సన్నివేశం రెండు సంఘటన. 

కేవలం మూడు అంశాల కారణంగా సంభవించిన రెండే రెండు పరిణామాల ప్రభావం వల్ల మనిషిలో వందల కొద్దీ ఆలోచనలు, వేలాది అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటికి అనుగుణంగానే మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు.

ఏ మనిషికైనా ప్రాపంచిక జీవితం అంటే ఇదే .. ఇంతే. ఇంకేమీ ఉండదు. ఏ మనిషి తన జీవిత కథ చెప్పుకున్నా సన్నివేశాలు - సంఘటనలు, వాటిపై తనకి కలిగిన ఆలోచనలు - అభిప్రాయాలు తప్ప ఇతర వివరాలు ఉండే అవకాశమే లేదు . 

పైగా అవన్నీ పైన చెప్పుకున్న  వ్యక్తులు వస్తువులు విషయాలతోటి మాత్రమే ముడిపడి ఉంటాయి తప్ప మరొకదానితో సంబంధమే ఉండదు. అందుకే ఏ మనిషి జీవితాన్ని స్కానింగ్ చేసిన ఇదే బ్లూ ప్రింట్ ఉంటుంది. మనుషుల భౌతిక జీవితం మొత్తం పరిధి ఇంతే.

Tuesday, 3 February 2026

అనుభవజ్ఞుల మార్గమే శరణ్యం

మనిషి జీవన వేగం పెరిగింది. పిల్లల్ని పెంచడం మాట అంటుంచుతే తనని తాను సరిదిద్దుకునే సమయం కూడా ఎవరికీ ఉండటం లేదు. పోనీలే గుర్తు చేద్దాం అనుకున్నా, అసలు చెప్పిన మాట వినటమే మానేశారు. అంతెందుకు .. జెన్ జీ, ఆల్ఫా జీ పిల్లలికి అమ్మమ్మలు తాతయ్యలు అంటే ఎవరో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఋషి సంప్రదాయం, దేశ సంస్కృతి కొత్త తరాలకు అందేది ఎలా?

రామాయణ భాగవతాలు విని పెరిగిన పిల్లలు ఇప్పుడు కోటికి ఒకరిద్దరే ఉన్నారు. పురాణ హీరోల స్థానంలోకి సినిమా హీరోలు, కార్టూన్ హీరోలు వచ్చేసారు. జీవితాన్ని సరిదిద్దుకునే సమయం లేని తల్లిదండ్రుల చేతుల్లో, జీవితం అంటే ఏమిటో తెలియకుండా పిల్లలు పెరుగుతున్నారు. ప్రపంచ పోకడని సాకుగా చూపెట్టి జీవన క్రమశిక్షణని గంగలో కలిపేశారు.

గత మూడు దశాబ్దాలుగా spirituality, yoga, meditation పేరుతో వేద విజ్ఞానం మొత్తం వాణిజ్య వస్తువు అయిపోయింది. అభ్యాసంతో అనుభవాన్ని పొందే ఋషి మార్గం మూతబడింది. పఠనం చేసి ప్రవచనాలు చెప్పటం ప్రబలిపోయింది. అనుభవంతో నేర్పించేవారు లేక ఆచార సాంప్రదాయాలకు బూజు పట్టింది. ఫలితంగా ఆధ్యాత్మ ఆచరణ అటకెక్కింది.

ఆహారం తీసుకుంటేనే ఆకలి తీరుతుంది. అనుభవజ్ఞులను అనుసరిస్తేనే జీవితం ఆనందమయం అవుతుంది. ప్రకృతి నియమాలు, జీవన సూత్రాలు ఎప్పటికీ మారవు. ఇప్పటికైనా మేల్కొని జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకుందాం. ఋషి జీవనాన్ని అలవాటు చేసుకుందాం. జీవన విలువలను నేర్చుకుందాం -  నేర్పిద్దాం. 

Monday, 2 February 2026

"ఆధ్యాత్మ" భాష మారాలి

జెన్ జీ, ఆల్ఫా జీ పిల్లలు పెద్దల మాట వినటం మానేశారు. ఆ పిల్లల ఆలోచనల, ప్రవర్తనల ధోరణికి వారి తల్లిదండ్రులు ఇప్పటికే చేతులెత్తేశారు. అసలు విషయం ఏమిటి అంటే పై రెండు తరాలు సృష్టించుకునే ప్రపంచంలో ఆధ్యాత్మికం అపహాస్యం అవుతోంది. ఈ పరిస్థితి మారకపోతే పెద్దయ్యాక వారు జీవితాన్ని ఎలా నెగ్గుకు వస్తారో అనే భయం కలుగుతోంది. 

మా జీవితానికి మీ అనుభవం ఎందుకు అనేటువంటి విశృంఖలత వారిలో బలపడిపోయింది. ఇది సరైన లక్షణం కాదు.  ఎందుకంటే జీవితాన్ని ఎవరు ఎంత ఆధునికం చేసుకున్నా, జీవన నియమాలు మాత్రం ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా మారవు. శాశ్వతమైన అలాంటి జీవన నియమాలను ఆచరణాత్మకంగా సొంతం చేసుకునే విధానానికే "ఆధ్యాత్మికం" అని పేరు.

ఇప్పుడు కాదు 2050 లో పుట్టిన పిల్లలైనా సరే భగవంతుడిని కళ్ళతో చూడలేరు, ఆనందాన్ని అంగట్లో కొనుక్కోలేరు. అది సృష్టి నియమం. అంతే. ఏ మనిషైనా సరే, ఎప్పుడు పుట్టిన సరే ఆనందం యొక్క అనుభూతి లేకుండా, భగవంతుని యొక్క అనుభవం లేకుండా ప్రశాంత జీవనాన్ని సాగించలేడు. ఇది సత్యం.

అందుకే కొత్త తరం పిల్లల పోకడ చూస్తుంటే భయం వేస్తోంది. వారిలో "ఆధ్యాత్మ" బీజాలు నాటటానికి వారి తల్లిదండ్రుల వల్ల కూడా కావడం లేదు. ఈ నేపథ్యంలో పాత తరాలు కొత్త ఆధ్యాత్మ శైలిని సిద్ధం చేసి తీరాలి. కొత్త తరాల భావాలను ఆకర్షించే విధంగా "ఆధ్యాత్మ" భాషను కూడా సరిదిద్దుకోవాలి.

Sunday, 1 February 2026

ప్రమాదంలో Gen Z

పూర్వకాలం మనిషి తన జీవన పరిణామ క్రమంలో పూర్ణ అనుభవాన్ని పొందాడు. అలాంటి అనుభవజ్ఞులను అనుసరించి మరికొందరు పూర్ణులయ్యారు. ఇది తొలిదశ అనే ప్రాచీన కాలం.

కాలక్రమంలో కొందరు మహానుభావులు ఆ అనుభవ సారాన్ని అక్షర స్వరాల్లో పొందుపరిచారు. అలా పొందుపరిచిన సంకలనమే ..  అనేకమంది అనుభవజ్ఞుల జీవన సారమైన .. "వేదం". ఇది మలిదశ అని చెప్పుకోవాల్సిన వేద కాలం. 

తొలి దశలో ఉన్నవారు ప్రాచీన ఋషులు,
మలిదశలో ఉన్నవారు వేద ఋషులు. 
ఈ ఇద్దరి సమగ్ర అనుభవమే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, దర్శనాలు ఇత్యాది గ్రంథాలు. ఈ సమస్త వాఙ్గమయానికి సాక్షి వేద వ్యాసుడు.

ద్వాపర యుగం వరకు ఉన్న వ్యాసునికి కలియుగంలో  ఉత్తరాధికారి ఆది శంకరులు. ఆయన జగద్గురువుగా వేద వాంగ్మయమే పునాదిగా చేసిన ప్రబోధం గత పాతికేళ్లలో మొద్దుబారింది. ఈ కాలంలోనే మత గ్రంథాలపై తర్కం పెరిగి, ఆధ్యాత్మ ఆచరణపై పట్టు తగ్గింది.

దీంతో జెన్ జీ యువత మత గ్రంథాలపై విముఖత పెంచుకుంది. జీవన నియమాలను వివరించే ఆధ్యాత్మికతను మత కార్యక్రమాలు గా భావించి కొట్టి పారేస్తోంది. ఈ నేపథ్యంలో  గ్రంథాలు అంటే "అనుభవం" పొందే మార్గాలు  అని చెప్తూ ఆధ్యాత్మ ఆచరణ వైపు నేటి తరాన్ని నడిపించాలి.