సృష్టిలో ఉన్నవి రెండే. ఒకటి శక్తి .. రెండవది పదార్ధము. వీటిలో శక్తి అగోచరము, అనుభవ దూరము. కాబట్టే పదార్ధమే ఈ సృష్టిలో అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. అన్ని జీవరాశుల్లో మహా తెలివైన మనిషి ఈ పదార్ధాలను తన అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ, ఆ సామర్ధ్యాన్ని తన శక్తిగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ పటాటోపానికి ఆ మనిషి సైన్స్ అని పేరు పెట్టుకున్నాడు. ఇలా సైన్స్ వర్గానికి చెందిన వారంతా మేధావులుగా ఖ్యాతికెక్కారు. అయితే సైన్స్‌కి ఆధారమైన పదార్ధంలో ఉన్నది కూడా శక్తేననీ, ఆ శక్తి చలనంలో ఉన్న మార్పులు చేర్పులే పదార్ధ స్వరూప స్వభావాల్లో ఉన్న తేడాలనీ గమనించిన కొందరు, అసలు శక్తికి ఉన్న లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని అన్వేషణ మొదలుపట్టారు. వారిని తాత్వికులు అన్నారు.
ఒక బుల్లెట్‌ని తీసుకుందాం. దానితో ఒక మనిషిని ఎంత బలంగా కొట్టినా ఏమీ అవదు. అదే బుల్లెట్‌ని రివాల్వర్‌లో పెట్టి వదిలితే మనిషిని చంపేస్తుంది. కాబట్టి బల్లెట్ అనే పదార్ధానికి వేగం అనే శక్తి లేకపోతే నిరుపయోగమే. అంటే పదార్ధంలోకి శక్తిని ప్రవేశపడితేనే ఫలితం ఉంటుంది. ఇది సైంటిఫిక్ థింకింగ్.
మరి శక్తిలోకి పదార్ధాన్ని ప్రవేశపెడితే? ఫలితం ఊహించనంత తీవ్రంగా ఉంటుంది. ఇది తాత్విక థింకింగ్. ఈ తాత్విక థింకింగ్‌ని సైంటిఫిక్‌గా వివరించడం అసాధ్యం. కనపడని శక్తిలోకి కనపడే పదార్థాన్ని ఎలా పెట్టాలి? సమాధానం శోధిస్తూ కదిలిన తాత్వికులు అరణ్యాల్లో తేలారు. పరిసరాలు, పర్యావరణం అనుకూలించడంతో అంతర్ముఖమయ్యారు. శక్తి, పదార్ధాల గుట్టు విప్పే పనిలో విజయం సాధించారు.
పదార్ధ స్థితికి చేరువలో ఉన్న శక్తి శబ్దమేనని, శక్తికి చేరువలో ఉన్న పదార్ధం మనసేనని గుర్తించారు. ఇక మనసుని ఎలాగైనా శక్తిలో పెట్టే పనిలోకి దూకి చావుదెబ్బలు తిన్నారు. చివరికి మనసుని పట్టుకోవడం అసంభవం అని తీర్మానించారు. ఈ యుద్దంలో వారికి మనసు లక్షణాలన్నీ తెలిశాయి. మనసు దేనినైనా ఒడిసిపట్టగలదనీ, తన ఆస్వాదన పూర్తి కాగానే దేనినైనా దూరంగా విసిరి వెయ్యగలదనీ గమనించి .. ఏమీ చెయ్యలేక .. బుద్ధిగా ఓ మూల కూర్చున్నారు.
మనసుని ఏనుగుతో పోల్చవచ్చు. ఏనుగును బంధించాలంటే ముందుగా దానిని కదలకుండా చెయ్యాలి. ఎలా? సరిగ్గా అది పట్టే గుంటలో పడెయ్యాలి. కానీ గుంట ఉన్న సంగతిని ఏనుగు తన తొండంతో పసిగట్టెయ్య గలదు. కానీ ఆ పసిగట్టే పనినుంచి ఏనుగు దృష్టిని మళ్లించే గందరగోళాన్ని సృష్టించి గొయ్యి ఉన్న వైపు మళ్లిస్తే ఆ ఏనుగుని గోతిలో పడెయ్యచ్చు. ఈ భౌతిక సూత్రాన్ని తాత్వికులు మనసుకి వర్తింపజేశారు.
మనసుకి ఓ లక్షణం ఉంది. ఇంద్రియాలు గ్రహించిన ప్రతి దానినీ రుచి చూడనిదే వదిలిపెట్టదు. తను రుచి చూసిన ప్రతి దానినీ దూరంగా విసిరెయ్యక మానదు. ఈ రెండు పనుల సంధికాలంలోనే మనసును శాశ్వతంగా పట్టి వెయ్యాలి. అదీ తాత్వికుల వ్యూహం. పదార్ధాలలో అత్యంత సూక్ష్మమైనదీ, వేగమైనదీ, బలమైనదీ మనసే కాబట్టి ఏ పదార్ధమూ దానిని పట్టలేదు. ఇక శక్తిని ఉపయోగించాలి. కానీ మనసుకి శక్తి అంటే ఏమిటో తెలుసుకునే శక్తే లేదు. కాబట్టి అది శక్తి జోలికి రాలేదు. అందుకే ఇటు శక్తి రూపానికి .. అటు పదార్ధ లక్షణానికి చేరువలో ఉన్న శబ్దాన్ని మథించారు.
శబ్దం అధిభౌతికమే అయినా దానికి వాక్కు, అక్షరం అనే భౌతిక (ఇంద్రియ) స్థితులున్నాయి. ఈ అవకాశాన్ని తాత్వికులు ఊతంగా తీసుకున్నారు. అక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఆ ఉచ్చరించిన దానిని వినడం ప్రారంభించారు. 'వినడం' ఇంద్రియ స్థితి కాబట్టి మనసు దానిని ఆస్వాదించడానికి వచ్చి తీరుతుంది. అలా ఆస్వాదిస్తుండగా .. శబ్దం (శక్తి) తన లక్షణం మేరకు ఆ మనసును తనలో కలిపేసుకుంటుంది. అంటే గుణ భూయిష్టమైన మనసు స్వభావాన్ని మార్చేస్తుంది. విజయవంతమైన ఈ ప్రయత్నమే ఆత్యాత్మికానికి పునాది అయింది.
శబ్దంతోో మనసును పూర్ణంగా శుద్ధి చేసుకున్న తాత్వికులే ఋషులు. మనసును పూర్ణంగా శుద్ధి చేయగల ఋషిప్రోక్తమైన శబ్దాలే మంత్రాలు. మంత్రాక్షరాలను ఉచ్చరిస్తూ, ఆ మంత్రాక్షరాలను వినడమే జపం. శబ్దం పరిపూర్ణంగా మనసును తనలో కలిపేసుకున్నపుడే సమాధి.
No comments:
Post a Comment