Sunday, 26 April 2026

జగత్తు మొత్తం కర్మాధీనమే

భారతదేశం కర్మభూమి. అంటే కర్మలను ఆచరిస్తూనే ఆత్మస్థితికి చేరుకోగల అవకాశాన్ని, సామర్ధ్యాన్ని ఇవ్వగల నేల. జీవుడు ఏ దేశంలో పుట్టినా కర్మలకు లోబడే ఉంటాడు. ఎందుకంటే జన్మకు కారణం కర్మ కాబట్టి.  అలా జన్మకి కారణమైన కర్మల్ని ఆచరిస్తూ ఆత్మస్థితికి చేరడమే జీవిత పరమార్ధం. ఈ పరమార్ధాన్ని సాధించుకోగల అవకాశం కేవలం భారతదేశంలోనే ఉంది.

జన్మతః జీవుడిని చుట్టుకుని ఉండే కర్మలు పుంఖానుపుంఖాలుగా ఉంటాయి. వాటిని లెక్కించడం, మేధస్సుతో అంచనా వేయగలగడం ఎవరికీ సాధ్యం కాదు. ఆత్మస్థితిని చేరుకున్న జీవుడికి మాత్రమే ఈ కర్మపొరలు అర్ధం అవుతాయి. జన్మించే ప్రదేశం మొదలుకొని నివసించే ప్రదేశం, మరణించే ప్రదేశం వరకు, అందచందాలు, ఆకర్షణ, ఇష్టాఇష్టాలు, చేసే వృత్తులు, చూసే దృశ్యాలు, పెంచుకునే జంతువులు, ఇష్టపడే మనుషులు, ధరించే దుస్తులు, పెళ్లి, బ్రహ్మచర్యం, స్నేహితులు, శత్రువులు, అరిషడ్వర్గాల వేగాలు, ఆస్తికత్వం, నాస్తికత్వం, భార్యాభర్తల అన్యోన్యతలు, శాస్త్ర విజ్ఞానం, విద్య అవిద్యలు, సంపద, దరిద్రం, రోగాలు, మరణాల మధ్య వ్యత్యాసాలు, స్థిర చరాస్తుల యోగం, తర్క వితర్కాలు, సంతానం లేకపోవడం, సంతానం వల్ల ఆనందం, వ్యక్తిగత అర్హతలతో సంబంధం లేని సిరిసంపదలు, సిరి ఉన్నా ఆకలితో జీవించడం, అయాచితంగా వచ్చే స్థితిగతులు, అన్నీ ఉన్నా అనుభవించలేనితనం, ఇలా ఎన్నెన్నో.. లెక్కలేనన్ని అంశాలన్నీ కర్మలో భాగమే.

 ఈ జన్మకు కారణమైన కర్మను తెలుసుకుని, దానిని నిబద్ధతతో ఆచరించడమే ప్రతి జీవుడికి ఉన్న పని .. చేయాల్సిన పని. ఇతరమైన పనులన్నీ చివరికి విషాదాన్నే మిగుల్చుతాయని ఋషులు తేల్చి చెప్పారు. ఆలోచనల వేగానికి ప్రభావితమై, తన జన్మకు సంబంధం లేని పనులు (కర్మలు) చేపట్టి బతుకును విషాదాంతం చేసుకోవద్దని వారు సందేశమిచ్చారు. 

ఋషులంటే తమ జన్మకు కారణమైన కర్మను తెలుసుకుని, వాటి పరిధి వరకు మాత్రమే జీవితం గడిచిపోయేలా ఆలోచనలను, చర్యలను క్రమబద్ధీకరించుకుని ఆత్మస్థితికి చేరుకున్నవారు. వారి జీవన విధానాన్ని ఆచరిస్తూ, అంటే ఋషిమార్గంలో జీవనాన్ని గడిపి, బతుకు సార్థకం చేసుకున్న వారే ఋషి సంతతిగా భారతదేశంలో నిలిచిపోయారు. వీరందరూ కర్మాచరణలో సంయమనాన్ని ప్రదర్శించి, తమ జీవితాలను తమ అనుభవాలను ప్రతిపాదిస్తూ, ఆచరణను విపులీకరిస్తూ భూ మండలమంతా విస్తరించారు. 

No comments:

Post a Comment