బుద్ధుడి కథ అందరికీ తెలుసు. వార్ధక్యం, రోగం, మరణం .. అనే అంశాలు అతన్ని కదిలించి వేశాయి. ఈ మూడూ మనిషికి అత్యంత దుఃఖ హేతువులని భావించాడు. ఇవి మనిషిని ఎందుకని పెనవేసుకుని పోయాయి అని చింత పడ్డాడు. ఈ మూడూ జీవులకు ఉండకూడదు అని అనుకున్నాడు. వాటిని పూర్తిగా తొలగించాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించు కున్నాడు. ఈ అంతఃపురం తన చింతనకు అనువైన ప్రదేశం కాదు అనుకున్నాడు. భార్య, పిల్లవాడు, తల్లిదండ్రులు, రాజ్యాధికారమే కాదు అసలు ఈ భోగయుతమైన జీవనాన్నే వదిలి వెళ్లిపోవాలని అతనికి అనిపించింది. ఎందుకని?
చాలామంది స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుకుంటారు. కానీ ఆజన్మాంతం తన జీవితం మరొక దానికి బందీ అని తెలుసుకోరు. విజ్ఞులు సూచించిన చింతనను ఒక్కసారి స్వీకరిస్తే తామెంత బంధనంలో ఉన్నామో ఎవరికైనా తెలుస్తుంది. బుద్ధుడికి ఇల్లు వదిలి వెళ్లాలని ఎందుకు అనిపించింది? ఎన్ని కారణాలు చెప్పినా .. ఆ విధంగానే .. అనిపించడానికి కారణం ఏమిటో ఎవ్వరూ చెప్పలేరు. బుద్ధుడు కూడా. ఈ అనిపించడం అనేది దేనివల్ల కలుగుతుందో తెలుసుకోవడం ఎవ్వరి వల్లా కాదు.
ఒకడు మామూలుగా తన రోజువారీ పనుల్లో తలమునకలుగా ఉన్నపుడు సడన్‌గా ఓ వ్యక్తిని ఫలానప్ఫుడు కలవాలని అనుకుంటాడు. ఆ టైమ్‌కి ఆ వ్యక్తిని కలుస్తాడు. ఆ తర్వాత మొత్తానికి ఎవో కొన్ని సంఘటనలు జరుగుతాయి. సరే! అసలు ఆ వ్యక్తిని కలవాలి అని ఈ మనిషికి ఎందుకు అనిపించింది. అనిపించకపోతే కలిసేవాడు కాదుగా .. ఆ సంఘటనలు జరిగేవి కాదుగా!! కానీ ఆ ..అనిపించడం .. నుంచి ఆ మనిషి కాదుకదా, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకని?
నాకు అది ఇష్టం అంటారు, ఆ అమ్మాయినో, అబ్బాయినో ప్రేమించాను అంటారు, నాకు అది పడదు అంటారు, నేను పెద్దయ్యాక డాక్టరవుతా, యాక్టరవుతా అంటారు .. అలా అనాలని వారికి ఎందుకు అనిపిస్తుంది? నా గురించి నాకు తెలుసు అంటారు కానీ ఫలానాది నీకు ఎందుకు ఇష్టం అంటే ఒక్కరూ చెప్పలేరు? నీకే అనిపించిన దానికి ఏది కారణమో నీకు తెలియనప్పుడు .. ఇతరుల ఆలోచనలకి, చేతలకి కారణమేమిటో నీకు ఎలా తెలుస్తుంది? అందుకే రమణ మహర్షి అంటారు .. నువ్వెవరు! తెలుసుకో .. అని.
తన నుంచి కదులుతున్న ఆలోచనలకి, చేతలకి ఏది కారణమో తెలియనప్పుడు, వాటికి కర్తను నేను అని అనుకోవడం అమాయకత్వం. నా జీవితానికి ఇదీ కారణం అని తెలియని వాడికి ఆ జీవితం మీద స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎలా వస్తాయి, ఎవరిస్తారు? చూసిన వస్తువు మీద, విన్న విషయం మీద, తెలిసిన స్పర్శ మీద, కలిగిన రుచి మీద .. ఇలా ప్రతిదాని మీద ఏ ఇద్దరికీ ఒకే భావన కలగనప్పుడు .. తన భావనా అనుభవంతో మరొకడి మనోగతాన్ని నిలదీయడం, తన భావజాలానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండాలనుకోవడం .. కేవలం తెలివితేటలతో పరస్పరం మోసం చేసుకోవడమే.
మనిషి జీవితాన్ని నిర్దేశించే ''అనిపించడం'' వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఋషులు తెలుసుకున్నారు. మనలాంటి వాళ్లం ఇంకా తెలుసుకోలేదు. అందుకే మనలో కొందరు తెలివిగా ''తెలియనిది ఏదో'' అని వాడుతుంటారు. ఋషులు తెలివిగా మాట్లాడరు, అనుభవంతో మాట్లాడతారు కాబట్టి ఆ తెలియనిదే కర్మ అన్నారు. అది ఏమిటో తెలియకపోతే వచ్చే నష్టం లేదన్నారు. అది ఉందో లేదో అని వాదులాడుకుంటే కలిగే ప్రయోజనం శూన్యం అన్నారు. అది మనల్ని సుఖపెట్టినా - కష్టపెట్టినా పట్టించుకోకపోతే ఆనందం వస్తుందన్నారు. అలా ఆనందంగా ఉండాలంటే "ఇలా జీవిస్తే చాలు" అని మార్గం చెప్పారు.
No comments:
Post a Comment