ప్రత్యక్ష ప్రయత్నం వల్ల పరోక్షమైన ఒక పరిణామం సంభవిస్తుంది. అంతే తప్ప పరోక్షమైన పరిణామాన్ని ప్రత్యక్షంగా సంభవింపజేయగలగడం ఎవరి వల్లా కాదు. అందుకే జయాపజయాలు దైవాధీనాలు అన్నారు.
ఎవరూ ఫలితాన్ని నిర్దేశించలేరు. కాబట్టే గీతలో శ్రీకృష్ణుడు ‘కర్మణ్యే వాధికారస్తే..’ అని స్పష్టంగా చెప్పాడు. ప్రయత్నంతో పరిశ్రమించడమే మానవుడి విద్యుక్తధర్మం. ఫలితం అనేది ఆ పరిశ్రమలో ఉన్న "ప్రకృతి నియమానికి" లోబడి ఉంటుంది. ఆ ఫలితం మన పరిశ్రమలోని లోటుపాట్లను, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అంతే తప్ప అది భగవంతుని అభిప్రాయం కాదు.
కష్టపడితే ఫలితం వస్తుంది అనేటువంటి మాట మనిషిని ఉత్తేజం చేయడానికి తప్ప సత్యాన్ని ప్రకటించడం కాదు. నేను ఎంత కష్టపడినా ఫలితం సరిగ్గా రాలేదు అనేటువంటి ఆవేదన సరైనటువంటి ఆలోచన కాదు. మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కనిపించే వ్యక్తులు గానీ, కనపడని దేవుడు కానీ కారణం కాదు.
ఇది తెలుసుకోకుండా ఇదేం దేవుడు, మంచికి విలువ లేదు అంటూ ఆలోచిస్తే అహంకారం, నైరాశ్యం మనల్ని చుట్టుకుంటాయి. ఈ విపరీతాల (extremities) నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి శరణాగతి ఒక్కటే మార్గమని మహా ఋషులు ప్రేమగా చెప్పారు. మనం చేసిన పనికి ఫలితం అనేది ప్రాకృతిక నియమాలకు ప్రాపంచిక పరిమితులకు లోబడి ఉంటుంది అని తెలుసుకొని మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి.
No comments:
Post a Comment