Wednesday, 13 May 2026

శరీరాన్ని సార్ధకం చేసుకోవాలి

మహాయుగాలు మన్వంతరాలు గడిచినా కూడా మనిషి శరీర నిర్మాణం, దాని సామర్థ్యం ఇప్పటికీ మారలేదు. ఇక ఎప్పటికీ మారదు. అట్లాంటి శరీరాన్ని గత మూడు తరాలుగా నిర్లక్ష్యం చేస్తూ మన పతనాన్ని మనమే నిర్మించుకున్నాం. దీనికి ఇక మంగళం పాడాల్సిన సమయం వచ్చింది.

మనిషి శరీరం ఒక మహోజ్వలమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని భారతీయ సనాతనులు అద్భుతంగా వినియోగించుకుని మహా ఋషులుగా మారారు. అంటే మనిషిని మహా ఋషిగా మార్చగలిగిన ప్రధానమైన ఉపాధి శరీరమే అని అర్థం చేసుకోవాలి. శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలి తద్వారా ఎలా ఉద్దతిని పొందాలి అనే విషయాన్ని మూలాల నుంచి తెలుసుకుంటేనే మనం విజయం సాధించగలం. ఆ విధంగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది.

ఈ దిశగా మనం చేయాల్సిన పని ఒక్కటే. శరీరం అనేది కేవలం భౌతిక ఆనందం కోసం మాత్రమే కాదని, శరీరాన్ని ఇంద్రియాల లోలత్వంలో ముంచకూడదని, భౌతిక సుఖాల కోసమే ఈ శరీరం ఉందని భావించే దౌర్భాగ్యం నుంచి మనం బయటపడాలి. పరిస్థితుల వల్ల మనకి ఎదురయ్యే కష్టనష్టాలకు మనసు కల్లోలం అవకుండా మౌనంగా ప్రశాంతంగా ఉండగల అద్భుత స్థితిని మనం పొందాలంటే దానికి ప్రధానమైన సాధనం శరీరమే అని గుర్తించాలి.

శరీరం యొక్క నిర్మాణం, దానిలోని అవయవాల మధ్య ఉన్న సమన్వయం, ఆ సమన్వయం ద్వారా ఏర్పడే శక్తి, అలాంటి శక్తిని పొందగలిగిన విధానం, ఆ విధానాన్ని పాటించగలిగిన నేర్పరితనం ఇత్యాది విషయాలన్నింటి గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అందుకోసం  మనం ఈ శరీర నిర్మాణ వ్యవస్థ గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి.

శరీరం అంటే కండలు పెంచడం కాదు, ఆరోగ్యంగా ఉండటమే కాదు, సమయానికి సముచిత ఆహారాన్ని దానికి అందించడం మాత్రమే కాదు, దానికి తగిన విశ్రాంతిని ఇవ్వడం ఒక్కటే కాదు. వాటన్నింటినీ సమకూర్చినప్పుడు అది ఇవ్వగలిగిన ఆంతరంగిక శక్తిని మనం పొందగలిగినప్పుడే మనం శరీరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు లెక్క.  

ఇలా శరీరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన మెలకువలు అన్నీ భారతీయ సనాతన విద్యలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆ మెలకువలను అర్థం చేసుకుని శరీరాన్ని సార్ధకం చేసుకుందాం.

No comments:

Post a Comment