మనిషి జీవన వేగం పెరిగింది. పిల్లల్ని పెంచడం మాట అంటుంచుతే తనని తాను సరిదిద్దుకునే సమయం కూడా ఎవరికీ ఉండటం లేదు. పోనీలే గుర్తు చేద్దాం అనుకున్నా, అసలు చెప్పిన మాట వినటమే మానేశారు. అంతెందుకు .. జెన్ జీ, ఆల్ఫా జీ పిల్లలికి అమ్మమ్మలు తాతయ్యలు అంటే ఎవరో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఋషి సంప్రదాయం, దేశ సంస్కృతి కొత్త తరాలకు అందేది ఎలా?
రామాయణ భాగవతాలు విని పెరిగిన పిల్లలు ఇప్పుడు కోటికి ఒకరిద్దరే ఉన్నారు. పురాణ హీరోల స్థానంలోకి సినిమా హీరోలు, కార్టూన్ హీరోలు వచ్చేసారు. జీవితాన్ని సరిదిద్దుకునే సమయం లేని తల్లిదండ్రుల చేతుల్లో, జీవితం అంటే ఏమిటో తెలియకుండా పిల్లలు పెరుగుతున్నారు. ప్రపంచ పోకడని సాకుగా చూపెట్టి జీవన క్రమశిక్షణని గంగలో కలిపేశారు.
గత మూడు దశాబ్దాలుగా spirituality, yoga, meditation పేరుతో వేద విజ్ఞానం మొత్తం వాణిజ్య వస్తువు అయిపోయింది. అభ్యాసంతో అనుభవాన్ని పొందే ఋషి మార్గం మూతబడింది. పఠనం చేసి ప్రవచనాలు చెప్పటం ప్రబలిపోయింది. అనుభవంతో నేర్పించేవారు లేక ఆచార సాంప్రదాయాలకు బూజు పట్టింది. ఫలితంగా ఆధ్యాత్మ ఆచరణ అటకెక్కింది.
ఆహారం తీసుకుంటేనే ఆకలి తీరుతుంది. అనుభవజ్ఞులను అనుసరిస్తేనే జీవితం ఆనందమయం అవుతుంది. ప్రకృతి నియమాలు, జీవన సూత్రాలు ఎప్పటికీ మారవు. ఇప్పటికైనా మేల్కొని జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకుందాం. ఋషి జీవనాన్ని అలవాటు చేసుకుందాం. జీవన విలువలను నేర్చుకుందాం - నేర్పిద్దాం.